అమెరికా అతివల స్వరం... మన మినీ తిమ్మరాజు!

ABN , First Publish Date - 2022-01-03T13:27:09+05:30 IST

‘‘నా భర్త శ్వేత జాతీయుడైన అమెరికన్‌. నేను ఇండో-అమెరికన్‌ని. మేము దత్తత తీసుకున్న అబ్బాయిలునల్ల జాతీయులు. మాది బహుళ సంస్కృతుల, బహుళ జాతుల కుటుంబం’’ అంటారు మినీ తిమ్మరాజు అమెరికాకు వలస వెళ్ళిన తెలుగు కుటుంబానికి చెందిన..

అమెరికా అతివల స్వరం... మన మినీ తిమ్మరాజు!

‘‘నా భర్త శ్వేత జాతీయుడైన అమెరికన్‌. నేను ఇండో-అమెరికన్‌ని. మేము దత్తత తీసుకున్న అబ్బాయిలునల్ల జాతీయులు. మాది బహుళ సంస్కృతుల, బహుళ జాతుల కుటుంబం’’ అంటారు మినీ తిమ్మరాజు అమెరికాకు వలస వెళ్ళిన తెలుగు కుటుంబానికి చెందిన మినీ అక్కడ రాజకీయాల్లో, పౌర ఉద్యమాల్లో చురుకైనపాత్ర పోషిస్తున్నారు. అమెరికాలో మహిళల ప్రత్యుత్పత్తి హక్కుల కోసం పోరాడుతున్న‘ఎన్‌ఎఆర్‌ఎఎల్‌ ప్రో- ఛాయిస్‌ అమెరికా’’ సంస్థకు అధ్యక్షురాలుగా ఇటీవలే ఆమె ఎన్నికయ్యారు.


బాల్యంలో తనకు ఎదురైన అనుభవాలు ప్రపంచం పట్ల తనదైన దృక్పథం రూపుదిద్దుకోవడానికి కారణమయ్యాయని చెబుతారు మినీ తిమ్మరాజు. ‘‘1970, 80ల్లో న్యూయార్క్‌, న్యూజెర్సీ ప్రాంతాల్లో... శ్వేతేతరుల్ని ద్వేషించే బృందం ఒకటి ఉండేది. ఆ ప్రాంతాల్లో మాలాంటి మైనారిటీల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. ఆ బృందం సభ్యులు ఎలాంటి చర్యలకు తెగబడతారోననే భయాన్ని చిన్నప్పుడు మా వాళ్ళలో నేను ఎన్నో సార్లు చూశాను. మా పొరుగున ఉండే క్రైస్తవులు, యూదులు మాకు ఎంతో అండగా నిలిచేవారు. అప్పుడూ, ఇప్పుడూ శ్వేతజాతీయులు కానివారి విజయాల్ని చూసి ఓర్వలేని వారి సంఖ్య చాలా తక్కువ. అయినా వాళ్ళ గొంతు చాలా పెద్దది’’ అని అంటారామె.


హైస్కూల్‌లో కూడా ఆమెకు ఇటువంటి అనుభవాలు ఎదురయ్యాయి. విద్యార్థుల మధ్య నిర్వహించే చర్చల సందర్భంగా మినీ వ్యక్తం చేసిన అభిప్రాయాలు నచ్చని ఒక టీచర్‌... ‘‘నీకు ఈ దేశం నచ్చకపోతే తిరిగి వెనక్కి వెళ్ళు’’ అంటూ అవమానంగా మాట్లాడారు. అయితే ఇంట్లో అన్ని విషయాలనూ స్వేచ్ఛగా చర్చించే వాతావరణాన్ని తన తల్లితండ్రులు కల్పించారనీ, అది ఆలోచనా పరిధి విస్తృతం కావడానికి దోహదపడిందనీ అంటారామె. ఆ స్వేచ్ఛే... చాలామందిలా కార్పొరేట్‌ ఉద్యోగాలను కాకుండా... భిన్నమైన కెరీర్‌ను ఎంచుకోవడానికి దోహదపడింది. అయితే తన ఎంపిక తల్లితండ్రులకు అప్పట్లో సంతృప్తి కలిగించలేదంటారామె.



హిల్లరీ, బైడెన్‌ ప్రచార వ్యూహకర్తగా...‘యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా-బర్కిలీ’, ‘యూనివర్సిటీ ఆఫ్‌ హూస్టన్‌ లా సెంటర్‌’లలో ఆమె ఉన్నత విద్య సాగింది. ఆ తరువాత అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో జాతీయ, స్థానిక రాజకీయ సంస్థల్లో వివిధ హోదాల్లో పని చేశారు. డెమొక్రటిక్‌ పార్టీలో క్రియాశీలంగా ఉన్న మినీ 2015-16 మధ్య అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్‌కు ‘నేషనల్‌ ఉమెన్‌ ఓట్‌ డైరెక్టర్‌’గా వ్యవహరించారు. ఎన్నికల ప్రచారంలో మహిళల భాగస్వామ్యం గరిష్టంగా ఉండేలా ఒక వ్యూహాన్ని రూపొందించడంలో, అమలు చేయడంలో కీలక పాత్ర వహించారు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కూడా ప్రచార సలహాదారుగా ఉన్నారు. పౌర హక్కుల రంగంలో అందించిన సేవలకు పురస్కారాలు సైతం అందుకున్నారు. ‘ప్లాన్డ్‌ పేరెంట్‌ హుడ్‌’ అనే సంస్థలో ముఖ్యమైన పదవిని నిర్వర్తించారు. తాజాగా ‘ఎన్‌ఎఆర్‌ఎఎల్‌ ప్రో ఛాయిస్‌ అమెరికా’కు తొలి శ్వేతేతర అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు. జాతి, జెండర్‌ సమస్యలపై 52 ఏళ్ల కిందట ప్రారంభమైన ఆ సంస్థకు పాతిక లక్షల మందికి పైగా సభ్యులున్నారు. మహిళల ప్రత్యుత్పత్తి హక్కుల కోసం ఆ సంస్థ ఎన్నో ఏళ్ళుగా పోరాటం చేస్తోంది. అమెరికాలో అబార్షన్‌ హక్కులపై ఆందోళనలు మళ్ళీ తీవ్రతరం అవుతున్నాయి. గత ఏడాది సెప్టెంబర్‌ ఒకటి నుంచి అబార్షన్‌ హక్కును టెక్సాస్‌ రాష్ట్రం రద్దు చేసింది. దీని ప్రకారం ఆరు వారాల తరువాత గర్భస్రావం చేయించుకోవడం చట్టవిరుద్ధం. ఇప్పటివరకూ 19 రాష్ట్రాలు అబార్షన్లను నిషేధిస్తూ చట్టాలు తెచ్చాయి. మరి కొన్ని రాష్ట్రాలు కూడా ఇదే బాటలో నడిచే ప్రయత్నంలో ఉన్న నేపథ్యంలో... మినీ నియామకం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. 


ఆ విషయంలో ఇండియా బెస్ట్‌...‘‘మిగిలిన దేశాలకన్నా అమెరికాలో ప్రజలకు తాము కోరుకున్నదాన్ని ఎంచుకొనే స్వేచ్ఛ, హక్కులు ఎక్కువగా ఉంటాయని మిగిలిన ప్రపంచం అనుకుంటుంది. నేను అబార్షన్‌ హక్కుల గురించి పోరాడుతున్నానని చెప్పినప్పుడు భారతదేశంలో నా బంధువులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే భారత దేశంలో గర్భస్రావం అనేది అందుబాటులో ఉండే ఎంపిక. ప్రత్యుత్పత్తి హక్కుల విషయంలో భారతదేశానికి ఒక ప్రగతిశీలమైన విధానం ఉంది. ప్రభుత్వం అమలు చేస్తున్న కుటుంబ సంక్షేమ విధానం కారణంగా గర్భస్రావానికి స్వేచ్ఛ ఉంది. కానీ అమెరికాలో ఇలాంటి హక్కుల కోసం లక్షలాది మహిళలు ఆందోళన చేయాల్సివస్తోంది. బిడ్డను కనాలో, వద్దనుకోవాలో ఎంచుకొనే స్వేచ్ఛ తమకు కావాలని వారు కోరుకుంటున్నారు’’ అంటున్నారు మినీ. గత ఇరవయ్యేళ్ళుగా... ప్రత్యుత్పత్తి, లింగ, జాతి వివక్షల్లో న్యాయం కోసం ఆమె పోరాడుతున్నారు. త్వరలోనే అబార్షన్‌ హక్కుపై సానుకూలమైన నిర్ణయాలను అటు చట్ట సభలు, ఇటు న్యాయస్థానాలు తీసుకొనేలా లాబీయింగ్‌ చేస్తామని ఆమె చెబుతున్నారు. దేశంలోని మొత్తం యాభై రాష్ట్రాల్లో గర్భస్రావ హక్కును కాపాడే నిమిత్తం ‘మహిళల ఆరోగ్య సంరక్షణ చట్టం’ ఆమోదం పొందడానికి పాతిక లక్షల మంది ఎన్‌ఎఆర్‌ఎఎల్‌ సభ్యుల ద్వారా మద్దతును కూడగతున్నారు. త్వరలోనే ఈ బిల్లు అమెరికా ప్రతినిధుల సభ ముందుకు రాబోతోంది.



పుట్టింది ఇక్కడే...భారతీయ మూలాలను అమితంగా ప్రేమించే మినీ తన దత్తపుత్రులకు కృష్ణ, సత్య అని తన తాతల పేరు పెట్టుకున్నారు. ‘‘భారతీయ శాస్త్రీయ కళలపై నా ఆసక్తిని చూసి మా నాన్న ఎంతో ఆనందించేవారు. నేను కూచిపూడి నాట్యం నేర్చుకున్నాను. తబలా బాగా వాయించగలను. నా అసలు పేరు రుక్మిణి. రవీంద్రనాథ్‌ టాగూర్‌ ప్రసిద్ధ రచన ‘కాబూలీవాలా’లో ‘మినీ’ అనే బాలిక పాత్ర ఉంది. ఆ పేరుతో మా తాతగారు నన్ను ముద్దుగా పిలిచేవారు. అదే స్థిరపడిపోయింది. నేను పుట్టకముందే నా తల్లితండ్రులు అమెరికాలో ఉండేవారు, కానీ నేను పుట్టింది భారత దేశంలోనే. గర్భవతిగా ఉన్న మా అమ్మ... ఆమె తల్లి, తోబుట్టువుల మధ్య ప్రసవించాలని కోరుకొని హైదరాబాద్‌ వచ్చింది’’ అని చెబుతున్న మినీ... ప్రత్యుత్పత్తి హక్కులపై అమెరికన్‌ మహిళల ఆందోళనకు త్వరలోనే సానుకూలమైన ముగింపు లభిస్తుందన్న ఆశాభావంతో ఉద్యమాన్ని కొనసాగిస్తానంటున్నారు.




Updated Date - 2022-01-03T13:27:09+05:30 IST