వీసా లేక 12 ఏళ్లుగా సౌదీలోనే తెలుగు మహిళ.. మానసికంగా కుంగిపోయి పక్షవాతం.. చివరికి

ABN , First Publish Date - 2022-04-13T13:38:52+05:30 IST

కుటుంబ బంగారు భవిష్యత్తు కోసం ఉపాధి వెతుక్కుంటూ ఎడారి దేశానికి వెళ్లిన ఆ అమ్మ ఏళ్ల తరబడి రేయింబవళ్లు శ్రమించింది. నాలుగు డబ్బులు సంపాదించి నలుగురు కుమార్తెలు, కుమారుడికి ఘనంగా పెళ్లిళ్లు చేసింది. కానీ.. ఒక్కరి వివాహానికి కూడా హాజరు కాలేకపోయింది. ఏజెంట్‌ చేతిలో మోసపోయి వర్క్‌ వీసాపై కాకుండా విజిటింగ్‌ వీసా..

వీసా లేక 12 ఏళ్లుగా సౌదీలోనే తెలుగు మహిళ.. మానసికంగా కుంగిపోయి పక్షవాతం.. చివరికి

ఉపాధి నిమిత్తం వెళ్లిన తిరుపతి మహిళ

విజిటింగ్‌ వీసాతో పడరాని పాట్లు

ఎంబసీ సాయంతో ఎట్టకేలకు స్వగ్రామానికి

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి): కుటుంబ బంగారు భవిష్యత్తు కోసం ఉపాధి వెతుక్కుంటూ ఎడారి దేశానికి వెళ్లిన ఆ అమ్మ ఏళ్ల తరబడి రేయింబవళ్లు శ్రమించింది. నాలుగు డబ్బులు సంపాదించి నలుగురు కుమార్తెలు, కుమారుడికి ఘనంగా పెళ్లిళ్లు చేసింది. కానీ.. ఒక్కరి వివాహానికి కూడా హాజరు కాలేకపోయింది. ఏజెంట్‌ చేతిలో మోసపోయి వర్క్‌ వీసాపై కాకుండా విజిటింగ్‌ వీసాపై వెళ్లిన ఆమె.. 12 ఏళ్లకుపైగా సౌదీలోనే ఇరుక్కుపోయింది. ఇంటిమీద బెంగతో పక్షవాతానికి గురైన ఆమె ఎట్టకేలకు అధికారుల చొరవతో అతికష్టమ్మీద వీల్‌చైర్‌లో సొంతగడ్డపై అడుగుపెట్టింది. తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండలం నెరవాలు గ్రామానికి చెందిన సలాప్షి ముణెమ్మ.. భర్త చనిపోవడంతో తన పిల్లల భవిష్యత్తు కోసం శివ అనే దళారీ సాయంతో 12 ఏళ్ల క్రితం సౌదీఅరేబియాకు వచ్చింది. 


ఉపాధి వీసాపై కాకండా విజిటింగ్‌ వీసాపై వచ్చిన ముణెమ్మ వద్ద నుంచి పాస్‌పోర్టు తీసేసుకున్న ఓ అరబ్బు మహిళ ఆమెను రియాధ్‌లోని తన బంధువులకు అప్పగించింది. వారు ఆమెను బాగానే చూసుకున్నారు. క్రమం తప్పకుండా వేతనం చెల్లించారు. ఈ క్రమంలో ఆమె 12 ఏళ్లపాటు రియాధ్‌లోనే పనిచేసింది. అయితే అరబ్బు మహిళ చనిపోవడంతో ముణెమ్మ పాస్‌పోర్టు జాడ ఎవరికీ తెలియలేదు. దీంతో ఆమె రియాధ్‌లోనే ఇరుక్కుపోవాల్సి వచ్చింది. బాహ్య ప్రపంచంతో ఆమెకు ఎలాంటి సంబంధం లేకుండా పోయింది. కనీసం ఏ ప్రాంతంలో ఉందో కూడా తెలియకుండా గడిపింది. సౌదీకి రాక ముందు ముణెమ్మ సుమారు 10 ఏళ్లపాటు కువైత్‌లో కూడా పనిచేసింది. గల్ఫ్‌ దేశాలలో పనిచేసిన సుమారు రెండు దశాబ్దల కాలంలో ఆమె తన నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడికి పెళ్లిళ్లు ఘనంగా జరిపించినా తాను మాత్రం ఎవరి పెళ్లికీ రాలేకపోయింది. 


అయితే, ఇన్నేళ్లపాటు కుటుంబానికి దూరంగా ఉన్న ఆమె.. ఇక తాను స్వదేశానికి తిరిగి వెళ్లలేనేమో అని మధనపడుతూ అనారోగ్యానికి గురైంది. మెదడు దెబ్బతిని పక్షవాతం వచ్చింది. దీంతో ఇంటి యజమాని ఆమెకు వైద్యం చేయించి తిరుపతికి పంపించాలని భావించినా.. పాస్‌పోర్టు లేకపోవడం, దీనికితోడు ఆమె వేలి ముద్రలను ఇమ్మిగ్రేషన్‌ గుర్తించలేకపోవడంతో ముణెమ్మ రెండుసార్లు విమానశ్రాయం వరకూ వెళ్లి వెనక్కు వచ్చేసింది. చివరకు రియాధ్‌లోని భారతీయ ఎంబసీ, మంగళగిరిలోని ఏపీ ఎన్‌ఆర్‌టీ, రియాధ్‌లోని ప్రవాసాంధ్ర ప్రముఖుడు రేవల్‌ ఆంథోని చొరవతో ఆమె సోమవారం స్వదేశానికి తిరిగొచ్చింది. ప్రస్తుతం తిరుపతిలో చికిత్స పొందుతోంది.

Updated Date - 2022-04-13T13:38:52+05:30 IST