‘రైతు కోసం తెలుగుదేశం’ ర్యాలీ అడ్డగింత

ABN , First Publish Date - 2021-09-18T05:57:30+05:30 IST

తెలుగుదేశం పార్టీ శ్రేణులు మండ లంలో శుక్రవారం చేపట్టిన ‘రైతు కోసం తెలుగుదేశం’ ర్యాలీని అనుమతులు లేవంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనితలకు ర్యాలీకి వెళ్ల వద్దని ధర్మవరం వద్ద పోలీసులు అభ్యంతరం తెలిపారు.

‘రైతు కోసం తెలుగుదేశం’ ర్యాలీ అడ్డగింత
రోడ్డుపై బైఠాయించిన మాజీ హోం మంత్రి చినరాజప్ప, వంగలపూడి అనిత

 రోడ్డుపై  బైఠాయించిన మాజీ హోం మంత్రి చినరాజప్ప, పొలిట్‌ బ్యూరో సభ్యురాలు అనిత 

 పోలీసుల తీరుపై ఆగ్రహం 

ఎస్‌.రాయవరం, సెప్టెంబరు 17 : తెలుగుదేశం పార్టీ శ్రేణులు మండ లంలో శుక్రవారం చేపట్టిన ‘రైతు కోసం తెలుగుదేశం’ ర్యాలీని అనుమతులు లేవంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనితలకు ర్యాలీకి వెళ్ల వద్దని ధర్మవరం వద్ద పోలీసులు అభ్యంతరం తెలిపారు.  తాము ధర్మవరం నుంచి ఎస్‌.రాయవరం తహసీల్దార్‌ కార్యాలయం వరకూ ర్యాలీగా వెళ్లి, వినతిపత్రం అందించి వెనుదిరుగుతామని వారు చెప్పారు. అయినప్పటికీ పోలీసులు అనుమతించక పోవడంతో పార్టీ శ్రేణులంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  కనీసం వినతి పత్రాన్ని తీసుకోవడానికైనా తహసీల్దార్‌ను ధర్మవరం తీసుకు రావాలంటూ  చినరాజప్ప, అనితలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అయినప్పటికీ పోలీసులు అంగీకరించకపోవడంతో ధర్మవరం దుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి వినతిపత్రం సమర్పించారు.

‘ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం’

ధర్మవరంలో చినరాజప్ప విలేఖర్లతో మాట్లాడుతూ ప్రస్తుతం జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఉన్నది రైతు వ్యతిరేక ప్రభుత్వమన్నారు. రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు ఇవ్వలేదని, గత ఏడాది షుగర్‌ ఫ్యాక్టరీలకు చెరకు సరఫరా చేసిన రైతులకు బకాయిలు ఎప్పుడిస్తారో తెలియని దుస్థితి నెల కొందని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించిన వారిని కక్షసాధింపు చర్యలతో అరెస్టులు చేస్తున్నారన్నారు. అడుగడుగునా ప్రజాస్వామ్యాన్ని పాలకులు, పోలీసులు ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. అనిత మాట్లాడుతూ టీడీపీ అధికారంలో ఉండగా, ప్రతిపక్షనేతగా ఉన్న జగన్‌ పాదయాత్రకు తమ నేత చంద్రబాబునాయుడు అనుమతులిస్తేనే ఆయన పాదయాత్ర చేయగలిగారన్నారు. ప్రతిపక్ష పార్టీలు శాంతియుతంగా చేపట్టే కార్యక్రమాలను కూడా పోలీసులను పెట్టి అడ్డుకోవడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌.రాయవరం మాజీ ఎంపీపీ ఏజర్ల వినోద్‌రాజు, కోటవురట్ల, ఎస్‌.రాయవరం, నక్క పల్లి, పాయకరావుపేట టీడీపీ మండల శాఖ అధ్యక్షులు లాలం కాశీనాయుడు, నల్లపరాజు వెంకట్రాజు, కురందాసు నూక రాజు, పెదిరెడ్డి చిట్టిబాబు, నేతలు కొప్పిశెట్టి వెంకటేశ్‌, గుర్రం రామకృష్ణ, వజ్రపు శంకరరావు, తన్నీరు ఎరకయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-18T05:57:30+05:30 IST