తాత్కాలికానికి బ్రేక్‌

ABN , First Publish Date - 2022-07-02T12:54:16+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో తాత్కాలిక ఉపాధ్యాయ నియామకాలకు మద్రాస్‌ హైకోర్టు మదురై ధర్మాసనం బ్రేక్‌ వేసింది. తాత్కాలిక నియామకాలకు సంబంధించి గత

తాత్కాలికానికి బ్రేక్‌

- ఉపాధ్యాయ నియామకాల ప్రకటన రద్దు

- మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన మదురై ధర్మాసనం


పెరంబూర్‌(చెన్నై), జూలై 1: ప్రభుత్వ పాఠశాలల్లో తాత్కాలిక ఉపాధ్యాయ నియామకాలకు మద్రాస్‌ హైకోర్టు మదురై ధర్మాసనం బ్రేక్‌ వేసింది. తాత్కాలిక నియామకాలకు సంబంధించి గత నెల 23న రాష్ట్ర ప్రభుత్వం  చేసిన ప్రకటన నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. తదుపరి విచారణ ఈ నెల 8వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు మదురై ధర్మాసనం న్యాయమూర్తి జస్టిస్‌ ఎంఎస్‌ రమేష్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా తాత్కాలిక నియామకాలను చేపట్టాలని ప్రభుత్వం ఎందుకు భావిస్తోందో, శాశ్వత ప్రాతిపదికన నియామకాలకు ప్రభుత్వానికున్న సమస్యలేంటో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించిన న్యాయమూర్తి.. పిటిషన్‌పై ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఏమాత్రం సంతృప్తికరంగా లేదన్నారు. తాత్కాలిక నియామకాల కోసం ప్రభుత్వం ప్రతిపాదించిన నిబంధనలు సక్రమంగా లేవని, ప్రభుత్వ నిర్ణయంతో తాత్కాలిక నియామకాల్లో రాజకీయ, అధికార యంత్రాంగ జోక్యం పెరుగుతున్నందున దీనిని అడ్డుకోవాలని అభ్యర్థిస్తూ టెట్‌ విజేతల నిరుద్యోగ సంఘం అధ్యక్షురాలు షీలా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె పిటిషన్‌పై న్యాయమూర్తి సమక్షంలో గురు, శుక్రవారాల్లో విచారణ జరిగింది. రాష్ట్రప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఇంటర్మీడియట్‌, డిగ్రీ, పీజీ టీచర్ల పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు గత నెల 23వ తేది రాష్ట్రప్రభుత్వం ప్రకటన విడుదల చేసిందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది గుర్తు చేశారు. 2013లో జరిగిన టెట్‌లో ఉత్తీర్ణులైన వేలాదిమందిని అప్పటినుంచి వెయిటేజ్‌ విధానంలో విధులకు ఎంపిక చేయలేదన్నారు. ఈ నేపథ్యంలో తాత్కాలిక ప్రాతిపదికన ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తామన్న ప్రభుత్వం.. ఎంపికకు సరైన విధివిధానాలు తెలియజేయలేదన్నారు. ఆయా జిల్లాల విద్యాధికారులు, రాజకీయనేతలు తమకు అనుకూలమైన వారు, అర్హత లేని వారిని నియమించే అవకాశముందని, వీటిని పరిగణలోకి తీసుకొని తాత్కాలిక ఉపాధ్యాయుల భర్తీ ప్రకటన రద్దు చేయాలని అభ్యర్థించారు. పిటిషనర్‌ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు వెలువరించారు. 

Updated Date - 2022-07-02T12:54:16+05:30 IST