అసంపూర్తిగా ఉన్న ఆలయ నిర్మాణం
మూడేళ్లయినా పూర్తికాని వేణుగోపాలస్వామి ఆలయ నిర్మాణం
పట్టించుకోని అధికారులు
జగదేవ్‌పూర్, మార్చి 27 : అధికారుల అలసత్వమో, కాంట్రాక్టర్ నిర్లక్ష్యమో కానీ ఆలయ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. జగదేవ్‌పూర్ మండలం తిగుల్ గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆలయం ఉన్నది. ఇది దశాబ్దాలు క్రితం నిర్మించడంతో శిథిలావస్థకు చేరుకున్నది. ఆలయానికి నిధులు మంజూరుచేసి ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలని గ్రామ ప్రజాప్రతినిధులు, నాయకులు అధికారులకు, మంత్రి హరీశ్‌రావుకు విన్నవించారు. దీంతో స్పందించిన మంత్రి దేవాదాయశాఖ నుంచి రూ.28 లక్షలను మంజూరు చేశారు. మూడేళ్ల క్రితం ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించారు. ప్రారంభంలో పనులు చకచక జరిగినా తదుపరి నత్తనడకన సాగాయి. పనుల్లో వేగం పెంచాలని సదరు కాంట్రాక్టర్‌కు, అధికారులకు ప్రజాప్రతినిధులు చెప్పినా పనుల్లో పురోగతి కనిపించలేదు. ఈ క్రమంలో సర్పంచ్ భానుప్రకాష్ సైతం కాంట్రాక్టర్‌కు లిఖితపూర్వకంగా చెప్పినా పనులు మాత్రం ముందుకుసాగడం లేదు. ఆలయం గోపురం గుడి పనులు పూర్తిగా ప్లాస్టరింగ్ ఆలయ ప్రాంగణం గోడలు పూర్తి చేయాల్సి ఉన్నది. వీటిని వెంటనే పూర్తిచేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
త్వరగా పూర్తిచేస్తాం : ఈవో
తిగుల్ గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు త్వరలోనే పూర్తిచేస్తాం. పనుల్లో కొంత జాప్యం జరిగిన విషయం వాస్తవమే. సదరు కాంట్రాక్టర్‌కు కూడా పనులు పూర్తిచేయాలని సూచించాం.