
- వీఐపీ దర్శనాల పేరుతో భక్తులకు ఇబ్బంది పెట్టొద్దు
- దేవుడు కూడా క్షమించడు
- సామాన్యులపై వివక్ష చూపొద్దు
- వీఐపీల వెంట బంధుగణం, సిబ్బందిని అనుమతించొద్దు
- మద్రాస్ హైకోర్టు సంచలనవ్యాఖ్యలు
చెన్నై: ‘‘ఆలయానికి దేవుడు మాత్రమే వీఐపీ. వీఐపీ దర్శనాల పేరుతో సామాన్య భక్తుల్ని ఇబ్బంది పెడితే దేవుడు కూడా క్షమించడు. వీఐపీలు, ఇతర భక్తుల మధ్య వివక్ష చూపవద్దు. ఏ పరిస్థితుల్లోనైనా వీఐపీ దర్శనం వల్ల ఇతర భక్తులు, పౌరుల హక్కులకు భంగం కలగరాదు. సామాన్యుల దర్శనానికి అసౌకర్యం కలిగించరాదు. దీనికి ఆలయ అధికారులదే బాధ్యత. మతంపై నమ్మకం ఉన్న వారు ఆలయాలకు వస్తుంటారు. వీఐపీలు కూడా భక్తులుగానే దర్శనానికి వస్తుంటారు’’ అంటూ ఓ కేసు విచారణలో మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ సుబ్రమణ్యం సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులోని తిరుచెందూర్ సుబ్రమణ్య స్వామి ఆలయంలో పనిచేసిన సీతారామన్ అనే అర్చకుడు తనపై విధించిన సస్పెన్షన్ను తొలగించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణ సందర్భంగా ఆలయంలో చోటు చేసుకున్న అవకతవకలు కోర్టు దృష్టికి వచ్చాయి. ఆలయానికి భద్రత కల్పించాల్సిందిగా తమిళనాడు డీజీపీని ఆదేశించింది. బుధవారం న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ సుబ్రమణ్యం ఎదుట ఇరు పక్షాల న్యాయవాదులు వాదనలు వినిపించారు. అనంతరం న్యాయమూర్తి మాట్లాడుతూ.. భక్తులను అనుచితంగా దూషించే ఆలయ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆలయాలకు వచ్చే భక్తులతో ఉద్యోగులు, పోలీసులు మర్యాదగా నడుచుకోవాలని సూచించారు. భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకునేందుకు గరువారం నుంచి 40 మంది సాయుధ రిజర్వ్ పోలీసులను నియమించాలని, అవసరమైతే మరింతమందిని కేటాయించాలని ఆదేశించారు. ఆలయాల్లో వీఐపీ దర్శనాల పేరుతో సామాన్య భక్తులకు ఇబ్బందులు పెట్టడం ఆవేదన కలిగిస్తోందన్నారు. రద్దీగా ఉండే ఆలయాల వంటి చోట్ల వీఐపీ సంస్కృతితో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని వ్యాఖ్యానించారు. దర్శనానికి వీఐపీలు, వారి కుటుంబ సభ్యులను మాత్రమే అనుమతించాలని స్పష్టం చేశారు. ఇతర బంధువులను అనుమతించవద్దని ఆదేశించారు. ప్రత్యేక దర్శనానికి వీఐపీలతో పాటు భద్రత సిబ్బందిని, ఇతర ఉద్యోగులను అనుమతించవద్దని స్పష్టం చేశారు. వీరిని ఇతర భక్తుల మాదిరిగానే క్యూలో అనుమతించాలని పేర్కొన్నారు. ప్రత్యేక దర్శనాన్ని 10 నిమిషాలు మాత్రమే అనుమతించాలని స్పష్టం చేశారు. ఆలయ ప్రత్యేక దర్శన టికెట్ల అవకతవకలకు సంబంధించి బాధ్యులైన ఉద్యోగులపై చర్యలు చేపట్టాల్సిందేనన్నారు. ఆలయంలో భద్రత, పరిశుభ్రత, తాగునీరు తదితరాలను మూడు వారాల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తదుపరి విచారణను ఏప్రిల్ 15వ తేదీకి వాయిదా వేశారు.
ఇవి కూడా చదవండి