జై భవానీ!

ABN , First Publish Date - 2022-10-01T05:28:52+05:30 IST

దసరా ఉత్సవాల నేపథ్యంలో శనివారం నుంచి భారీ సంఖ్యలో భవానీలు తరలిరాబోతున్నారు.

జై భవానీ!

నేటి నుంచి పెద్ద సంఖ్యలో తరలిరానున్న భవానీలు 

లక్షన్నర మంది వస్తారని అంచనా 

హోమగుండం లేకపోవటంతో.. నేతి కొబ్బరికాయలను

 సమర్పించనున్న భవానీలు 

(ఆంధ్రజ్యోతి, విజయవాడ/వన్‌టౌన్‌) : 

 దసరా ఉత్సవాల నేపథ్యంలో శనివారం నుంచి భారీ సంఖ్యలో భవానీలు తరలిరాబోతున్నారు. లక్షన్నర మందికి పైగా మాల దీక్షాపరులు అమ్మవారిని దర్శించుకోవటానికి రానున్నారని తెలుస్తోంది. గతంలో కొండ దిగువున హోమగుండాన్ని వెలిగించేవారు. ఈసారి హోమగుండంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో భవానీలు తమ వెంట తీసుకువచ్చే నేతి కొబ్బరికాయను అమ్మ చెంత వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు భవానీ దీక్షా మండలి నుంచి ఆదేశాలు వెళ్లాయి. రాష్ట్ర వ్యాప్తంగా భవానీ దీక్షలను చేపట్టిన వారు నేతి కొబ్బరికాయలను తీసుకువచ్చి అమ్మ చెంతన వదిలి పెట్టనున్నారు. దసరా ఉత్సవాల ప్రారంభం నుంచే స్వల్ప సంఖ్యలో భవానీలు వస్తున్నారు. శనివారం నుంచి భవానీల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఏటా ఆరవ రోజు నుంచి భవానీలు పోటెత్తుతుంటారు. లక్ష మంది దసరా ఉత్సవాల సందర్భంగా వస్తుంటారు. ఈసారి భవానీ దీక్షను చేపట్టిన వారి సంఖ్య భారీగా ఉందని తెలుస్తోంది. కొవిడ్‌  పరిస్థితుల అనంతరం.. ఈసారి అధిక సంఖ్యలో భవానీలు వచ్చే అవకాశం ఉందని దేవస్థాన అధికారులు చెబుతున్నారు. రెండు లక్షల మంది వరకు వచ్చినా ఆశ్చర్య పోనక్కరలేదని అంటున్నారు. అమ్మ దర్శనానికి వచ్చే భవానీలలో ఎక్కువ భాగం తెలంగాణా ప్రాంతం వారే ఉండబోతున్నారని తెలుస్తోంది. 

 తెలంగాణ నుంచి ఎక్కువగా రాక

నాలుగు రోజులుగా దుర్గమ్మను దర్శించుకోవటానికి వస్తున్న భవానీలు ఎక్కువగా తెలంగాణా ప్రాంతం నుంచే వస్తున్నారు. తెలంగాణా ప్రాంతం నుంచి కార్లలో వచ్చి.. ఇక్కడ దుర్గాఘాట్‌కు నడుచుకుని వచ్చి స్నానమాచరించిన తర్వాత.. ఇరుముడితో కాలబాటన క్యూలలోకి చేరి ఘాట్‌ మార్గం మీదుగా కొండ మీదకు వచ్చి అమ్మను దర్శించుకుంటున్నారు. శనివారం నుంచి ఏపీ నలుమూలల నుంచి భవానీలు తరలి రానున్నారు. ప్రధానంగా ఉత్తరాంధ్ర నుంచి వందల కిలోమీటర్ల కాలిబాటన నడుచుకుంటూ వచ్చే భవనాలు శని, ఆది, సోమవారాల నాటికి విజయవాడ చేరుకోనున్నారు. వీరంతా అభ్యంగన స్నానాలు పూర్తి చేసుకుని అమ్మను దర్శించుకుంటారు. తెలంగాణా, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే భవానీ భక్తులతో పాటు, ఏపీ నుంచి వచ్చే భవానీ భక్తులంతా కూడా అమ్మను దర్శించుకున్న తర్వాత.. కొండ మీద ఉన్న భవానీ దీక్షా మండపంలో పూజలు నిర్వహించనున్నారు. కొంత మంది భవానీ దీక్షలను కూడా ఇక్కడి నుంచే ప్రారంభిస్తారు. నిర్ణీత దీక్ష పూర్తి చేసుకున్న తర్వాత దసరా ఉత్సవాల అనంతరం దేవస్థాన సిబ్బంది నిర్వహించే భవానీ దీక్షల విరమణ కార్యక్రమంలో అశేష సంఖ్యలో భవానీ భక్తులు అమ్మవారిని దర్శించుకోనున్నారు.  


Updated Date - 2022-10-01T05:28:52+05:30 IST