పునః‘దర్శనం’!

ABN , First Publish Date - 2021-06-20T05:42:53+05:30 IST

జిల్లాలో అన్ని దేవాలయాలు ఆదివారం నుంచి తెరుచుకోనున్నాయి. కరోనా వ్యాప్తి... కర్ఫ్యూ ఆంక్షల కారణంగా కొన్ని నెలల కిందట దేవాలయాల్లో భక్తులకు అనుమతి నిలిపేశారు. కేవలం అర్చకుల ఆధ్వర్యంలోనే తలుపులు తెరిచి పూజలు చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, కర్ఫ్యూ ఆంక్షలు సడలించడంతో.. దేవాలయాలు కూడా తెరవనున్నారు.

పునః‘దర్శనం’!
కల్యాణ మహోత్సవాలకు సిద్ధం చేసిన పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలు

 నేటి నుంచి తెరచుకోనున్న దేవాలయాలు

 ఉదయం 6 నుంచి మధ్యాహ్నం వరకే భక్తులకు అనుమతి

 కోవిడ్‌ నిబంధనలు తప్పనిసరి

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి/గార/జలుమూరు, జూన్‌ 19: జిల్లాలో అన్ని దేవాలయాలు ఆదివారం నుంచి తెరుచుకోనున్నాయి. కరోనా వ్యాప్తి... కర్ఫ్యూ ఆంక్షల కారణంగా కొన్ని నెలల కిందట దేవాలయాల్లో భక్తులకు అనుమతి నిలిపేశారు. కేవలం అర్చకుల ఆధ్వర్యంలోనే తలుపులు తెరిచి పూజలు చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, కర్ఫ్యూ ఆంక్షలు సడలించడంతో.. దేవాలయాలు కూడా తెరవనున్నారు. దైవదర్శనం కోసం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే భక్తులకు అనుమతిస్తారు. ముందుగానే థర్మల్‌ స్కానర్‌తో పరీక్షించి.. ఆలయంలోకి విడిచిపెడతారు. ఈ నేపథ్యంలో ఆదివారం జిల్లాలో ప్రసిద్ధి చెందిన అరసవల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగంతో పాటు అన్ని ఆలయాలు తెరచుకోనున్నాయి. భక్తులు కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని దేవదాయ శాఖ సహాయ కమిషనర్‌ టి.అన్నపూర్ణ సూచించారు. మాస్క్‌ ధరించి.. భౌతిక దూరం పాటించాలని, ఆలయాల్లో విగ్రహాలను తాకరాదని తెలిపారు.  అంతరాలయ దర్శనం, తీర్థం, శఠగోపం తాత్కాలికంగా నిలిపివేశామన్నారు.   శ్రీకూర్మంలో కూడా నేటి నుంచి దర్శనాలకు భక్తులను అనుమతించనున్నట్టు ఈవో విజయ్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 


నేటి నుంచి శ్రీముఖలింగేశ్వరుని కల్యాణోత్సవాలు

  దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగేశ్వరస్వామి పంచరాత్రి కల్యాణ మహోత్సవాలు ఈ నెల 20 నుంచి 25వ తేది వరకు నిర్వహిస్తున్నట్టు ఆలయ ఈవో ఎన్‌వీ రమణయ్య తెలిపారు. కొవిడ్‌ నిబంధలు పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు స్పష్టంచేశారు. 20న ధ్వజారోహణ (పందిర్రాట), 21న కల్యాణ మహోత్సవం, 22న స్వామి వారికి ప్రత్యేక పూజలు, 23న పండిత సదస్సు, 24న  దొంగవల్లి కార్యక్రమం ఉంటుందన్నారు. చివరి రోజు 25న స్వామి వారికి మంగళ స్నానాలు వంశధార నదిలో జరిపించి కల్యాణ మహోత్సవాలు ముగిస్తున్నట్టు ఆయన తెలిపారు. కాగా కరోనా నేపథ్యంలో భక్తులను అనుమతించడం లేదన్నారు. 

Updated Date - 2021-06-20T05:42:53+05:30 IST