కాంట్రాక్టర్లకు కాసులు.. రైతులకు కన్నీరు

ABN , First Publish Date - 2021-06-18T05:20:21+05:30 IST

కాంట్రాక్టర్లకు కాసులు.. రైతులకు కన్నీరు

కాంట్రాక్టర్లకు కాసులు.. రైతులకు కన్నీరు
బెల్లుపటియా వద్ద మరమ్మతుకు నోచుకోని కాలువ

- కాలువలు, గ్రోయిన్లకు తాత్కాలిక మరమ్మతులు

- ఇదీ పలు సాగునీటి వనరుల దుస్థితి

హరిపురం : మందస మండలంలో పలు నీటి వనరులపై కాలువలు, గ్రోయిన్లు తాత్కాలిక మరమ్మతుల పేరుతో కాంట్రాక్టర్లకు కాసులు కురిపిస్తున్నాయి. తూతూమంత్రంగా పనులు చేస్తుండడంతో భారీ వర్షాలు, తుఫాన్లకు కొట్టుకుపోవడంతో రైతులకు కన్నీరు తప్పడంలేదు. దశాబ్దాల తరబడి ఇలా జరుగుతున్నా నీటిపారుదలశాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు శాశ్వత మరమ్మతులకు చర్యలు తీసుకోవడంలేదు.  మందస మండలంలో దశాబ్దాల కిందట  నీటి వనరులపై నిర్మించిన సిమెంటు కట్టడాలు, రాతిపేర్పులు శిథిలావస్థకు చేరుకున్నాయి.  బలహీన పడడంతో వర్షాకాలంలో కొట్టుకు పోతున్నాయి.


ఆయకట్టుకు నీరందక

కళింగదల్‌, సునాముది, పొత్తంగి, డబార్సింగి, దామోదర సాగర్‌, సంకుజోడి, బాలిగాం వద్ద నిర్మించిన ఆనకట్టలు శిఽథిలావస్థకు చేరుకున్నాయి.దీంతో నీరు నిల్వకు అవకాశం లేకపోవడంతో శివారు ఆయకట్టుకు మొదటి పంటకే నీరందని దుస్థితి నెలకొంది.దీంతో రబీలో ఆరుతడి పంటలు వేసుకోవల్సివ స్తోందని రైతులు వాపోతున్నారు. ఈనేపథ్యంలో శాశ్వత మరమ్మతులకు ప్రభుత్వం నిధులు మంజూరుచేయడంలేదు. దీంతో అంతంతమాత్రంగా ఉన్న స్పిల్‌వేలు ఎప్పుడు కొట్టుకుపోతాయోనన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. టీడీపీ హయాంలో వీటి మరమ్మతులకు   నీరు-చెట్టు కింద పనులు మంజూరైనా అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో తూతూమంత్రంగా సాగాయి. 


తాత్కాలిక పనులతో.. 

మందస మండలంలో పొత్తంగి, జీఆర్‌పురం వద్ద మూలపొలం గ్రోయిన్‌, మహేంద్రతనయనదిలో పలు రాతికట్టలు రైతుల సౌకర్యార్థం నిర్మించారు.ఇవి ప్రతిఏటా వరద ఉధృతికి ఎక్కడో ఒకచోట కొట్టుకుపోవడంతో తాత్కాలిక మరమ్మతుల పేరుతో నిధులు మంజూరుచేస్తున్నారు. ఏటా లక్షలాది రూపాయలు ఖర్చవుతున్నా శాశ్వత పద్ధతిలో పనులు జరగకపోవడంతో  రైతులకు కడగండ్లు తప్పడంలేదు. 


కరోనాతో నిలిచిన పనులు..

కాలువలు, గ్రోయిన్ల మరమ్మతులను ఏటా జనవరిలో ప్రారంభించి ఖరీఫ్‌ నాటికి పూర్తిచేస్తారు. ఈ ఏడాది. ఏప్రిల్‌ మొదటివారంలో ప్రారంభించనున్న సమయంలో కరోనా రెండోవేవ్‌ ఉధృతివల్ల పనులు నిలిచిపోయాయి. దీనికితోడు కాలువల్లో  ఉపాధిహామీ నిధులతో పిచ్చిమొక్కలు సైతం తొలగించలేదు.ఈనేపథ్యంలో శివారు ఆయకట్టుకు నీరందే అవకాశం లేదని పలువురు వాపోతున్నారు. కాగా అన్ని విషయాలు పరిశీలించి ప్రతిపాదనలు సిద్ధంచేస్తామని  జలవనరుల శాఖ ఏఈ శ్రీనివాసరావు ఆంధ్రజ్యోతికి తెలిపారు. వచ్చే ఖరీఫ్‌కల్లా పూర్తిస్థాయి మరమ్మతులు చేయిస్తామని చెప్పారు. 

 

Updated Date - 2021-06-18T05:20:21+05:30 IST