పది పకడ్బందీగా ..

ABN , First Publish Date - 2022-05-20T06:34:42+05:30 IST

జిల్లాలో పదోతరగతి పరీ క్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

పది పకడ్బందీగా ..
నిర్మల్‌లోని ఈద్‌గాం ప్రభుత్వ ఉన్నత పాఠశాల

పదవ తరగతి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి

ఈ నెల 23 నుంచి ప్రారంభం

5 నిమిషాలకు వరకు లేటైనా అనుమతి

జిల్లాలో 48 పరీక్షా కేంద్రాలు

హాజరు కానున్న 9,693 విద్యార్థులు

అంతటా సీసీ కెమెరాల ఏర్పాటు 

నిర్మల్‌ కల్చరల్‌, మే 19 : జిల్లాలో పదోతరగతి పరీ క్షల నిర్వహణకు ఏర్పాట్లు  పూర్తి చేశారు. కొవిడ్‌-19 మహమ్మారి కారణంగా రెండేళ్ల తర్వాత విద్యార్థుల కు పరీక్షలు ఈ నెల 23 నుంచి నిర్వహిస్తున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు నిర్వహించనున్నారు. ఐదు నిమిషాలు లేటైనా ప్రభు త్వం అనుమతినిచ్చింది. పరీక్షల నిర్వహణ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని పలు సూచనలు చేస్తూ కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ జిల్లా స్థాయి అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. విద్యా శాఖ అధికారి రవీందర్‌రెడ్డి నేతృత్వంలో పరీక్షలు సాఫీగా సాగేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. పరీక్షల నిర్వహణకు గాను విద్యాశాఖతో పాటు పోలీస్‌, రెవెన్యూ, వైద్య, ఆరోగ్యశాఖ, ఆర్టీసీ, విద్యుత్‌, రవాణా, తపాలాశాఖల సహకారం తీసుకున్నారు. మొబైల్‌ ఫోన్లు, ఎలక్ర్టానిక్‌ పరికరాలు తీసుకెళ్లకుండా ఆదేశాలిచ్చారు. 

48 కేంద్రాలు.. 9,693మంది విద్యార్థులు

పరీక్షల నిర్వహణకు గాను జిల్లాలో 48 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏ గ్రేడ్‌ కేంద్రాలు 23, బి గ్రేడ్‌ కేంద్రాలు 18 ఏర్పాటు చేయగా 7 సి గ్రేడ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి పోలీసుస్టేషన్‌, తపాలా కార్యాల యం అందుబాటులో లేని కేంద్రాలు సి గ్రేడ్‌గా గుర్తించి సిట్టింగ్‌ స్క్వాడ్‌, కస్టోడియన్‌లను నియమించారు. జిల్లా నుండి మొత్తం 9,693 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందులో 4,736 బాలికలు కాగా 4957 మంది బాలురున్నారు. 

సీసీ కెమెరాలు .. 144 సెక్షన్‌ అమలు

పరీక్షాకేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవకతవకలు జరుగకుండా ఉండేలా చర్యలు చేపట్టారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. గట్టి పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్షల సమయం లో జిరాక్స్‌ కేంద్రాలు మూసి వేయాలని నిర్వాహకులను ఆదేశించారు.

సిబ్బంది నియామకం

పరీక్షలు సజావుగా నిర్వ హించేందుకు సిబ్బంది ని నియమించారు. 48 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తు న్నందున అందుకు తగ్గట్టు నిర్వాహకులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 48 చీఫ్‌ సూప రెంటెండెంట్లు, 55 మంది డిపార్ట్‌మెంటల్‌ అధికారులను, ఇన్విజి లేటర్లను 562 మందిని నియమించారు. వీరితో పాటు ఇతర విద్యాశాఖ అధికారులున్నారు.

మౌలిక సౌకర్యాల ఏర్పాటు

పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా మౌలిక సదుపాయాలు కల్పించారు. బెంచీలు, డెస్క్‌లతో విద్యుత్‌ సౌక ర్యం ఉండేలా చర్యలు తీసుకున్నారు. మంచినీటి వసతి ఏర్పాటు చేశారు. కొవిడ్‌ నిబంధనలు పాటించాలని, మాస్కులు ధరించాలని విద్యార్థులకు తెలియజేశారు. వైద్య సిబ్బందిని నియమించి ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతున్నారు. 

ఆరు పేపర్లు ..70 శాతం సిలబస్‌

గతంలో ఒక్కో సబ్జెక్టులో రెండు పేపర్లు నిర్వహించగా ప్రస్తుతం వాటిని ఆరుపేపర్లకు కుదించారు. 70 శాతం సిలబస్‌తో ప్రశ్నాపత్రం రూపొం దించారు. ఇందులో 50 శాతం ప్రశ్నలు ఎంపిక విధానంలో ఉంటాయి. పార్ట్‌ -బిలో 20 మార్కులతో ప్రశ్నలుండనున్నాయి. ఈ విధానంలో పరీక్ష రాసే విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెరిగే అవకాశాలున్నాయని అంటున్నారు. మారిన పరీక్షా విఽధానానికి అనుగుణంగా విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అన్ని పాఠశాలల్లో 70 శాతం సిలబస్‌ నవంబరులోనే పూర్తయినందున విద్యార్థులు రిపీట్‌ చేసే అవకాశం లభించింది.

ఆన్‌లైన్‌ ద్వారా హాల్‌ టికెట్లు

పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఆన్‌లైన్‌ ద్వారా హాల్‌టికెట్లు పొందే అవకాశం కల్పించారు. ప్రధానోపాధ్యాయుని సంతకం గానీ పాఠశాతల ముద్ర లేకున్నా పరీక్షా కేంద్రాలోకి అనుమతించనున్నారు. ప్రైవేట్‌ యాజమాన్యాలు ఫీజులకు వేధిస్తే ఫిర్యాదు చేయవచ్చునని అధికారులు సూచించారు.

పరీక్షల షెడ్యూల్‌

ఈ నెల 23న ఫస్ట్‌లాంగ్వేజ్‌, 24న సెకండ్‌ లాంగ్వేజ్‌, 25న థర్డ్‌ లాంగ్వేజ్‌, 26న గణితం, 27న జనరల్‌ సైన్‌ (భౌతిక, జీవశాస్త్రం), 28న సాంఘిక శాస్త్రం, 30న ఓఎస్‌ఎస్సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌- 1, 31న పేపర్‌- 2, జూన్‌ 1న ఎస్‌ఎస్‌సీ ఒకేషనన్‌ కోర్స్‌ థియరీ పరీక్ష ఉంటుంది.

ప్రశాంతంగా పరీక్షలు రాయాలి 

విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాయాలని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేశాం. ఒత్తిడి లేకుండా పరీక్ష రాస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. జిల్లాలో పరీక్షల నిర్వహణకు పోలీస్‌, వైద్య, రెవెన్యూ, విద్యుత్‌, రవాణా, ఆర్టీసీ అధికారుల సహకారం తీసుకుంటున్నాం. కేంద్రాల వద్ద విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాం. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నాము. 

- డీఈవో రవీందర్‌రెడ్డి

Updated Date - 2022-05-20T06:34:42+05:30 IST