UAE: యూఏఈలో ఉండగా ఈ పది తప్పులు అస్సలు చేయకండి.. లేకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే..!

ABN , First Publish Date - 2022-08-30T17:05:42+05:30 IST

అరబ్ దేశాల్లో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్నచిన్న తప్పులకు కూడా పెద్ద శిక్షలు ఉంటాయి. కనుక ఆ దేశాలకు వెళ్లినప్పుడు చాలా జాగ్రత్తగా మసులుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆయా దేశాల్లో అడుగు పెట్టకముందే అక్కడ ఏం చేయకూడదు? ఏం చేయ్యొచ్చు? అనే విషయాలను తెలుసుకోవడం బెటర్. లేనిపక్షంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే.

UAE: యూఏఈలో ఉండగా ఈ పది తప్పులు అస్సలు చేయకండి.. లేకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే..!

అబుదాబి: అరబ్ దేశాల్లో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్నచిన్న తప్పులకు కూడా పెద్ద శిక్షలు ఉంటాయి. కనుక ఆ దేశాలకు వెళ్లినప్పుడు చాలా జాగ్రత్తగా మసులుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆయా దేశాల్లో అడుగు పెట్టకముందే అక్కడ ఏం చేయకూడదు? ఏం చేయ్యొచ్చు? అనే విషయాలను తెలుసుకోవడం బెటర్. లేనిపక్షంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. అక్కడ తెలియక చేసిన తప్పులకు కూడా భారీ జరిమానాలు, జైలుకు కూడా వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం అరబ్ దేశాల్లో ఒకటైన యూఏఈలో (UAE) ఉండగా చేయకూడని పది విషయాల గురించి తెలుసుకుందాం. ఇవి వినడానికి చాలా సిల్లీగా ఉన్న శిక్షలు మాత్రం చాలా కఠినంగా ఉంటాయి. ఒకవేళ మీరు యూఏఈ వెళ్తే ఈ పది తప్పులు అస్సలు చేయ్యొద్దు.    


1. ఒకరిని సిల్లీ లేదా స్టూపిడ్ అని పిలవడం

యూఏఈలో ఓ వ్యక్తిని సిల్లీ లేదా స్టూపిడ్ అని పిలవడం నేరంగా పరిగణిస్తారు. ఆ దేశ ఫెడరల్ పీనల్ కోడ్ చట్టంలోని ఆర్టికల్ 373 ప్రకారం అలా పిలవడం నేరం. 

శిక్ష: ఈ నేరానికి ఏడాది జైలు శిక్షతో పాటు 10వేల దిర్హమ్స్(రూ.2.17లక్షలు) జరిమానా ఉంటుంది. ఇటీవల ఓ అరబ్ వ్యక్తి తన భార్యను వాట్సాప్‌లో స్టూపిడ్ అని సందేశం పంపించాడు. దాంతో ఆమె కోర్టుకు వెళ్లగా సదరు వ్యక్తికి 60రోజుల జైలు, 20వేల దిర్హమ్స్(రూ.4.34లక్షలు) ఫైన్ పడింది. 


2. చట్టవిరుద్ధంగా డిష్ టీవీల ఏర్పాటు

యూఏఈలో లైసెన్స్ లేని, అనధికార, చట్టవిరుద్ధమైన టెలివిజన్ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా టెలివిజన్ సేవలను పొందడం, అమ్మకం లేదా పంపిణీ అనేది నేరం. ఈ విషయమై నివాసితులను అక్కడి అధికారులు పదేపదే హెచ్చరిస్తుంటారు కూడా. 2002లో తీసుకొచ్చిన చట్టం నం. 07 ప్రకారం ఇలా చేయడం తీవ్ర నేరం. 

శిక్ష: దీనికి గాను చట్టపరమైన చర్యలతో పాటు 2వేల దిర్హమ్స్(రూ.43వేలు) ఫైన్ ఉంటుంది.  గతేడాది ఆసియాకు చెందిన ఓ వ్యక్తి ఇలాగే చట్ట విరుద్ధంగా శాటిలైట్ టీవీ రిసీవర్స్‌ను విక్రయిస్తూ పట్టుబడ్డాడు. దాంతో ఆయనకు దుబాయ్ క్రిమినల్ కోర్టు నెల రోజుల జైలుతో పాటు 5వేల దిర్హమ్స్(సుమారు రూ.1లక్ష) జరిమానా విధించింది. అలాగే అతడు నడుపుతున్న దుకాణాన్ని కూడా మూసివేయాలని న్యాయస్థానం ఆదేశించింది. 


3. ఖాస్ ఖాస్ (తెల్ల గసగసాలు) తీసుకెళ్లడం

మన భారతీయ వంటకాల్లో ఉపయోగించే తెల్ల గసగసాలు తీసుకెళ్లడం కూడా నేరమే. వీటిని యూఏఈలో నిషేధించడం జరిగింది. కనుక వీటిని తీసుకెళ్లిన, కలిగి ఉన్న నేరంగానే పరిగణిస్తారు. ఒకవేళ దోషిగా తేలితే దీర్ఘకాలిక జైలు శిక్ష ఉంటుంది. ఆ దేశంలో 1995లో చేసిన ఫెడరల్ చట్టం నం. 14 గసగసాలను రవాణా చేయడం, విక్రయించడం, నిల్వ ఉంచడం నేరం. 

శిక్ష: 20ఏళ్ల జైలు శిక్ష ఉంటుంది. కొన్నేళ్ల క్రితం మంగళూరుకు చెందిన భారత వ్యక్తి వద్ద దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 102.5గ్రాముల గసగసాలను అక్కడి అధికారులు స్వాధీనం చేసుకోని, అతడిని జైలుకు పంపించారు. 


4. చట్ట విరుద్ధంగా గృహాకార్మికులుగా చేరడం 

స్పాన్సర్షిప్ లేకుండా గృహాకార్మికులుగా చేరడం నేరం. చట్ట విరుద్ధంగా గృహాకార్మికులుగా చేరితే నేరంగా పరిగణిస్తారు. డొమెస్టిక్ వర్కర్ల కోసం 2017లో తీసుకొచ్చిన ఫెడరల్ చట్టం నం. 10 ప్రకారం శిక్షార్హులు అవుతారు. 

శిక్ష: ఈ నేరానికి రూ.10లక్షల నుంచి రూ.10కోట్లకు వరకు జరిమానా ఉంటుంది. అలాగే జైలు శిక్ష కూడా ఉంటది. 


5. వీధి పిల్లులకు ఆహారం ఇవ్వడం

ఆకలితో ఉన్న వీధి పిల్లులకు ఆహారం ఇవ్వడం మానవీయ చర్యనే. కానీ ఫెరల్స్‌కు (ferals) ఆహారం ఇవ్వడం వల్ల అకాల మరణాలకు గురయ్యే, చనిపోయే అవకాశం ఉన్న మరిన్ని పిల్లులకు జన్మనిచ్చే సామర్థ్యాన్ని పెంచుతుందని జంతు సంక్షేమ సంఘాలు చెబుతున్నాయి. దుబాయ్ మునిసిపాలిటీ ప్రకారం, దుబాయ్‌లో కాకులు, పావురాలు, వీధి కుక్కలు మరియు పిల్లులు వంటి వాటికి ఆహారం ఇవ్వడం నిషేధించబడింది.

శిక్ష: ఒకవేళ ఏవరైనా ఈ నియమాన్ని అతిక్రమిస్తే 500 దిర్హమ్స్(రూ.10వేలు) వరకు జరిమానా ఉంటుంది. 


6. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ఫొటోలు తీయడం

రోడ్డు ప్రమాద ఘటనలను ఫొటోలు, వీడియోలు తీయడం యూఏఈలో నిషేధించడబడింది. అలా తీసిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పెట్టడం నేరం. యూఏఈ సైబర్ క్రైమ్ చట్టం ప్రకారం 2021లోని ఆర్టికల్ 44లో చెప్పబడిన లా నం. 34 ప్రకారం ఇలా చేయడం తీవ్ర నేరం. 

శిక్ష: దీనికి శిక్షగా ఆరు నెలల జైలుతో పాటు 1.50లక్షల దిర్హమ్స్(రూ.32.60లక్షలు) నుంచి 5లక్షల దిర్హమ్స్(రూ.10కోట్లు) వరకు జరిమానా విధిస్తారు. 


7. నిధుల సేకరణ (Fundraising)

మీరు ఎంతటి గొప్ప కార్యం కోసమైనా నిధులు సేకరిస్తుండొచ్చు. కానీ, అనుమతి లేకుండా చేస్తే అది నేరం. యూఏఈ విరాళాల చట్టం ప్రకారం, ఇటువంటి కార్యకలాపాలు నిర్దిష్ట సంస్థలకు మాత్రమే పరిమితం చేయబడ్డాయి. యూఏఈ కొత్త నిధుల సేకరణ చట్టం వ్యక్తులు నిధుల సేకరణ కార్యకలాపాలను నిర్వహించడం నిషేధిస్తుంది. లైసెన్స్ పొందిన స్వచ్ఛంద సంస్థలు, సమాఖ్య, స్థానిక అధికారులకు మాత్రమే విరాళాలు సేకరించేందుకు అనుమతి ఉంటుంది. వారే విరాళాలు స్వీకరించగలరు మరియు విరాళాలు ఇవ్వగలరు. దీనికోసం 2021లో ఫెడరల్ చట్టం నం. 03 రూపొందించబడింది. దీన్ని అతిక్రమిస్తే శిక్షార్హులు అవుతారు.

శిక్ష: ఈ చట్టాన్ని అతిక్రమిస్తే 2లక్షల దిర్హమ్స్(రూ.43లక్షలు) నుంచి 5లక్షల దిర్హమ్స్(రూ.1కోటి) వరకు ఫైన్ విధిస్తారు. 


8. బహిరంగ ప్రదేశాల్లో కార్లు వాష్ చేయడం

బహిరంగ ప్రదేశాల్లో కార్లు వాష్ చేయడం కూడా యూఏఈలో నేరమే. ముఖ్యంగా వీధుల్లో ఇలాంటి పనులు అస్సలు చేయకూడదట. దీనికి జైలు శిక్ష లేనప్పటికీ జరిమానా ఉంటుంది.

పెనాల్టీ: ఇలాంటి తప్పుకు అక్కడి మున్సిపాలిటీ నిబంధనల ప్రకారం 500 దిర్హమ్స్(రూ.10వేలు) జరిమానా ఉంటుంది. 


9. లైసెన్స్ లేని వారి వద్ద మసాజ్ సేవలు పొందడం

అనుమతి ఉన్న మసాజ్ కేంద్రాల్లోనే సేవలు పొందాలి. లేనిపక్షంలో మీరు బాధితులుగా మారడం ఖాయం. ఇలాంటి నేరానికి యూఏఈ పీనల్ కోడ్‌లోని ఆర్టికల్ 356 ప్రకారం శిక్ష విధించడం జరుగుతుంది. 

శిక్ష: ఏడాది జైలుతో పాటు జరిమానా ఉంటుంది. 


10. ఇతరుల ఫోన్‌ను వారి అనుమతి లేకుండా చెక్ చేయడం

ఇతర వ్యక్తుల మొబైల్‌ను వారి అనుమతి లేకుండా చెక్ చేయడం కూడా యూఏఈలో నేరంగా పరిగణిస్తారు. అలా పరాయి వ్యక్తుల ఫోన్ నుంచి మీరు అనుమతి లేకుండా సంపాదించిన పాస్‌వర్డ్‌తో ఏదైనా సమాచార వ్యవస్థను యాక్సెస్ చేస్తే మీకు భారీ జరిమానా ఉంటుంది. నేరం చేయాలనే ఉద్దేశ్యంతో పాస్‌వర్డ్‌ను పొందడం అనేది తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. సైబర్ క్రైమ్స్, ఎలక్ట్రానిక్ నేరాలను ఎదుర్కోవడానికి 2021లో తెచ్చిన ఫెడరల్ డిక్రీ-లా నంబర్ 34కు సంబంధించి ఆర్టికల్ 9 కింద దీనికి శిక్ష ఉంటుంది.

శిక్ష: ఈ నేరానికి గాను 50వేల దిర్హమ్స్(రూ.10లక్షలు) నుంచి 1లక్ష దిర్హమ్స్(రూ.21లక్షలు) వరకు జరిమానా ఉంటుంది. 

Updated Date - 2022-08-30T17:05:42+05:30 IST