పదేళ్లు దాటినా.. పరిశోధనలు ఏవీ ?

ABN , First Publish Date - 2022-06-29T06:20:20+05:30 IST

పులివెందుల ఖ్యాతి అంతర్జాతీయస్థాయిలో నిలిపేందుకు చేపట్టిన పశుపరిశోధన కేంద్రం దిష్టిబొమ్మలా మారింది. పదేళ్లు దాటినా పరిశోధనలు సాగని పశుపరిశోధన కేంద్రంగా మిగిలింది. ఆంధ్రప్రదేశ్‌ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ ఆన్‌ లైవ్‌స్టాక్‌ (ఏపీకార్ల్‌)లో వెటర్నరీ, అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌ కళాశాలల ఏర్పాటుపై ఎలాంటి ఊసే లేదు. 2020లో ప్రారంభిస్తామన్నా నేటికీ అతీగతీ లేదు. టెస్ట్‌ట్యూబ్‌ దూడల ఉత్పత్తి ఏపీకార్ల్‌లో చేపడతామని ఓ సంస్థ ఎంఓయూ చేసుకున్నా... అది నేటికీ ఆచరణలో సాధ్యం కాలేదు. రూ.280కోట్లతో నిర్మించిన భవనాలు శిథిలావస్థకు చేరవవుతున్నాయి.

పదేళ్లు దాటినా.. పరిశోధనలు ఏవీ ?
పులివెందుల వద్దనున్న ఏపీకార్ల్‌

ఏపీకార్ల్‌లో పరిశోధనలపై ప్రభుత్వ అలసత్వం

వెటర్నరీ, అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌ కళాశాలల ఊసేలేదు

టెస్ట్‌ట్యూబ్‌ దూడల ఉత్పత్తి ఎప్పటికి సాగేనో..

వెక్కిరిస్తున్న రూ.కోట్ల విలువైన భవనాలు 

ఇది ఏపీకార్ల్‌ దుస్థితి

పులివెందుల, జూన్‌ 28: పులివెందుల ఖ్యాతి అంతర్జాతీయస్థాయిలో నిలిపేందుకు చేపట్టిన పశుపరిశోధన కేంద్రం దిష్టిబొమ్మలా మారింది. పదేళ్లు దాటినా పరిశోధనలు సాగని పశుపరిశోధన కేంద్రంగా మిగిలింది. ఆంధ్రప్రదేశ్‌ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ ఆన్‌ లైవ్‌స్టాక్‌ (ఏపీకార్ల్‌)లో వెటర్నరీ, అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌ కళాశాలల ఏర్పాటుపై ఎలాంటి ఊసే లేదు. 2020లో ప్రారంభిస్తామన్నా నేటికీ అతీగతీ లేదు. టెస్ట్‌ట్యూబ్‌ దూడల ఉత్పత్తి ఏపీకార్ల్‌లో చేపడతామని ఓ సంస్థ ఎంఓయూ చేసుకున్నా... అది నేటికీ ఆచరణలో సాధ్యం కాలేదు. రూ.280కోట్లతో నిర్మించిన భవనాలు శిథిలావస్థకు చేరవవుతున్నాయి.  

పులివెందులలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి దాదాపు రూ.350 కోట్లతో పశుపరిశోధన కేంద్రాన్ని నిర్మించేందుకు 2008లో శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి ఆయన మృతి చెందే సమయానికి రూ.35 కోట్లతో పరిశోధన భవనాన్ని ఉన్నత ప్రమాణాలతో నిర్మించారు. ఇది వైఎస్‌ చేతులమీదుగా ప్రారంభమైంది. అయినా మౌలిక వసతుల ఏర్పాటు పూర్తికాకపోవడంతో పరిశోధనలు మాత్రం ప్రారంభం కాలేదు. వైఎస్‌ మృతి అనంతరం 2013 నాటికి పరిశోధన భవనాలు దాదాపు 85 శాతం రూపుదిద్దుకున్నాయి. ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఇక్కడ పరిశోధనలు చేసేందుకు ఎస్‌ఈజడ్‌ తెచ్చారు. వైఎస్‌ ఉన్నప్పుడే ఇజ్రాయల్‌ సంస్థతో 10వేల పాడిపశువులతో ఇక్కడ డెయిరీ ఏర్పాటుకు సన్నాహాలు సాగించారు. వైఎస్‌ మృతి తర్వాత ఇది నిలిచిపోయింది. అనంతరం కాంగ్రెస్‌ ప్రభుత్వంలో పనిచేసిన ముఖ్య మంత్రులు దీనిపై శ్రద్ధ చూపలేదు. 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చిన అనంతరం ఈ పరిశోధన కేంద్రానికి ఉన్న ఇందిరాగాంధీ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ ఆన్‌ లైవ్‌స్టాక్‌ (ఐజీసీఏఆర్‌ఎల్‌)గా ఉన్న పేరును ఏపీకార్ల్‌గా మార్చింది. కానీ పరిశోధనలు చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. 

అరటి పరిశోధన కేంద్రం అంతంతమాత్రంగా..

ఏపీకార్ల్‌లో దాదాపు రూ.50 కోట్లతో చేపట్టిన అరటి పరిశోధన కేంద్రం కూడా పూర్తిస్థాయిలో పరిశోధనలు సాగించే స్థాయిలో రూపుదిద్దుకోలేదనే చెప్పాలి. పలు సంస్థలు పరిశోధనలు సాగిస్తామని ప్రభుత్వంతో ఎంఓయూలు కుదుర్చుకోవడంతోనే ఆగిపోతున్నాయి. పశువులకు వచ్చిన వ్యాధులు, రాబోయే వ్యాధులపై ఇక్కడ పరిశోధనలు చేసి ముందస్తుగా గుర్తించి వాటికి అవసరమైన వ్యాధి నిరోధక టీకాలు, మందులు తయారు చేయాల్సి ఉంది. కానీ ఏ సంస్థ ఇక్కడ పరిశోధనలు చేసేందుకు ముందుకు రావడంలేదని తెలుస్తోంది. రూ.380కోట్లతో చేపట్టిన ఏపీకార్ల్‌కు ఎస్‌ఈజడ్‌ తేవడంతో రూ.280 కోట్లతో దాదాపు 80శాతం పనులు పూర్తయ్యాయి. ఇక్కడ పరిశోధనలు సాగించాలంటే మరో మూడు అధునాతన ల్యాబ్‌లు కూడా అవసరం ఉందని ఓ అధికారి పేర్కొన్నారు. రెండు సంస్థలు మాత్రం ఇక్కడ ఏదో పరిశోధనలు సాగిస్తున్నామంటే సాగిస్తున్నమంటూ చేస్తున్నాయి. ఏపీకార్ల్‌ ఏ లక్ష్యంతో చేపట్టారో ఆ లక్ష్యంవైపు పయనించలేదనే ఆరోపణలు న్నాయి. ఏదేమైనా ఏపీకార్ల్‌ రూపుదిద్దుకొని పదేళ్లు దాటినా పూర్తిస్థాయిలో పరిశోధనలు సాగకపోవడం దారుణం.

వైఎస్‌ జగన్‌ సీఎం అయినా..

తర్వాత వైసీపీ ప్రభుత్వం అందులోను దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమారుడు వైఎస్‌ జగన్‌ సీఎం కావడంతో ఇక ఏపీకార్ల్‌లో పరిశోధనలు పరుగులు పెడతాయని అందరూ భావించారు. అన్నట్టుగానే పశుపరిశోధన కేంద్రంలో దాదాపు రూ.50 కోట్లతో అరటి పరిశోధన కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రూ.50 కోట్లతో లైవ్‌స్టాక్‌ బ్యాక్టీరియల్‌ కేంద్రం ఏర్పాటు, రూ.50 కోట్లతో పరిశోధనలు చేస్తామని ఓ సంస్థ ముందుకొచ్చింది. అలాగే అంతరించిపోతున్న పుంగనూరు జాతి ఆవుల పునరుత్పత్తి కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అలాగే ఓ విదేశీ సంస్థ ఇక్కడ టెస్ట్‌ట్యూబ్‌ దూడలను ఉత్పత్తి చేస్తామని ప్రభుత్వంతో ఎంఓయూ కూడా కుదుర్చుకుంది. అలాగే ఈ పరిశోధన కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు వెటర్నరీ, అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌ కళాశాలలను 2020లోనే ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు అధికారులు కూడా హడావిడి చేశారు. కానీ ఇవన్నీ ఆచరణలోకి రాలేదు. 

త్వరలోనే పరిశోధనలు 

ఏపీకార్ల్‌లో త్వరలోనే పరిశోధనలు సాగుతాయి. ప్రస్తుతం పలు సంస్థలు పరిశోధనలు చేసేందుకు ముందు కొచ్చాయి. మధ్యలో ఐజీజీఐఏఆర్‌ఎల్‌, పుంగనూర్‌ మిషన్‌, ముర్రా బఫెలో, న్యూటెక్‌ బయోసైన్స్‌ తదితర సంస్థలు వచ్చాయి. అరటి పరిశోధన కేంద్రం కూడా ఇక్కడ ఉంది. త్వరలోనే ఇవన్నీ పరిశోధనలు సాగిస్తాయి. జూలై 7వ తేదీన సీఎం వైఎస్‌ జగన్‌ ఇక్కడ పలు అభివృద్ధి పనులు ప్రారంభించ నున్నారు. అరటి పరిశోధన కేంద్రంలో 30 నుంచి 35 కొత్త అరటి మొక్కలను ప్లాంటేషన్‌ చేసే అవకాశం ఉంది. హార్టి కల్చర్‌, అగ్రికల్చర్‌, వెటర్నరీ కళాశాలలపై ఇంకా పూర్తి స్థాయిలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. త్వరలోనే వీట న్నిటిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

- రమణారెడ్డి, సీఈవో, ఏపీ కార్ల్‌


Updated Date - 2022-06-29T06:20:20+05:30 IST