అప్పు చెల్లించమన్నాడని హత్య

ABN , First Publish Date - 2022-05-21T06:20:00+05:30 IST

అప్పు తీసుకున్న రూ.2వేలు తిరిగి ఇవ్వమని అడిగినందుకు ఓ మైనర్‌ బాలుడు తన తండ్రితో కలసి ఏకంగా వార్డు వలంటీర్‌నే కొట్టి చంపారు.

అప్పు చెల్లించమన్నాడని హత్య
మైనర్‌ చేతిలో హత్యకు గురైన వలంటీర్‌ సందీప్‌

 మైనర్‌ బాలుడి చేతిలో వలంటీర్‌ హతం

తెనాలిలో బాలుడి ఘాతుకం

తండ్రి కూడా అతనికి తోడై...

గంజాయి మత్తులోనే హత్య చేశారని బంధువుల ఆరోపణ

 

తెనాలి, మే 20, (ఆంధ్రజ్యోతి): అప్పు తీసుకున్న రూ.2వేలు తిరిగి ఇవ్వమని అడిగినందుకు ఓ మైనర్‌ బాలుడు తన తండ్రితో కలసి ఏకంగా వార్డు వలంటీర్‌నే కొట్టి చంపారు. తెనాలిలో శుక్రవారం జరిగిన ఈ సంఘటన పట్టణంలో తీవ్ర సంచలనం కలిగించింది. పోలీసులు, హతుని బంధువులు తెలిపిన వివరాల మేరకు.. తెనాలి 24వ వార్డు వలంటీర్‌గా పనిచేస్తున్న సందీప్‌(22) తన అమ్మమ్మతో కలసి రెండు గేట్ల మధ్య నివాసం ఉంటున్నాడు. తండ్రి చిన్నతనంలోనే చనిపోవటంతో, తల్లి, అమ్మమ్మను అతనే చూసుకుంటున్నాడు. అదే వార్డులో ఉండే ఓ మైనర్‌ బాలుడు(17) సందీప్‌ దగ్గర ఇటీవల రూ.2వేలు అప్పుగా తీసుకున్నాడు. అయితే ఆ డబ్బు ఇవ్వకపోవటంతో సందీప్‌ అడుగుతుండటం, దీనిపై కోపం పెంచుకున్న ఆ బాలుడు గురువారం రాత్రి సందీప్‌ ఇంటికి వచ్చి వాదనకు దిగాడు. బాలుడి తండ్రి ఆ డబ్బు ఇచ్చేస్తామని సర్ధిచెప్పే ప్రయత్నం చేసినా, వారి మధ్య వాదనలు పెరిగిపోవటంతో కొట్లాటకు దారితీసింది. తండ్రీ, కొడుకులిద్దరూ సందీప్‌పై చేతులు, రాళ్లతో కొట్టటంతో ఓ రాయిదెబ్బ గుండె భాగంలో బలంగా తగలటంతో సందీప్‌ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే వైద్యశాలకు తరలించడగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. వెంటనే రంగంలోకి దిగిన త్రీటౌన్‌ పోలీసులు తండ్రీకొడుకులిద్దరీని అదుపులోకి తీసుకున్నారని సమాచారం. అయితే పోలీసుల ఎదుట మైనర్‌ బాలుడు మాట్లాడే సమయంలో ఊగిపోతూ కనిపించటం, మత్తులో తూలిపోవటం కనిపించింది. గంజాయి మత్తులో ఈ ఘాతకానికి పాల్పడ్డాడని హతుని బంధువులు ఆరోపిస్తున్నారు. కానీ. నిద్రమాత్రలు మింగాడని కుటుంబీకులు చెబుతున్నారు. అతనిని వైద్య పరీక్షలకు పంపుతున్నట్లు పోలీసులు తెలిపారు. హత్యా సంఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు త్రీటౌన్‌ సీఐ శ్రీనివాసరావు వివరించారు. మృతి చెందిన సందీప్‌ది తాడేపల్లి కాగా ఇక్కడ తాతయ్య, నాయనమ్మల వద్ద తోడుగా ఉంటున్నాడు. తండ్రి గతంలో చనిపోగా, తల్లి మూగ, తాడేపల్లిలో ఉంటుంది. ఆమెకు ఇతను ఒక్కడే సంతానం. ఇతను వలంటీర్‌గా విధులు నిర్వహిస్తూ ఖాళీ సమయాల్లో తెనాలి చుట్టుపక్కల గ్రామాల్లో డిష్‌ల కనెక్షన్‌, ఎలక్ర్టికల్‌ పనులు నిర్వహిస్తూ ఆ వచ్చిన ఆదాయంతో తల్లి, తాతలకు అండగా ఉంటాడని స్థానికులు తెలిపారు.  

Updated Date - 2022-05-21T06:20:00+05:30 IST