గొప్పల తిప్పలు

ABN , First Publish Date - 2021-07-11T05:35:02+05:30 IST

ఒకరోజు పనిమీద పొరుగురాజ్యానికి వెళ్లిన తెనాలిరామకృష్ణ విజయనగరానికి తిరుగు ప్రయాణమయ్యాడు. దారిలో ఒక చోట కొంతమంది మంట దగ్గర చలికాగుతూ, ముచ్చట్లు పెడుతూ కనిపించారు.

గొప్పల తిప్పలు

కరోజు పనిమీద పొరుగురాజ్యానికి వెళ్లిన తెనాలిరామకృష్ణ విజయనగరానికి తిరుగు ప్రయాణమయ్యాడు. దారిలో ఒక చోట కొంతమంది మంట దగ్గర చలికాగుతూ, ముచ్చట్లు పెడుతూ కనిపించారు. అప్పటికే రాత్రి కావడంతో విశ్రాంతి తీసుకోవడం మంచిదని తాను కూడా మంట దగ్గర కూర్చున్నాడు. కాసేపయ్యాక వాళ్లు మాట్లాడుతున్న మాటలను బట్టి యుద్ధంలో అనుభవజ్ఞులని గ్రహించాడు. వాళ్లు ఒక్కొక్కరు వారి వారి పోరాట కథలను వివరిస్తున్నారు. యుద్ధభూమిలో ఒంటిచేత్తో పదిమందిని మట్టికరిపించానని ఒకరు, మొత్తం రెజిమెంట్‌ను నేలకూల్చానని మరొకరు చెప్పుకుంటూ పోతున్నారు. ఇంతలో ఒక సైనికుడు తెనాలి రామకృష్ణవైపు తిరిగి ‘‘మీకు చెప్పుకోవడానికి అలాంటి సంఘటనలు లేవా?’’ అని అడిగాడు.


అప్పుడు రామకృష్ణ ‘‘ఆహా! కానీ ఒకటి ఉంది’’ అన్నాడు. అక్కడున్న వాళ్లందరూ ఆశ్చర్యంగా ఏంటో చెప్పు? అని అడిగారు. అప్పుడు రామకృష్ణ ‘‘నేను ఒకసారి ప్రయాణం చేస్తున్న సమయంలో ఒకచోట పెద్ద టెంట్‌ వేసి ఉండటాన్ని గమనించాను. ఆతృతగా వెళ్లి చూస్తే పొడవుగా, సామాన్య మానవుల కన్నా పది రెట్లు పెద్దగా ఉన్న ఒక వ్యక్తి పడుకుని ఉన్నాడు. దశాబ్దాలుగా దేశంలో దొంగతనాలు చేస్తూ అరాచకం సృష్టిస్తున్న వ్యక్తి అతడేనని అర్థమయింది. ‘‘అప్పుడేం చేశావు’’ ఆతృతగా అడిగాడు ఒక సైనికుడు. ‘‘కత్తి తీసి అతని కాలు నరికి పరుగు అందుకున్నాను’’ అన్నాడు రామకృష్ణ. ‘‘కాలు నరికావా? నేనైతే వాడి తల నరికేవాడిని’’ అన్నాడు ఓ సైనికుడు. అప్పుడు తెనాలి రామకృష్ణ నవ్వుతూ ‘‘ఎవరో అప్పటికే ఆ పనిచేశారు. అతని తల ఆ పక్కనే పడి ఉంది’’ అన్నాడు. దాంతో అందరూ మారు మాట్లాడకుండా ఉండిపోయారు.

Updated Date - 2021-07-11T05:35:02+05:30 IST