కౌలు సేద్యం భూస్వామ్య వ్యవస్థ అంతర్భాగం!

ABN , First Publish Date - 2022-09-16T06:28:45+05:30 IST

రైతాంగ ఉద్యమాల ఫలితంగా, ముఖ్యంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఫలితంగా నెహ్రు ప్రభుత్వం జమీందారీ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించి వారి ప్రయోజనాలకు...

కౌలు సేద్యం భూస్వామ్య వ్యవస్థ అంతర్భాగం!

రైతాంగ ఉద్యమాల ఫలితంగా, ముఖ్యంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఫలితంగా నెహ్రు ప్రభుత్వం జమీందారీ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించి వారి ప్రయోజనాలకు భంగం లేకుండా కాపాడింది. 1950లో కాంగ్రెస్ ప్రభుత్వం భూ పరిమితి విధానాలు ముందుకు తెచ్చింది. మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో భూములకు గరిష్ఠ పరిమితి విధిస్తానని చెప్పి ఐదు సంవత్సరాల తర్వాత మూడు కుటుంబాల పరిధి పరిమితిగా విధించింది. ఇలాంటి సీలింగ్ వలన పేదలకు భూమి పంపిణీ జరగలేదు. 1954లో మరలా చట్టానికి సవరణలు చేసి, ఒక్కో కుటుంబానికి 27నుంచి 108 ఎకరాల మాగాణి, 164 ఎకరాల నుంచి 324 ఎకరాల మెట్ట భూములను గరిష్ఠ పరిమితిగా విధించింది. చట్ట సవరణలు ముందుగానే భూస్వాములకు పాలకులు చేరవేయటం వలన వారు జాగ్రత్తలు పడి భూములు కాపాడుకున్నారు. ఫలితం.. పేదలకు భూములు దక్కలేదు. పేదల భూ పోరాటాలు కొనసాగుతున్న నేపథ్యంలో 1958లో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త భూ పరిమితి ముసాయిదాను ప్రవేశపెట్టి 1961లో దాన్ని చట్టంగా మార్చింది. ఈ చట్ట నిబంధనల సమాచారం కూడా ముందుగానే భూస్వాములకు చేరటం వల్ల వివిధ మార్గాల ద్వారా చట్ట పరిధిలోకి రాకుండా భూములు కాపాడుకున్నారు.


శ్రీకాకుళం, నక్సల్‌బరీ గిరిజన రైతాంగ పోరాటాలు మరోసారి భూమి సమస్యను ముందుకు తెచ్చాయి. శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటం ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజనుల భూమి హక్కుల కోసం 1/70 చట్టం చేసింది. భూపోరాటాలు తిరిగి ఉధృతం కావటంతో భూపరిమితిని మరోసారి కుదిస్తూ 1970 మే 25న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ 10 ఎకరాల మాగాణి, 25 ఎకరాల మెట్టగా పేర్కొంది. 1973లో ఆ ఆర్డినెన్స్ చట్టంగా మారింది. అసెంబ్లీ ఆమోదం పొందినా 1975 జనవరిలో గాని అమల్లోకి రాలేదు. ఈ భూ పరిమితి చట్టం ద్వారా మొదట 18లక్షలకు పైగా మిగులు భూములు ఉన్నట్లు ప్రకటించిన ప్రభుత్వం అనేకసార్లు దాన్ని కుదిస్తూ చివరికి 6.47 లక్షల ఎకరాలుగా పేర్కొంది. అందులో 5.82లక్షల ఎకరాలను 4.79 లక్షల మందికి పంపిణీ చేసినట్లు చెప్పింది. భూ సీలింగ్ ద్వారా స్వాధీనం చేసుకున్న భూస్వాముల భూములు వేళ్ల మీద లెక్కించవచ్చు. పేదలకు పంచామని చెబుతున్న భూములు కూడా సంఘ నిర్మాణం ద్వారా పేదలు సాధించుకున్నవే 90 శాతం ఉన్నాయి. దీన్ని గమనిస్తే అర్ధ ఫ్యూడల్ వ్యవస్థ రద్దు కర్తవ్యాలను దేశీయ పాలకులు వదిలివేశారని వెల్లడౌతున్నది.


భూ సంస్కరణల చట్టాల అమలు తీరుతో భూస్వామ్య వర్గాలకు ఎటువంటి నష్టం కలగలేదు. వారి భూములు యథాతథంగా వారి స్వాధీనంలోనే ఉన్నాయి. భూ సంబంధాల్లో మౌలిక మార్పులు చోటు చేసుకోలేదు. భూ కేంద్రీకరణ తగ్గలేదు. భూమి లేని పేదల సంఖ్య పెరుగుతూనే ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో భూస్వాముల పట్టు కొనసాగుతూనే ఉంది. భూ వనరుల శాఖ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించిన భూ సంస్కరణల జాతీయ విధానం- ముసాయిదా 18 జూలై, 2013 భూ సంబంధాలపై స్పష్టత ఇచ్చింది. 2013 ముసాయిదాలో పర్యావరణం, అటవీ శాఖ గణాంకాల ప్రకారం భారతదేశంలో 47 శాతం భూమి వ్యవసాయానికి అనువైనది. 22.6 శాతం భూమి అడవుల కింద, 13.6 శాతం భూమి సాగుకి ఉపయోగపడనిదిగా ఉంది.


భారతీయ గ్రామీణ అభివృద్ధి నివేదిక 1992 ప్రకారం దేశ గ్రామీణ జనాభాలో సగానికి పైగా అసలు భూమే లేదు. జాతీయ నమూన సర్వే ప్రకారం (2003–04) 41.63 శాతం కుటుంబాలకు ఇంటి స్థలం తప్ప, సొంత భూమి లేదు. నామమాత్రంగా భూమి ఉన్నవారు మూడింట ఒక వంతు ఉన్నారు. 20 శాతం మందికి ఒక హెక్టార్ కంటె తక్కువ భూమి ఉంది. ముఖ్యంగా దేశ జనాభాలోని 60 శాతానికి మొత్తం భూమిలో ఐదు శాతం మాత్రమే భూమి ఉంటే, పది శాతం మంది చేతుల్లో 55 శాతం పైగా ఉంది. ఈ లెక్కలను గమనిస్తే భూమి కేంద్రీకృతమైన తీరు, భూమి లేని పేదల సంఖ్య, అర్ధ భూస్వామ్య వ్యవస్థ కొనసాగుతున్న విధానాన్ని తెలుపుతోంది.


పాలక ప్రభుత్వాలే దేశంలో అర్ధ ఫ్యూడలిజం, భూ కేంద్రీకరణ ఉందని చెబుతుంటే, కొందరు ఎన్‌జీఓల ఏజంట్లు, మాజీ విప్లవకారులు, పాలకవర్గాల భట్రాజులు దేశంలో భూస్వామ్య విధానం అంతరించిందని, భూ కేంద్రీకరణ లేదని ప్రచారం చేయటం పేదలను పక్కదారి పట్టించే ప్రయత్నమే. కౌలు సేద్యం ఉందంటేనే భూస్వామ్య విధానం కొనసాగుతున్నదని అర్థం. దేశంలో 50శాతానికి పైగా, ఆంధ్రప్రదేశ్‌లో 60 శాతానికి పైగా కౌలు సేద్యం కొనసాగుతున్నది. కౌలు విధానం భూస్వామ్య వ్యవస్థ అంతర్భాగం. భూస్వామ్య దోపిడీకి ముఖ్యమైనది.


దేశంలో అర్ధ వలస, అర్ధ భూస్వామ్య వ్యవస్థ సుదీర్ఘ కాలంగా కొనసాగుతుండటం, భూస్వామ్య వర్గంతో సామ్రాజ్యవాదం, బడా బూర్జువా వర్గం మిలాఖత్ కావటం వల్ల వ్యవసాయ రంగంలో సహజంగానే కొన్ని మార్పులు వచ్చాయి. పంటల మార్కెటింగ్, కుటుంబ అవసరాల కోసం మిగులు ఉత్పత్తి, సేద్యంలో యంత్రాల వినియోగం అందులో భాగమే. ఇవేవి వ్యవసాయం పెట్టబడి విధానంలోకి మళ్లిందని చెప్పటానికి కారణాలు కావు. అలా ప్రచారం చేసే వారి అవగాహన లోపాన్ని తెలియ చేస్తున్నది. వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులు భూస్వామ్యవర్గ ప్రయోజనాలు కాపాడుతూ, సామ్రాజ్యవాద, కార్పొరేట్ సంస్థల ఎరువుల, పురుగు మందుల, విత్తనాల వ్యాపారానికి, ట్రాక్టర్లు, కోత మిషన్ల మొదలైన వాటి వ్యాపారానికి నిలయంగా ఉన్నాయి. భూ సంబందాల్లో విప్లవాత్మక మార్పులు రాకుండా, దేశం పారిశ్రామిక వంతం కాకుండా వ్యవసాయ రంగం పెట్టుబడిదారీ విధానంలోకి మార్పు చెందటం జరగదు. దేశం పారిశ్రామికంగా వెనకబడి ఉంది. అర్ధ ఫ్యూడల్ సంబంధాల్లో మౌలిక మార్పులు జరగలేదు. వ్యవసాయంలో వచ్చిన మార్పుల ద్వారా సేద్యాన్ని సంక్షోభంలోకి నెట్టి కార్పొరేట్ సంస్థలకు చిన్న, సన్నకారు రైతుల భూములు కట్టబెట్టే విధానాలు పాలకులు అనుసరిస్తున్నారు. 


భూమి సంబంధాలతో పాటు, ఫ్యూడల్ సంస్కృతి వికృత రూపంలో కొనసాగుతున్నది. మత ప్రచారాలు, దైవత్వం, యజ్ఞాలు, మూఢనమ్మకాలు, మఠాధిపతులు, స్వాములు, అతీతశక్తులు, పాములు–చెట్లను పూజించటం నేడు పెద్దఎత్తున కొనసాగుతున్నది. ఈ సంస్కృతిని పాలకులు పెంచి పోషిస్తున్నారు. మోదీ ప్రభుత్వం స్వయంగా ఫ్యూడల్ సంస్కృతిని అమలు జరుపుతున్నది. ఇది ఫ్యూడల్ వ్యవస్థ రూపం. నేటి అర్ధ వలస, అర్ధ భూస్వామ్య వ్యవస్థ పతనమైతేనే అన్ని రకాల ఫ్యూడల్ బంధనాల నుంచి ప్రజలు బయటపడతారు. అందుకు భూస్వామ్య వ్యవస్థను బద్దలు కొట్టే విప్లవాత్మక భూ సంస్కరణలకై ప్రజలు ఉద్యమించి, నూతన ప్రజాతంత్ర వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి. 

బొల్లిముంత సాంబశివరావు

రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రైతు కూలీ సంఘం

Updated Date - 2022-09-16T06:28:45+05:30 IST