ముడుపుల ‘టెండర్‌’!

ABN , First Publish Date - 2022-06-29T09:16:33+05:30 IST

ముడుపుల ‘టెండర్‌’!

ముడుపుల ‘టెండర్‌’!

జగన్‌ మాటలకు.. అధికారుల తూట్లు

అంగన్‌వాడీలకు కోడిగుడ్ల కాంట్రాక్టులో పౌల్ర్టీ రైతుల సరఫరాకు అండ్డంకులు

కార్పొరేట్‌కు అనుగుణంగా టెండర్లలో మార్పులు

పత్రికా ప్రకటనలకు.. టెండర్లలో మార్పులకు మధ్య కోట్లలో ముడుపులు? 


(అమరావతి, ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలకు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ప్రభుత్వం కోడి గుడ్డు అందిస్తోంది. లక్షలాది మంది విద్యార్థులకు అందించే గుడ్ల కోసం ఏటా రూ.922కోట్లు ఖర్చు చేస్తోంది. జూలై 5 నుంచి పాఠశాలలు తెరుచుకోనున్న తరుణంలో జూన్‌ 8న పాఠశాల విద్యాశాఖ మిడ్‌ డే మీల్స్‌ డైరెక్టరేట్‌ కోడిగుడ్ల సేకరణ, సరఫరాకు సంబంధించి ఈ టెండర్‌ ఆహ్వానించింది. ముఖ్యమంత్రి జగన్‌ పేద పదే చెబుతున్న దాని ప్రకారం స్థానిక పౌలీ్ట్ర రైతులకు ప్రయోజనం చేకూర్చేలా టెండర్ల నిబంధనలు ఉండాలి. అలానే ఇచ్చిన మిడ్‌ డే మీల్స్‌ విభాగం.. నాలుగు రోజుల తర్వాత లీజుకు తీసుకున్న వారు సైతం పాల్గొనవచ్చని అనుబంధంగా ఓ  సవరణ చేస్తూ జూన్‌ 8 తేదీన ఇచ్చిన టెండర్‌తో మెలిక పెట్టింది. కానీ, రాష్ట్రంలో గత రెండేళ్లుగా కరోనా ప్రభావంతో చాలా చోట్ల పౌల్ర్టీ కేంద్రాలు మూతపడటంతో గుడ్ల ఉత్పత్తి తగ్గింది. ఇప్పుడు అన్ని పాఠశాలలూ ఒకేసారి ప్రారంభమవుతుండటంతో ఒక్కసారిగా లక్షల గుడ్లు అవసరమయ్యాయి. ఇదే అదనుగా పొరుగు రాష్ట్రాల నుంచి గుడ్లు సరఫరా చేస్తామంటూ కార్పొరేట్‌ కంపెనీలు ముందుకొచ్చి అధికారులతో సంప్రదింపులు జరిపాయి. ‘అన్నీ కుదిరిన’ తర్వాత ఏపీలోని కోళ్ల ఫారాలను లీజుకు తీసుకున్నట్లు ఒక అగ్రిమెంట్‌ పేపర్‌ చూపించి టెండర్లలో పాల్గొనాలని, తర్వాత సరఫరాలో ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చినా అభ్యంతరం లేదని అధికారులు వారికి సలహా ఇచ్చారు. అయితే ఈ విధానంతో పౌలీ్ట్ర రైతులు నష్టపోవడంతోపాటు ప్రభుత్వ పెద్దల మాటలకు పూర్తిగా విలువ లేకుండా పోతోంది. అయినా సరే కొందరు అధికారులు తమకు కావాల్సింది చక్క బెట్టుకుని ముడుపుల వైపే మొగ్గు చూపారు. విషయం తెలిసిన రైతులు ఈ బాగోతంపై కోర్టుకు వెళ్లేందుకు సిద్ధపడటంతో కొరిజెండమ్‌ విషయం ఎక్కడ బయట పడుతుందోనని పాత టెండర్‌ రద్దు చేసి ఈ నెల 15న మరోసారి కొత్త నిబంధన చేర్చి తాజాగా బిడ్లు ఆహ్వానించారు. ఎక్కడా ఎటువంటి నోటిఫికేషన్‌, పత్రికా ప్రకటన కూడా విడుదల చేయకుండా అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం వెనుక అసలు భాగోతాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి రైతుల తరఫున కడప జిల్లాకు చెందిన వ్యక్తి తీసుకెళ్లారు. దీంతో నిఘా విభాగంతోపాటు విజిలెన్స్‌ ద్వారా ప్రభుత్వం నివేదిక అడగడంతో అసలు గుట్టు రట్టయింది. 


ముగ్గురు అధికారులు.. ముగ్గురు దళారులు!

రాష్ట్ర ప్రభుత్వం రూ.922కోట్లు ఖర్చు చేసి లక్షలాది మంది విద్యార్థులకు ఏడాది పాటు ఉచితంగా అందించబోయే కోడిగుడ్ల కొనుగోళ్లలో కార్పొరేట్‌ కంపెనీలకు అనుగుణంగా ముగ్గురు దళారులు చక్రం తిప్పినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు కీలకంగా వ్యవహరించి ఉన్నతాధికారులను బుట్టలో వేసుకున్నట్లు తేలింది. భారీ ఆఫర్‌ ఇవ్వడంతోనే గుట్టు చప్పుడు కాకుండా నిబంధనలు మార్చారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘ద్రవిడ భాష మాట్లాడే ఇద్దరు బ్యూరో క్రాట్లు’ అంతా తామై వ్యవహరించగా మరో తెలుగు అధికారి అండదండలు అందించినట్లు దర్యాప్తు సంస్థలు పసిగట్టాయి. ఈ వ్యవహారంలో ఎక్కడ ఎవరు ఎంత వసూలు చేశారు? ఎంతకు మాట్లాడుకున్నారు? ఎవరి వాటా ఎంత? దళారుల వెనకున్నది ఎవరు? తదితర వివరాలన్నీ రహస్య నివేదికలో పొందు పరిచినట్లు సమాచారం. 


సీఎం తిరిగి వచ్చేలోపే చక్కబెట్టేయాలి!

ముఖ్యమంత్రి విదేశీ పర్యటన నుంచి తిరిగొచ్చేలోపే కోడి గుడ్ల టెండర్ల ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు సమాచారం. జూలై 5నుంచి పాఠశాలలు ప్రారంభమవుతున్నందున ఈ నెలాఖరు లోపే అంతా ముగించేస్తే గుడ్ల సరఫరాకు జాప్యం ఉండబోదని బయటికి చెబుతున్నా.. అసలు లక్ష్యం ముడుపులేనని తెలుస్తోంది. అయితే పౌలీ్ట్ర రైతుల నోట్లో మట్టికొట్టేలా జగన్‌ ప్రభుత్వం తీసుకొంటున్న నిర్ణయాలపై న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు పౌలీ్ట్ర రైతులు సిద్ధమవుతుండగా.. అసలు ఈ బాగోతంపై పాలకులు ఏం సమాధానం చెబుతారో చూడాలి!.

Updated Date - 2022-06-29T09:16:33+05:30 IST