గ్రామాల్లో పదుల సంఖ్యలో కరోనా కేసులు

ABN , First Publish Date - 2022-01-23T04:45:12+05:30 IST

రోనా బాధితులు హోం ఐసోలేషన్‌లోకి వెళుతున్నారు. నియోజకవర్గ కేంద్రమైన కొండపితోపాటు పలు గ్రామాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. జలుబు, దగ్గు, జ్వర పీడితులు పెరిగారు. దీంతో ఏ లక్షణం ఉంటే ఆ లక్షణానికి బిల్లలు వాడుకుంటూ ఇంట్లోనే పలువురు ఉంటున్నారు. కొండపి, పోలిరెడ్డిపాలెం గ్రామాల్లో దాదాపు 10 కిపైగా కేసులు నమోదయ్యాయి. కొండపి సీహెచ్‌సీ వైద్యుడొకరికి, పెట్లూరు పీహెచ్‌సీ సిబ్బందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది.

గ్రామాల్లో పదుల సంఖ్యలో కరోనా కేసులు

కొండపి, జనవరి 22: కరోనా బాధితులు హోం ఐసోలేషన్‌లోకి వెళుతున్నారు. నియోజకవర్గ కేంద్రమైన కొండపితోపాటు పలు గ్రామాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. జలుబు, దగ్గు, జ్వర పీడితులు పెరిగారు. దీంతో ఏ లక్షణం ఉంటే ఆ లక్షణానికి బిల్లలు వాడుకుంటూ ఇంట్లోనే పలువురు ఉంటున్నారు. కొండపి, పోలిరెడ్డిపాలెం గ్రామాల్లో దాదాపు 10 కిపైగా కేసులు నమోదయ్యాయి. కొండపి సీహెచ్‌సీ వైద్యుడొకరికి, పెట్లూరు పీహెచ్‌సీ సిబ్బందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. 

ఎమ్మెల్యే స్వామి, సత్యకు .. 

 టీడీపీ నాయకులు పలువురు స్వల్పంగా కొవిడ్‌ బారినపడ్డారు. ఇటీవల టీడీపీ సంస్థాగత సమావేశాలతోపాటు, ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమాలు అన్ని మండలాల్లో టీడీపీ నాయకులు నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు కూడా అధిక సంఖ్యలో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం స్వల్పంగా కొవిడ్‌ అనుమానిత లక్షణాలు కన్పించడంతో తొలుత టీడీపీ రాష్ట్ర పార్టీ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి దామచర్ల సత్యనారాయణ పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో రెండు రోజులుగా హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఎమ్మెల్యే డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి కూడా తాజాగా కార్యక్రమాల్లో పాల్గొనడంతో తాజాగా శుక్రవారం సాయంత్రం పరీక్షలు చేయించుకున్నారు. ఎటువంటి లక్షణాలు లేకపోయినా పాజిటివ్‌ వచ్చింది. గన్‌మెన్‌కు కూడా పాజిటివ్‌ రావడంతో హోం ఐసోలేషన్‌కు వెళ్లారు. స్వామి కూడా హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారు. వీరితోపాటు కొండపి, సింగరాయకొండ, టంగుటూరు మండలాలకు చెందిన టీడీపీ నాయకులు, పలువురు విలేకరులు కూడా కొవిడ్‌ బారినపడ్డారు.  

కరోనా నుంచి కోలుకోవాలని పూజలు 

 టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి దామచర్ల సత్యనారాయణ, కొండపి ఎమ్మెల్యే డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ టీడీపీ నాయకులు శనివారం సాయంత్రం కొండపిలోని కామేపల్లి రోడ్డులోగల శ్రీ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. మాజీ వైస్‌ ఎంపీపీ రావిపాటి మధుసూదనరావు, టీడీపీ కొండపి నాయకుడు నన్నూరి సుబ్బరామయ్య, తెలుగు యువత మండల అధ్యక్షుడు షేక్‌ కాయేష్‌, తెలుగు యువత ఒంగోలు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి దేపూరి మస్తాన్‌, తెలుగు యువత నాయకుడు ముసునూరి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 

అగ్రహారంలో 11 మందికి

పొన్నలూరు : మండలంలోని కె. అగ్రహారంలో 11 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఆమేరకు పరీక్షలు నిర్వహించగా కరోనా బారినపడ్డారని వైద్యాధికారి ఉన్నం కీర్తి తెలిపారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్క్‌లు ధరించాలని ఆమె సూచించారు. భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. 

 కరోనా నిబంధనలు పాటించాలి 

 విద్యార్థులు కరోనా నిబంధనలు పాటించాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కొండపి ఎస్సై కె. రామకృష్ణ సూచించారు. శనివారం సాయంత్రం కొండపిలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో విద్యార్థులు కరోనా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగించారు. విద్యార్థులు మాస్క్‌లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు.  కళాశాలలో కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నామని కళాశాల ప్రిన్సిపాల్‌ ఎం. వెంకటేశ్వర్లు తెలిపారు. 

జరుగుమల్లి తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బందికి.. 

జరుగుమల్లి (కొండపి) : తమ కార్యాలయంలోని 8 మంది సిబ్బందికి కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిందని తహసీల్దార్‌ ఎం. శ్రవణ్‌కుమార్‌ విలేకరులకు శనివారం రాత్రి  తెలిపారు. ప్రజలందరూ తప్పనిసరిగా కరోనా జాగ్రత్తలు, నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. కార్యాలయానికి వచ్చేవారు అత్యవసరమైతే తప్ప రావొద్దని తెలిపారు. పలువురు విలేజ్‌ సర్వేయర్లు కూడా కరోనా పాజిటివ్‌ వచ్చిన వారిలో ఉన్నారన్నారు. 

టంగుటూరులో 19 కరోనా కేసులు

టంగుటూరు : మండలంలో శనివారం 19 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  కారుమంచిలో 8 కేసులు, కందులూరు-2, సూరారెడ్డిపాలెం-2, కాకుటూరివారిపాలెం, తూర్పునాయుడుపాలెం, టంగుటూరు సచివాలయం-3లో ఒక్కొక్క కరోనా కేసు నమోదయ్యాయి. 3 కేసుల వివరాలు ట్రేస్‌ కాలేదని పీహెచ్‌ఎన్‌ కెజియారాణి చెప్పారు. టంగుటూరు జ్యోతీబాపూలే గురుకుల పాఠశాల్లో 12 మంది అనుమానితులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. అలాగే మండలంలోని ఇతర గ్రామ సచివాలయాల్లోనూ పరీక్షలు కొనసాగాయి.  

Updated Date - 2022-01-23T04:45:12+05:30 IST