తాడేపల్లిలో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2021-07-30T06:37:47+05:30 IST

మునిసిపల్‌ కార్మికుల పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడంతో తాడేపల్లి మునిసిపల్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది.

తాడేపల్లిలో ఉద్రిక్తత
పాదయాత్రను అడ్డుకోవడంతో మునిసిపల్‌ కార్యాలయం వద్ద బైఠాయించిన కార్మికులు

 కార్మికుల పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు

 మునిపల్‌ కార్యాలయం వద్ద కార్మికుల బైఠాయింపు

 నేతలను ఈడ్చుకెళ్లిన పోలీసులు


 తాడేపల్లి టౌన్‌, జూలై29: మునిసిపల్‌ కార్మికుల పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడంతో తాడేపల్లి మునిసిపల్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. ఎంటీఎంసీ కార్పొరేషన్‌ కార్మికుల ఉద్యోగుల, టీచర్ల, వలంటీర్ల జీతాల బకాయిలు వెంటనే చెల్లించాలని, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గుంటూరు జిల్లా మునిసిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సీఐటీయూ) ఆధ్వర్యంలో కార్మికులు మంగళగిరికి పాదయాత్రగా బయలుదేరగా పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పోలీసులు పాదయాత్రను అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో నాయకులు కార్మికులు మునిసిపల్‌ కార్యాలయం వద్ద బైఠాయించారు. కార్మికులనుద్దేశించి యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు వై.నేతాజీ ప్రసంగిస్తూ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతుంటే కార్మికులను అడ్డుకోవడం సరికాదన్నారు. మహిళలు భారీఎత్తున బైఠాయించగా, వార్డు మహిళా పోలీసులు రంగంలోకి దిగడంతో వీరి మధ్య మాటల యుద్ధం జరిగింది. నేతలను పోలీసులు ఈడ్చుకెళ్లి అదుపులోకి తీసుకుని వ్యానులో ఎక్కించారు. నాయకులు వై.నేతాజీ, జేవీ రాఘవులు, ఎం.రవి, వేముల దుర్గారావు, బూరగ వెంకటేశ్వర్లు, వై కమాలాకర్‌రావు, కొట్టే కరుణాకర్‌, వెంగమ్మ తదితరులను అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. నేతలను అదుపులోకి తీసుకోవడం సరికాదని సీపీఎం రూరల్‌ కార్యదర్శి దొంతిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. 


ఫలించిన ఆందోళన...


మునిసిపల్‌ కార్మికుల ఆందోళన నేపథ్యంలో ఎంటీఎంసీ డిప్యూటీ కమిషనర్‌ రవిచంద్రారెడ్డి జీతాలు చెల్లిస్తామని ప్రకటించారు. శుక్రవారం ఒప్పంద కార్మికులకు, 6వ తేదీన మిగిలిన వారికి జీతాలు చెల్లిస్తామని ప్రకటించారు. మిగిలిన సమస్యలు చర్చించేందుకు శుక్రవారం సాయంత్రం లోపు ఎంటీఎంసీ కమిషనర్‌ యూనియన్‌ నేతలతో జాయింట్‌ మీటింగ్‌ ఏర్పాటు చేస్తామన్నారు. కాగా కార్మిక నేతలు మాట్లాడుతూ కమిషనర్‌తో జాయింట్‌ మీటింగ్‌ లేకపోతే 31న ఎంటీఎంసీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రకటన అనంతరం అదుపులోకి తీసుకున్న యూనియన్‌ నేతలను పోలీసులు విడుదల చేశారు. 






Updated Date - 2021-07-30T06:37:47+05:30 IST