కొత్తవలసలో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2021-02-24T05:09:07+05:30 IST

కొత్తవలస పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మద్దతు అభ్యర్థికి అన్యాయం జరిగిందంటూ జడ్పీటీసీ అభ్యర్థి గొరపల్లి సుజాత ఆత్మహత్యాయత్నం చేశారు. భవిష్యత్‌లో తనకైనా అన్యాయం జరగదని నమ్మకం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ కొత్తవలస జంక్షన్‌లో ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పు అంటించుకునేందుకు ప్రయత్నించారు.

కొత్తవలసలో ఉద్రిక్తత
ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న జడ్పీటీసీ తెలుగుదేశం అభ్యర్థి గొరపల్లి సుజాత

జడ్పీటీసీ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం

ఒంటిపై పెట్రోల్‌ పోసుకున్న సుజాత

అడ్డుకున్న కార్యకర్తలు, నాయకులు

పంచాయతీ ఎన్నికల్లో చోటుచేసుకున్న ఘటనపై నిరాశతోనే..

కొత్తవలస, ఫిబ్రవరి 23: కొత్తవలస పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మద్దతు అభ్యర్థికి అన్యాయం జరిగిందంటూ జడ్పీటీసీ అభ్యర్థి గొరపల్లి సుజాత ఆత్మహత్యాయత్నం చేశారు. భవిష్యత్‌లో తనకైనా అన్యాయం జరగదని నమ్మకం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ కొత్తవలస జంక్షన్‌లో ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పు అంటించుకునేందుకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న కార్యకర్తలు, నాయకులు వెంటనే ఆమె ప్రయత్నాన్ని నిలువరించారు. ఆ సమయంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

కొత్తవలస పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మద్దతుదారు బోని తిరుపతిరావు విజయం సాధించినా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధి కుమ్మక్కై అన్యాయం చేశారంటూ తహసీల్దార్‌ కార్యాలయంలో అభ్యర్ధి తిరుపతిరావుతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసనవ్యక్తం చేస్తున్నారు. వీరికి సంఘీభావంగా తెలుగుదేశం పార్టీ తరపునజడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గొరపల్లి సుజాత మంగళవారం పెద్ద ఎత్తున మహిళలు, కార్యకర్తలతో ర్యాలీ చేపట్టారు. కొత్తవలస జంక్షన్‌కు చేరుకున్నాక అక్కడే ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ పూలమాల వేశారు. కొత్తవలస పంచాయతీ పరిధిలోని ప్రతి ఇంటికీ వెళ్లి తెలుగుదేశం పార్టీ మద్దతుదారుకు ఓటేయాలని తాను కోరితే ప్రజలు తన మాటను మన్నించి ఓట్లు వేశారని, భవిష్యత్తులో జరిగే జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా తనను గెలిపించినా ప్రభుత్వం అన్యాయం చేయదని నమ్మకం ఏంటని ప్రశ్నించారు. అదే సమయంలో తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నం  చేశారు. దీంతో అక్కడే ఉన్న కార్యకర్తలు, నాయకులు అడ్డుకున్నారు. తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఉన్న ఆమె భర్త గొరపల్లి రాము, మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి వెంటనే అక్కడకు చేరుకుని సుజాతను నిలువరించారు. సీఐతో పాటు పోలీసులు వచ్చి సుజాతను ఇంటికి పంపించారు. టీడీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహానికి లోనై ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మళ్లీ కౌంటింగ్‌ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ పరిణామాలతో కొత్తవలస జంక్షన్‌లో వాహనాల రాకపోకలు స్తంభించాయి. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.

దొడ్డిదారిన గెలవడానికి వైసీపీ పన్నాగాలు

 ప్రజలలో విశ్వాసం కోల్పోయి చీకొట్టినా దొడ్దిదారిన గెలవడానికి వైసీపీ పన్నాగాలు పన్నుతోందని తెలుగుదేశం పారీ నాయకుడు, గీతం విద్యాసంస్థల చైర్మన్‌ ఎం.శ్రీభరత్‌ అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో జరిగిన అన్యాయంపై కొత్తవలస తహసీల్దార్‌ కార్యాలయం సమీపంలో నిరసన దీక్ష చేస్తున్న టీడీపీ మద్దతు అభ్యర్థి బోని తిరుపతిరావుకు సంఘీభావం తెలిపారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారితో పాటు మాట్లాడుతూ ఓడిన అభ్యర్థి గెలిచినట్టు ప్రకటించుకుని ప్రజాస్వామ్యానికి వైసీపీ తూట్లు పొడుస్తోందని విమర్శించారు. రీకౌంటింగ్‌ చేయాలని కోరినా పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. అనంతరం స్థానిక ఎంపీడీఓ కార్యాల యానికి వెళ్లారు. కొత్తవలసలో ఏ వార్డులో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో అడగాలని ప్రయత్నించారు. ఎంపీడీఓ కార్యాలయంలో లేకపోవడంతో వెనుతిరిగారు. ఏ తప్పూ చేయకపోతే అధికారులు ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నారని శ్రీభరత్‌ ప్రశ్నించారు. 

కలెక్టర్‌కు ఫిర్యాదు

కొత్తవలస మేజర్‌ పంచాయతీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపులో అన్యాయం జరిగిందని, దీనిని  వెంటనే సరిచేయాలని టీడీపీ రాష్ట్ర నాయకులు శ్రీభరత్‌, మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి మంగళవారం మధ్యాహ్నం కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ను కోరారు. అనంతరం ఫిర్యాదు అందజేశారు. ఓట్ల లెక్కింపులో పూర్తిగా అక్రమాలు చోటు చేసుకున్నాయని.. తమకు సమాచారం ఇవ్వకుండా, ఏజెంట్లు లేకుండా ఓట్లు లెక్కించారని అందులో పేర్కొన్నారు. మొదటి నుంచి టీడీపీ మద్దతుదారుడు అధిక్యంలో ఉన్నట్టు ఎన్నికల అధికారులే చెప్పారని, అంతలోనే స్థానిక  ఎమ్మెల్యే వచ్చి అధికారులతో మాట్లాడారని తెలిపారు. ఆ సమయంలో ఏజెంట్లకు ఏ విషయం చెప్పకుండానే వైసీపీ మద్దతుదారుడు 10 ఓట్లతో గెలిచినట్టు చెప్పడం దారుణమని వివరించారు. రీ కౌంటింగ్‌ పెట్టకుండా, ఏజెంట్ల సంతకాలు తీసుకోకుండా గెలిచినట్లు ప్రకటించడం అన్యాయమన్నారు. ఈ విషయాన్ని పరిశీలించాలని కోరారు. 



Updated Date - 2021-02-24T05:09:07+05:30 IST