లక్కవరంలో టెన్షన్‌ టెన్షన్‌

Published: Wed, 06 Jul 2022 00:51:20 ISTfb-iconwhatsapp-icontwitter-icon
లక్కవరంలో టెన్షన్‌ టెన్షన్‌సూర్యాపేట జిల్లా లక్కవరంలో పోలీసులతో షర్మిల వాగ్వాదం

షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత

ఏపూరి సోమన్నపై టీఆర్‌ఎస్‌ నాయకుల దాడి

నిరుద్యోగ దీక్ష అనంతరం షర్మిల ధర్నా, వర్షంలోనూ ఆందోళన

పోలీసులే దగ్గరుండి దాడి చేయించారు

ఎమ్మెల్యే అవినీతిని ప్రశ్నిస్తే దాడులా?

వైఎస్సాఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల


హుజూర్‌నగర్‌ : సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ మండలంలోని లక్కవరంలో వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రజాప్రస్థాన పాదయాత్రలో మంగళవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్‌టీపీ అధికార ప్రతినిధి ఏపూరి సోమన్నపై టీఆర్‌ఎస్‌ వర్గీయుల దాడి, పోలీసుల రంగ ప్రవేశం, వారితో షర్మిల వాగ్వాదం,జోరువానలో రాత్రి తొమ్మి ది గంటల వరకు షర్మిల నిరసనతో లక్కవరంలో ఎప్పుడేం జరుగు తోందోననే టెన్షన్‌ టెన్షన్‌ ఏర్పడింది.   


ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా 115వ రోజైన మంగళవారం హుజూర్‌నగర్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయ సమీపంలోని క్యాంప్‌ నుంచి షర్మిల ఉదయం 11గంటలకు పాదయాత్ర ప్రారంభించారు. మధ్యాహ్నం లక్కవరం గ్రామానికి చేరుకుని ఎస్సీ కమ్యూనిటీహాల్‌ ఆవరణలో నిరుద్యోగ నిరాహారదీక్ష నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న ఏపూరి సోమన్నపై కొంతమంది టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు మధ్యాహ్నం 2గంటల సమయంలో దాడికి ప్రయత్నించారు. వైఎస్సాఆర్‌టీపీ నాయకులు ప్రతిఘటించడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుని దీక్షా శిబిర ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. వైఎస్సార్‌టీసీ నాయకులు ఎమ్మెల్యే సైదిరెడ్డి, సీఎం కేసీఆర్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీక్షను అడ్డుకునేందుకు టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రయత్నించినా వీలుకాకపోవడంతో వెనుదిరిగారు. అనంతరం దీక్ష శిబిరంలో ఆటపాటలతో ఎమ్మెల్యే సైదిరెడ్డిపై ఏపూరి సోమన్న తీవ్రవిమర్శలు గుప్పించారు. దీక్ష సందర్భంగా మాట్లాడిన షర్మిల సైతం ఎమ్మెల్యే సైదిరెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. దీక్షా శిబిరం నుంచి సాయంత్రం 4గంటలకు పాదయాత్ర ప్రారంభం కాగా, టీఆర్‌ఎస్‌కు నాయకులు రెండోసారి అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొద్దిదూరం వెళ్లగానే సోమన్నపై పిడిగుద్దులతో దాడికి పాల్పడటంతో వైఎస్సార్‌టీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. సీఐ, ముగ్గురు ఎస్‌ఐలు, పోలీసులు ఉండగానే దాడి చేయడంతో షర్మిల వారితో వాగ్వాదానికి దిగారు. కొద్ది దూరం నడిచాక గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన షర్మిల అక్కడే ధర్నాకు దిగారు. సోమన్నపై దాడి చేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేయకుండా పంపించివేశారని ఆరోపించారు. ఇదే విషయమై సీఐ రామలింగారెడ్డి, ఎస్‌ఐ వెంకటరెడ్డి, సైదులు, రవికుమార్‌ సైతం షర్మిలతో వాగ్వాదానికి దిగారు. పోలీసులకు, షర్మిలకు మధ్య మాటామాటా చోటుచేసుకుంది. కాగా ఘర్షణ సమయంలో వైఎస్సార్‌టీపీ మహిళా కార్యకర్తలపై పోలీసులు దాడి చేశారని చైతన్యరెడ్డి అనే నాయకురాలు ఆరోపించారు. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించి దాడి చేశారని సీఐకి వైఎస్‌ షర్మిల ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కేసు నమోదుచేశామని, వారిపై చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 9గంటల వరకు షర్మిల నిరసన దీక్ష నిర్వహించారు. జోరు వానలో సైతం కార్యకర్తలతో కూర్చొని షర్మిల దీక్ష చేశారు. చివరికి పోలీసులు ఎంత చెప్పినా వినకపోవడంతో కోదాడ డీఎస్పీ వెంకటేశ్వరరెడ్డి అక్కడికి చేరుకొని నిందితులను అరెస్ట్‌ చేయడంతో పాటు ఏపూరి సోమన్నకు భద్రత కల్పిస్తామని హామీ ఇవ్వడంతో షర్మిల దీక్ష విరమించారు. కాగా, షర్మిల దీక్ష విరమించిన అనంతరం రాత్రి 9గంటలకు లక్కవరం నుంచి శ్రీనివాసపురం క్యాంప్‌ వరకు సుమారు 3కి.మీ చీకట్లోనే పాదయాత్ర నిర్వహించారు. నియోజకవర్గంలో మరోరెండురోజులు షర్మిల పాదయాత్ర ఉండగా, ఎలా సాగుతుందో అనే ఉత్కంఠ  నెలకొంది.


 పోలీసులు  బెదిరించారు

పాదయాత్ర ఎలా చేస్తావో చూస్తామంటూ సీఐ, ఎస్‌ఐ లు బెదిరించారని వైఎస్సాఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. నిరసన దీక్షలో ఆమె మాట్లాడుతూ, ఎమ్మెల్యే సైదిరెడ్డి అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలతో దాడులు చేయించాడన్నారు. మహిళా కార్యకర్త చైతన్యరెడ్డిపై పోలీసులు దాడి చేశారనని, ఏపూరి సోమన్నపై టీఆర్‌ఎస్‌ మఠంపల్లి మండల అధ్యక్షుడు ఇరుగు పిచ్చ య్య, అతడి అనుచరులు, స్థానిక సర్పంచ్‌ భర్త నూకపం గు నరేష్‌, అతడి అనుచరులు దాడి చేశారన్నారు. నిందితులను గుర్తించి ఫలానా వ్యక్తి అని చెప్పినా సీఐ రామలింగారెడ్డి, ముగ్గురు ఎస్‌ఐలు వెంకటరెడ్డి, సైదులు, రవి వారిని సంఘటనా స్థలం నుంచి పంపించి వేశారన్నా రు. ఈ విషయమై పోలీసుల అందరిపైనా ఫిర్యాదు చేసినట్లు షర్మిల తెలిపారు. తాను ప్రజాస్వామ్యబద్ధంగా పాదయాత్ర చేస్తున్నానని, నిరుద్యోగ దీక్షలో కూర్చున్నామన్నారు. టీఆర్‌ఎస్‌ గుండాలు రౌడీ ల్లా వ్యవహరించి పాదయాత్రను, దీక్షను అడ్డుకున్నారని అన్నారు. సోమన్నపై కావాలనే దాడి చేశారని ఆరోపించారు. మధ్యాహ్నం సోమన్నపై రెక్కీ నిర్వహించారని, మధ్యాహ్నం దీక్షను అడ్డుకోబోగా పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదన్నారు. పాదయాత్ర సమయంలో టీఆర్‌ఎస్‌ నాయకు లు సోమన్నపై దాడి చేసి చైతన్యరెడ్డి ని నెట్టివేశారని ఆరోపించారు. పోలీసులు టీఆర్‌ఎస్‌ కార్యకర్తల్లా ప్రవర్తిస్తున్నారని, వారికి జీతాలు ఇచ్చేది ప్రభుత్వమని, టీఆర్‌ఎస్‌ పార్టీ కాదన్నారు. గులాబీ కండువాలు వేసుకుని పోలీసులు పనిచేస్తున్నారా అని ప్రశ్నించారు. పోలీసులు తనతో ఘర్షణ పడి నువ్వు పాదయాత్ర ఎలా చేస్తావంటూ బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు.


సోమన్నపై దాడి తగదు

ఏపూరి సోమన్నపై దాడికి యత్నాన్ని తెలుసుకున్న కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ జిల్లా కన్వీనర్‌ సుదర్శన్‌ దీక్షా శిబిరా న్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. సోమన్న కాంగ్రె స్‌ను, తమ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని విమర్శించారని, అయితే దాన్ని రాజకీయ విమర్శగా మాత్రమే చూడాలన్నారు. టీఆర్‌ఎస్‌ నాయకులు దాడిచేయడం సరికాదన్నారు. దళిత కాలనీలో దళితుడైన సోమన్నపై దాడిచేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.