దుకాణాల కూల్చివేత ఉద్రిక్తం

ABN , First Publish Date - 2021-10-18T03:47:27+05:30 IST

మహబూబ్‌నగర్‌ ఆర్టీసీ బస్టాండ్‌ ముందున్న అద్దె దుకాణాల తొలగింపు ఆదివారం ఉద్రిక్తతకు దారి తీసింది. రోడ్డు విస్తరణలో భాగంగా దుకాణాలను తొలగించుకోవాలని అధికారులు గతంలో నోటీసులు జారీ చేసినా తొలగించకపోవడంతో మునిసిపల్‌ అధికారులు ఎక్స్‌కవేటర్‌తో కూల్చివేయించారు.

దుకాణాల కూల్చివేత ఉద్రిక్తం
దుకాణాలను కూల్చేస్తున్న ఎక్స్‌కవేటర్‌

ఆర్టీసీ బస్టాండ్‌ ముందున్న దుకాణాల తొలగింపు

నోటీసులు ఇవ్వకుండా రోడ్డుపాలు చేశారంటున్న బాధితులు

నోటీసులు ఇచ్చామన్న ఆర్టీసీ, మునిసిపల్‌ శాఖ

గతేడాది జూన్‌ నాటికే అగ్రిమెంట్‌ పూర్తయ్యిందని వెల్లడి

లెక్కచేసి డిపాజిట్‌లు ఇవ్వడానికి సిద్ధం: ఆర్టీసీ డీఎం అశోక్‌రాజు


మహబూబ్‌నగర్‌, అక్టోబరు 17: మహబూబ్‌నగర్‌ ఆర్టీసీ బస్టాండ్‌ ముందున్న అద్దె దుకాణాల తొలగింపు ఆదివారం ఉద్రిక్తతకు దారి తీసింది. రోడ్డు విస్తరణలో భాగంగా దుకాణాలను తొలగించుకోవాలని అధికారులు గతంలో నోటీసులు జారీ చేసినా తొలగించకపోవడంతో మునిసిపల్‌ అధికారులు ఎక్స్‌కవేటర్‌తో కూల్చివేయించారు. బస్టాండ్‌ ముందు 16 అద్దె దకాణాలు ఉన్నాయి. వీటి ద్వారా ఆర్టీసీకి నెలకు రూ.10 లక్షల వరకు అద్దె వచ్చేది. రహదారి విస్తరణలో భాగంగా సెంటర్‌ డివైడర్‌ నుంచి దుకాణాలు 80 ఫీట్లు లోపలికి వస్తుండటంతో వాటి తొలగింపు అనివార్యమైంది. ఇక్కడ దుకాణాలు నిర్వహించే వారికి ప్రత్యామ్నాయంగా పట్టణంలో మరో చోట స్థలం చూయించాలని అధికారులు భావిస్తున్నారు. దుకాణాలను ఖాళీ చేయాలని పలుమార్లు నోటీసులు జారీ చేసినా, తొలగించకపోవడంతో పోలీసుల బందోబస్తు నడుమ కూల్చివేయించారు. 16 దుకాణాల్లో ఇదివరకే ఎనిమిది మంది ఖాళీ చేయగా మరో ఎనిమిది మాత్రం దుకాణాలను కొనసాగిస్తున్నారు. హోటల్‌ నిర్వహిస్తున్న లక్ష్మి దుకాణం కూల్చివేత తర్వాత సామగ్రిని తీసుకెళ్లకుండా అక్కడే వదిలేశారు.


ఆటో పార్కింగ్‌ క్రమబద్ధీకరణకు యత్నం

బస్టాండ్‌ ముందున్న అద్దె దుకాణాలను తొలగించాక రోడ్డు వెడల్పులో పోను మిగతా స్థలాన్ని చదును చేసి, ఆటో పార్కింగ్‌తోపాటు పాటు ఇతర వాహనాల పార్కింగ్‌ను క్రమబ ద్ధీకరించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆటోలను బస్టాండ్‌ ముందు రహదారిపైనే నిలుపు తున్నారు. రోడ్డు విస్తరణ అనంతరం బస్టాండ్‌ను ఆధునికీకరించి ఖాళీ స్థలంలో ఆటో స్టాండ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.


నోటీసులు ఇవ్వకుండా కూల్చేశారు

మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా దుకాణాలు తొలగించి రోడ్డుపాలు చేశారు. కరోనా కాలంలో తీవ్రంగా నష్టపోయాం. తీరా ఇప్పుడు చెప్పాపెట్టకుండా తొలగిస్తే మా బతుకులు ఏం కావాలి. మేం సంపాదించుకున్నది ఏమీ లేదు. రూ.లక్షలకు లక్షలు డిపాజిట్లు చేశాం. అవి చెల్లించకుండా కూల్చేస్తే ఎలా? మేం ఏడు దుకాణాలను అద్దెకు తీసుకున్నాం. ఇప్పుడు తమ బతుకుదెరువు ఏంటి? 

- లక్ష్మి, హాటల్‌ నిర్వాహకురాలు


లీజు ముగిసింది

రోడ్డు విస్తరణలో భాగంగా దుకాణాలను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దుకాణాలను ఖాళీ చేయాలని నిర్వాహకులకు మూడు నోటీసులు ఇచ్చాం. గతేడాది జూన్‌ వరకే దుకాణాల లీజు అయిపోయింది. అప్పటి నుంచి అద్దె కూడా తీసుకోవడం లేదు. సెక్యూరిటీ డిపాజిట్‌ తిరిగి చెల్లించడానికి సిద్ధం. జూన్‌ నాటికి అద్దె బకాయి ఉంటే లెక్క చేసి, మిగతా డిపాజిట్‌ సొమ్ము ఇచ్చేస్తాం. 8 దుకాణాలకు డిపాజిట్‌ ఇచ్చాం. మరో ఎనిమిది మందికి ఇవ్వాల్సి ఉంది. నోటీసులు ఇవ్వడం లేదని చెప్పడం సరికాదు. మునిసిపల్‌ శాఖ నుంచి కూడా నోటీసులు జారీ చేశామని టౌన్‌ప్లానింగ్‌ అధికారి ప్రతాప్‌ తెలిపారు. 

- అశోక్‌రాజు, ఆర్టీసీ ఎండీ

Updated Date - 2021-10-18T03:47:27+05:30 IST