దర్గా స్థలం చదునుపై ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-05-24T07:12:01+05:30 IST

పామూరులో ఎప్పటి నుంచో ఉన్న మౌలాసాహెబ్‌ దర్గాను మండల వైస్‌ ఎంపీపీ షేక్‌ రషీద్‌, అతని సోదరులు హజీమలాన్‌, అబ్దుల్‌ రజాక్‌, చాంద్‌బాషాలు సోమవారం ఎక్స్‌కవేటర్‌తో ధ్వంసం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది.

దర్గా స్థలం చదునుపై ఉద్రిక్తత
పామూరు పోలీసు స్టేషన్‌ను ముట్టడించిన ఓవర్గం

అడ్డుకున్న మరోవర్గం

పోలీస్‌ స్టేషన్‌లో పరస్పర ఫిర్యాదులు

కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆందోళన

పామూరు, మే 23: పామూరులో ఎప్పటి నుంచో ఉన్న మౌలాసాహెబ్‌ దర్గాను మండల వైస్‌ ఎంపీపీ షేక్‌ రషీద్‌, అతని సోదరులు హజీమలాన్‌, అబ్దుల్‌ రజాక్‌, చాంద్‌బాషాలు సోమవారం ఎక్స్‌కవేటర్‌తో ధ్వంసం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. కూల్చివేత విషయం తెలిసి పట్టణ ముస్లింలు పార్టీలకతీతంగా పోలీస్‌ స్టేషన్‌ను ముట్టడించారు. దర్గా పాడుబడిందనే నెపంతో అన్యాయంగా నేలమట్టం చేయడం దుర్మార్గమంటూ స్టేషన్‌ ఎదుట రాస్తారోకో చేపట్టి పెద్దఎత్తున నినాదాలు చేశారు. దాంతో సీఐ శ్రీనివానరావు, కనిగిరి సీఐ సుబ్బారావు అక్కడకు చేరుకున్నారు. అదనపు బలగాలను రప్పించారు. ఆందోళనకారులతో పలుదఫాలుగా చర్చించినా ఫలితం లేకుండాపోయింది. వైసీపీ నాయకుల తీరును పట్టణ ప్రజలు ఆక్షేపించారు. ఆందోళనకారులు ఇచ్చిన ఫిర్యాదును నమోదు చేసుకున్నామని ఎస్‌ఐ సురేష్‌ తెలిపారు. తర్వాత స్టేషన్‌ నుంచి తరలివెళ్లిన ఆందోళనకారులు గతంలో ఉన్న స్థలంలోనే తిరిగి దర్గా కట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 4గంటలపాటు ఆందోళన కార్యక్రమం సాగింది. వైసీపీలోనే మరోవర్గం వారు వైస్‌ ఎంపీపీ రషీద్‌కు వ్యతిరేకంగా ఆందోళనకారు లకు మద్దతు ఇవ్వడం విశేషం.


మేమే హక్కుదారులం..

 పట్టణంలోని సీఎస్‌పురం రోడ్డులో ఉన్న స్థలంలో దర్గాను పోతకమూరి హుస్సేన్‌, మదర్సాహెబ్‌ నిర్వహి స్తున్నారు. ఆలనాపాలనా లేకుండా పోవడంతో అది శిథిలా వస్థకు చేరింది. దీంతో నానాసాహెబ్‌ కుమారులు ఆ స్థలాన్ని తమ తండ్రి 1958లో కొనుగోలు చేశారని, రిజిస్టర్‌ కూడా ఉందని చెప్తున్నారు. ఆ స్థలంలో తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఉచిత మంచినీటి పథకాన్ని నిర్మించేందుకు చదును చేస్తున్నామన్నారు. దీనిపై ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నామని, అంతవరకూ సంయమనంగా ఉండాలని ఇరువర్గ్గాలకు ఎస్‌ఐ సురేష్‌ సూచించారు.

Updated Date - 2022-05-24T07:12:01+05:30 IST