టెన్షన్‌.. టెన్షన్‌

ABN , First Publish Date - 2021-08-03T05:02:39+05:30 IST

బొబ్బిలి వేణుగోపాలస్వామి ఆలయ ఆస్తులు, ఆభరణాల పరిశీలనకు దేవదాయ శాఖ అధికారులు సోమవారం రావడం ఉత్కంఠ రేపింది. సోమవారం ఉదయం బ్యాంకుల్లో ఉన్న ఆభరణాలను ఆలయ ప్రాంగణం వద్దకు చేర్చారు. అనంతరం దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ భ్రమరాంబ ఆధ్వర్యంలో ఆస్తులను పరిశీలించడం ప్రారంభించారు. గత కొంత కాలంగా ఆలయ ఆస్తులపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈ పరిశీలన చేపట్టారు.

టెన్షన్‌.. టెన్షన్‌
ఆభరణాలను సరిచూస్తున్న దేవదాయశాఖ సిబ్బంది

బొబ్బిలి వేణుగోపాలస్వామి ఆలయ ఆస్తుల లెక్కింపు

దేవాలయంలోకి ఎవరినీ అనుమతించని వైనం

బందోబస్తు నడుమ బంగారు ఆభరణాల పరిశీలన

నేడు కోటలోని భాండాగారంలో విచారణ

సీతానగరం(బొబ్బిలి), ఆగస్టు 2: బొబ్బిలి వేణుగోపాలస్వామి ఆలయ ఆస్తులు, ఆభరణాల పరిశీలనకు దేవదాయ శాఖ అధికారులు సోమవారం రావడం ఉత్కంఠ రేపింది. సోమవారం ఉదయం బ్యాంకుల్లో ఉన్న ఆభరణాలను ఆలయ ప్రాంగణం వద్దకు చేర్చారు. అనంతరం దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ భ్రమరాంబ ఆధ్వర్యంలో ఆస్తులను పరిశీలించడం ప్రారంభించారు. గత కొంత కాలంగా ఆలయ ఆస్తులపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈ పరిశీలన చేపట్టారు. విషయం జిల్లా అంతా వ్యాపించడంతో చర్చకు దారితీసింది. దేవదాయ శాఖ అధికారులు, ఆలయ ట్రస్టీ సుజయ్‌ కృష్ణరంగారావును మాత్రమే అనుమతించారు. ఈ ఆభరణాలన్నీ స్థానిక స్టేట్‌బ్యాంకులో భద్రపరిచినవే. వీటిని మొదట పోలీసు బందోబస్తుతో బ్యాంకు నుంచి ఆలయ ప్రాంగణానికి తీసుకువచ్చారు. అధికారులు, సిబ్బంది ఒక్కొక్కటిగా పరిశీలించారు. జాబితా మేరకు ఉన్నాయా, లేవా, అని ఆరా తీశారు.  వేణుగోపాలస్వామికి సంబంధించిన సుమారు 138 వస్తువులు, ఆభరణాలను పరిశీలించారు. అన్నీ ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. మంగళవారం కూడా ఆస్తులపై విచారణను కొనసాగించనున్నారు. రాజుల నిలయమైన బొబ్బిలి కోటలోని ఆస్తుల భాండాగారాన్ని తెరవనున్నారు. ఆ తర్వాతే పూర్తిస్థాయిలో ఆస్తుల విషయం వెల్లడించనున్నారు. ఇదిలా ఉండగా శ్రీకాకుళం జిల్లా వంగర మండలం గుల్లసీతారాంపురం గ్రామంలోని సీతారామస్వామికి సంబంధించిన 50 రకాల ఆభరణాలను కూడా పరిశీలించారు. అన్నీ యథాతథంగా ఉన్నాయని నిర్ధారించారు. అనంతరం దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్‌ భ్రమరాంబ విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బొబ్బిలి, గొల్లసీతారాంపురం ఆలయాలకు సంబంధించిన ఆభరణాలను సోమవారం సరి చూశామన్నారు. అన్ని సక్రమంగా ఉన్నాయని ప్రకటించారు. బంగారు ఆభరణాలు మాత్రమే బ్యాంకు లాకర్‌ నుంచి తెప్పించి లెక్కించామని, ఇతర ఆభరణాలు బొబ్బిలి కోటలోని భాండాగారం నుంచి మంగళవారం తెప్పించి పరిశీలిస్తామని తెలిపారు. పరిశీలనలో ఆర్‌జేసీ సురేష్‌బాబు, డీసీ పుష్పవర్ధన్‌, సిబ్బంది బలివాడ వైకుంఠ మాధవ, ప్రసాద్‌, శ్రీకాకుళం జిల్లా ఏసీ అన్నపూర్ణ పాల్గొన్నారు. 

ప్రభుత్వ అనుమానాలు నివృత్తి: సుజయ్‌

 వేణుగోపాల స్వామివారి ఆస్తులు.. ఆభరణాల విషయంలో ప్రభుత్వానికి ఉన్న అనుమానాలు నివృత్తి అవుతున్నాయని ట్రస్టీ సుజయ్‌ కృష్ణరంగారావు వెల్లడించారు. ఆయన సోమవారం విలేకరులలో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు దేవదాయ శాఖ అధికారులు బ్యాంకు నుంచి ఆభరణాలు తెచ్చి పరిశీలించారని, సుమారు 9 నుంచి 10 కేజీల బరువు గల అన్ని ఆభరణాలు సక్రమంగా ఉన్నాయని తెలుసుకున్నారని చెప్పారు. 



Updated Date - 2021-08-03T05:02:39+05:30 IST