కుప్పంలో రెండో రోజు కొనసాగుతున్న ఉద్రిక్తత

ABN , First Publish Date - 2020-10-27T18:31:22+05:30 IST

చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో రెండో రోజు ఉద్రిక్తత కొనసాగుతోంది.

కుప్పంలో రెండో రోజు కొనసాగుతున్న ఉద్రిక్తత

చిత్తూరు : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో రెండో రోజు ఉద్రిక్తత కొనసాగుతోంది. కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌పై టీడీపీ పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. కాలువ గట్టుపై భారీగా పోలీస్‌ బందోబస్తు కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు టీడీపీ ముఖ్యనేతలను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. హౌస్‌ అరెస్ట్‌లపై జిల్లా ఎస్పీకి చంద్రబాబు లేఖ రాశారు. అరెస్ట్‌ చేసిన టీడీపీ నేతలను విడుదల చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.


వైసీపీ అడ్డగింత అల్టిమేటాలు, పోలీసుల హెచ్చరికల నడుమ హంద్రీ-నీవా సాధనకోసం కుప్పం నియోజకవర్గంలో టీడీపీ తలపెట్టిన పాదయాత్ర తీవ్ర ఉత్కంఠ రేపినా, ఎక్కడిక్కడ విపక్ష నేతల హౌస్‌ అరెస్టులతో సద్దుమణిగింది. మరోవైపు వైసీపీ పోటీగా తలపెట్టిన ర్యాలీని సైతం పోలీసుల మధ్యవర్తిత్వంతో విరమించుకోవడంతో ఉద్రిక్తత ఉపశమించింది అనుకున్నా మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.


కుప్పం ప్రజలు వెయిటింగ్!

హంద్రీనీవా, గాలేరు-నగరి పథకాలు రాయలసీమకు జీవామృతాలు. శివారు భూములకు కూడా సాగునీరు ఇవ్వాలన్న సంకల్పంతో కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను టీడీపీ ప్రభుత్వం చేపట్టింది. దాదాపు 90శాతం పనులను పూర్తి చేయడం జరిగింది. బ్రాంచ్ కెనాల్ పనులు ఎప్పుడు పూర్తి అవుతాయా అని.. కుప్పం ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. అందుకే కుప్పం ప్రజలు శాంతియుత ఆందోళనల ద్వారా తమ నీటి సమస్యను ప్రభుత్వం దృష్టికి తెచ్చే ప్రయత్నం చేశారు. చిత్తూరు జిల్లా పోలీసులు టీడీపీ నేతల్ని అక్రమ అరెస్ట్‌లు, గృహనిర్బంధాలు చేయడం బ్రిటిష్ రాజును గుర్తుకు తెస్తున్నాయి. రాజ్యాంగ వ్యతిరేక, అప్రజాస్వామిక అరెస్ట్‌లకు స్వస్తిపలకాలిఅని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

Updated Date - 2020-10-27T18:31:22+05:30 IST