ముసురు.. టెన్షన్‌

ABN , First Publish Date - 2021-11-03T05:32:17+05:30 IST

రెండు రోజులుగా ముసురు.. అడపాదడపా వర్షం పడుతూనే ఉంది. మరొక్క రోజే దీపావళి పర్వదినం. దీంతో టపాకాయల వ్యాపారుల్లో టెన్షన్‌ మొదలైంది.

ముసురు.. టెన్షన్‌
గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో రేకులతో షెడ్డులా బాణసంచా దుకాణం

బాణసంచా వ్యాపారుల్లో గుబులు

దుకాణాల వద్ద ముందస్తు ఏర్పాట్లు 


గుంటూరు, నవంబరు 2: రెండు రోజులుగా ముసురు.. అడపాదడపా వర్షం పడుతూనే ఉంది. మరొక్క రోజే దీపావళి పర్వదినం. దీంతో టపాకాయల వ్యాపారుల్లో టెన్షన్‌ మొదలైంది. జిల్లా వ్యాప్తంగా రూ.కోట్లలో బాణసంచా వ్యాపారం జరుగుతుంది. ఇప్పటికే తమిళనాడులోని శివకాశి నుంచి లైసెన్స్‌డ్‌ వ్యాపారులు జిల్లాకు పెద్దఎత్తున బాణసంచా దిగుమతి చేసుకున్నారు. జిల్లా కేంద్రం గుంటూరుతో పాటు మంగళగిరి, చిలకలూరిపేట, అమరావతి, తెనాలి, నరసరావుపేట ప్రాంతాల్లో హోల్‌సేల్‌గా బాణసంచా విక్రయాలు జరుగుతాయి. అయితే హోల్‌ సేల్‌ వ్యాపారాలు ఇప్పటి వరకు బాగానే జరిగాయి. ఇప్పుడు టెన్షన్‌ అంతా చిల్లర వర్తకులదే. పండుగ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో రిటైల్‌గా విక్రయించేందుకు కొందరు వ్యాపారులు రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు టపాకాయలు కొనుగోలు చేశారు. పండుగకు మూడు రోజుల ముందు నుంచే విక్రయాలు జరిపేలా ప్రత్యేకంగా స్టాల్స్‌ ఏర్పాటు చేసుకున్నారు. అయితే సోమవారం నుంచి పట్టిన ముసురు మంగళవారం కూడా కొనసాగింది. దీంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. గుంటూరులోని గుంటగ్రౌండ్‌, వెంకటేశ్వర విజ్ఞాన మందిరంతో పాటు పలు ప్రాంతాల్లో స్టాల్స్‌ ఏర్పాటు చేసిన బాణసంచా దుకాణాలు వెలిశాయి. వాతావరణ శాఖ ప్రకటనలతో వారి గుండెళ్ళ రైళ్ళు పరిగెడుతున్నాయి. ముసురు నేపథ్యంలో వ్యాపారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్టాల్స్‌పై కప్పునకు రేకులను వినియోగించి వర్షం పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. టార్పాలిన్‌ పట్టాలను అందుబాటులో ఉంచుకుంటున్నారు.  అయితే ముసురు ఇలానే కొనసాగితే కొనుగోళ్లు జరుగుతాయా లేదా.. ఇంత పెట్టుబడి వృథాయేనా అని పలువురు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో    ఈ సంవత్సరం శనివారం నాటికి అధికారులు 447 దుకాణాలకు అనుమతి పత్రాలు జారీ చేశారు.      

Updated Date - 2021-11-03T05:32:17+05:30 IST