కీలక పదవుల్లో టెన్తప్లాన ప్రాజెక్ట్‌ ఉద్యోగులు

ABN , First Publish Date - 2022-06-29T05:34:06+05:30 IST

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో టెన్తప్లాన ప్రాజెక్ట్‌ పోస్టులపై నియామకంపై మొదటి నుంచి విమర్శలు వెల్లువెత్తున్నాయి

కీలక పదవుల్లో టెన్తప్లాన ప్రాజెక్ట్‌ ఉద్యోగులు
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం

పదవులపై ఉన్నత విద్యాశాఖ అభ్యంతరం 

25 మంది ప్రొఫెస్లను కాదని ఇలా...

అయినా ఖాతరు చేయని వైనం

ఎస్కేయూనివర్సిటీలో వింత నియామకాలు


అనంతపురం సెంట్రల్‌, జూన 28 : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో టెన్తప్లాన ప్రాజెక్ట్‌ పోస్టులపై నియామకంపై మొదటి నుంచి  విమర్శలు వెల్లువెత్తున్నాయి. రోస్టర్‌, మెరిట్‌, రిజర్వేషన, యూజీసీ వంటి నిబంధనలు విస్మరించి పోస్టుల భర్తీ చేపట్టారు. అనుకూలమైన వారిని నియమించుకునేందుకు రోజుకొక ఎత్తుగడలు వేస్తూ అధికారులను పక్కదోవ పట్టించడం, దారికిరాని వారిని లొంగదీసుకోవడం. అక్రమాలను సరిచేసుకోవడంలో రాటుతేలారు. ఈ తరుణంలో ఆదాయ మార్గాలున్న పలు విభాగాలను అనుకూలమైనవారికి కేటాయించారన్న అపప్రదను ఎస్కేయూ మూటకట్టుకుంది. 


టెన్తప్లాన ప్రాజెక్ట్‌ పోస్టులకు ర్యాటిఫికేషన లేదు. అనేక కేసులు కోర్టులో ఉన్నాయి. ఎలాంటి అదనపు పోస్టులు ఇవ్వకూడదని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి అదేశాలు జారీచేసినా వర్శిటీ యాజమాన్యం వారినే అదనపు పదవుల్లో కొనసాగిస్తోంది. పరీక్షల విభాగం, ఫిజికల్‌ ఎడ్యుకేషన డిపార్ట్‌మెంట్‌, యూజీసీ వంటి విభాగాలకు కోఆర్డినేటర్లుగాను. అదనపు హాస్టల్‌ వార్డెనగా, రీ వ్యాల్యుయేషన కోఆర్డినేటర్‌గా, పీఆర్వోగా, లీగల్‌ అడ్వజర్‌గా ఇలా అనేకపోస్టుల్లో టెన్తప్లాన ప్రాజెక్ట్‌ ఉద్యోగులకు కట్టబెట్టిందని విమర్శిస్తున్నారు. వర్శిటిలోని వివిధ విభాగాల్లో దాదాపు 25 మంది అనుభవం కలిగిన రెగ్యులర్‌ ప్రొఫెసర్లు ఉన్నారు. వారిని కాదని టెన్తప్లాన ప్రాజెక్ట్‌ ఉద్యోగులపై ఎందుకంత ప్రేమ ఒలకబోస్తున్నారో అర్థం కావడంలేదు. అక్రమాల్లో రాటుతేలిన వారినుంచి అ’ధన’పు ఆదాయాల ద్వారా సొమ్ము చేసుకునేందుకే ఇలా అడ్డగోలు నియామకాలు చేపట్టారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  2006 నియామక సమయంలో అర్హతలు లేకున్నా అక్రమ మార్గాల ద్వారా ఉద్యోగాలు పొందిన వ్యక్తులు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మూడు సంవత్సరాల నుంచి వర్సిటీని శాసించేస్థాయికి ఎదిగారని మండిపడుతున్నాయి.


అడ్డదారిలో పోస్టుల క్రియేషన

వర్సిటీ పాలనలో రెక్టార్‌ నుంచి విభాగాల అధిపతుల వరకు ప్రతి పదవిలోనూ రెగ్యులర్‌ టీచింగ్‌ ఫ్యాకల్టీనే కీలక బాధ్యత వహిస్తారు. బాధ్యతగా ఉండటంతో చేసేపనిలో పారదర్శకత కచ్చితంగా పాటిస్తారు, జవాబుదారి తనంగా పనిచేస్తారన్న భావనతో  రెగ్యులర్‌ టీచింగ్‌ ఫ్యాకల్టికి పదవులను కేటాయిస్తారు. ఎస్కేయూ పెద్దలు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ప్రతి డిపార్ట్‌మెంట్‌లో రెగ్యులర్‌ ప్రొఫెసర్‌లుకే ఆయా విభాగాల్లో పరిపాలనకు సంబంధించిన బాధ్యతలను అధిపతులుగా కేటాయించాలి. అయితే వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం కొంతమంది రెగ్యులర్‌ ప్రొఫెసర్లపై కక్షకట్టిన యాజమాన్యం వారికెక్కడ పదవులు కేటాయించాల్సి వస్తోందోనని టెన్తప్లాన ప్రాజెక్ట్‌ పోస్టుల్లోని ఉద్యోగులకోసం అడ్డదారిలో పోస్టులను క్రియేషన చేశారంటూ వర్సిటీ వర్గాలు విమర్శిస్తున్నాయి. ఇందులో భాగంగానే కోఆర్డినేటర్‌, అడిషనల్‌ వార్డెన వంటి పోస్టులను క్రియేట్‌ చేసిందన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. 


ఉన్నత విద్యాశాఖ ఆదేశాలు బేఖాతర్‌

టెన్తప్లాన ప్రాజెక్ట్‌ పోస్టుల్లోని వారికి ఎలాంటి అదనపు పదవులు ఇవ్వకూడదని అప్పటి రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వర్సిటీ యాజమాన్యాన్ని ఆదేశించారు. వారి పోస్టులకు ర్యాటిఫికేషన లేదని ఈసీ సమావేశంలోనూ తీర్మానించారు. ఉన్నత విద్యాశాఖ ఆదేశాలు విస్మరించిన ఎస్కేయూ యాజమాన్యం ఆరుగురికి అదనపు పదవులు కట్టబెట్టిందని విద్యార్థులు, వర్సిటీ వర్గాలు మండిపడుతున్నాయి. దీంతో ఫిజికల్‌ ఎడ్యుకేషన డిపార్ట్‌మెంట్‌, డెరెక్టర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన, యూజీ విభాగాల కోఆర్డినేటర్లుగా కొనసాగుతున్నారు. అదేవిధంగా పీఆర్వో, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్‌, హాస్టల్‌ అడిషనల్‌ వార్డెనగా, రీ వ్యాల్యుయేషన కోఆర్డినేటర్‌గా మూడేళ్లుగా పనిచేస్తున్నారు. 


ఆ 25 మంది ప్రొఫెసర్లకు ఇవ్వొచ్చుగా 

వర్సిటీలోని 30కి పైగా విభాగాల్లో దశాబ్దాలపాటు పాఠాలు బోధించి అనుభవం కలిగిన దాదాపు 25 మంది రెగ్యులర్‌ ప్రొఫెసర్లకు వర్శిటీ యాజమాన్యం ఎలాంటి పదవులివ్వలేదు. ప్రొఫెసర్లకు అదనపు పదవులు ఇవ్వడం ద్వారా పాదర్శకత, నాణ్యతతోకూడిన న్యాయమైన సేవలందుతాయి. తద్వారా విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయడంతోపాటు వారి సేవలు వర్సిటీ పురోగాభివృద్ధికి దోపడుతాయని వర్శిటీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రొఫెసర్ల అనుభవాన్ని సద్వినియోగం చేసుకుని నూతన కార్యకలాపాలకు నాందివేయాల్సిన బాధ్యత వర్సిటీ యాజమాన్యంపై ఉంది. ఆ దిశగా పాటుపడాల్సిన యాజమాన్యం దొడ్డదారిలో కాసులు రాల్చుకునేందుకు టెన్తప్లాన ప్రాజెక్ట్‌ పోస్టుల్లోని వారికి అ’ధన’పు పదవులు కట్టబెట్టిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.  


ఓఎ్‌సడీ టూ వీసీ పదవికే ఎసరు

ఉద్యోగాల్లో కొనసాగేందుకే అర్హతలేని వారు ఏకంగా ఓఎ్‌సడీ టూ వీసీ, డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మిషన డిప్యూటీ డైరెక్టర్‌ వంటి కీలక పదవులకే  టెన్తప్లాన ప్రాజెక్ట్‌ ఉద్యోగులు ఎసరు పెట్టారు. అనుభవం కలిగిన ప్రొఫెసర్లు చేపట్టాల్సిన పదవులను వారు చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ విషయాన్ని పసిగట్టిన రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ వారి ఎత్తులను చిత్తుచేసింది. దీంతో అడ్డదారిలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లుగా కొనసాగుతున్న వారికి కీలకమైన పోస్టులను కట్టబెట్టేందుకు యత్నించిన వర్శిటీ యాజమాన్యం భంగపాటుకు గురైంది. అయినా వారిని నేటీకి కీలకపోస్టుల్లో కొనసాగిస్తోందంటూ వర్సిటీ వర్గాలు మండిపడుతున్నాయి.


‘లా’ లేని వ్యక్తి లీగల్‌ అడ్వైజర్‌!

న్యాయపరమైన చిక్కులు, సమస్యల పరిష్కారాలకు ప్రతి సంస్థ ఒక లీగల్‌ అడ్వైజర్‌ను నియమించుకుంటుంది. ఇందుకు న్యాయ విద్య పూర్తీచేసి, కోర్టుల ఆదేశాలపై, కేసుల విచారణపై పట్టుసాధించి అనుభవమున్న వారిని అడ్వైజర్‌గా నియమిస్తారు. అయితే న్యాయ విద్య చదవని టెన్తప్లాన ప్రాజెక్ట్‌ పోస్టులోని ఒక వ్యక్తికి వర్సిటీ యాజమాన్యం లీగల్‌ అడ్వైజర్‌ పదవిని కట్టబెట్టింది. ఈ అంశంపై వివాదాలు చెలరేగడంతో లా కాలేజ్‌ ప్రొఫెసర్‌ను నియమించారు. అయినా అనామతుగా ఆయనే నేటికీ లీగల్‌ అడ్వైజర్‌గా కొనసాగుతున్నారు. అదేవిధంగా ఇస్రో ప్రాజెక్ట్‌ అంశంలోనూ ప్రొఫెసర్‌ను పక్కనబెట్టి టెన్తప్లాన ప్రాజెక్ట్‌ పోస్టులోని ఒక వ్యక్తికే కట్టబెట్టారు. మరోవైపు యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా అడ్డదారిలో ఉద్యోగం పొందిన వ్యక్తి అదే యూజీసీ సంస్థ కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. దూరవిద్యలో పీజీ చేసిన మరో ఉద్యోగి పరీక్షల విభాగంలో రీ వ్యాల్యుయేషన కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్నారు. ఈ లెక్కన వర్సిటీ యాజమాన్యం వారికి ఎలా దాసోహమైందో తెలియాల్సి ఉంది. 


పోస్టీంగ్‌ ఇవ్వలేదు

- ప్రొఫెసర్‌ రామకృష్ణారెడ్డి, వీసీ, ఎస్కేయూ 

టెన్తప్లాన ప్రాజెక్ట్‌ పోస్టుల్లోని ఉద్యోగులకు నేను పోస్టింగ్‌ ఇవ్వలేదు. వీసీగా నేను బాధ్యతలు చేపట్టినప్పటికే వారు అదనపు పోస్టుల్లో ఉన్నారు. టీడీపీ ప్రభుత్వంలో జీఓ ఇచ్చి ర్యాటిఫై చేశారు. అపాయింట్‌మెంట్‌ నేను ఇవ్వలేదు. 


Updated Date - 2022-06-29T05:34:06+05:30 IST