క్లైమాక్స్‌లో ఉత్కంఠ

ABN , First Publish Date - 2021-03-09T07:41:58+05:30 IST

జిల్లాలో ఒంగోలు కార్పొరేషన్‌, చీరాల, మార్కాపురం మున్సిపాల్టీలతో పాటు నాలుగు నగరపంచాయతీల ఎన్నికల సమరానికి సంబంధించి జోరుగా సాగిన ప్రచారహోరు సోమవారం సాయంత్రంతో ముగిసింది.

క్లైమాక్స్‌లో ఉత్కంఠ
చీరాల మున్సిపల్‌ కార్యాలయం

సరాసరి ఓటు రేటు రూ.1500

నగర పంచాయతీల్లో పోరు రసవత్తరం 

అత్యధికం రూ.3 వేలు  

జోరుగా ప్రత్యేక ప్యాకేజీలు

ఒంగోలు, మార్కాపురం, చీరాలల్లో పెరిగిన పోటీ 

క్లైమాక్స్‌లో పురపాలక పోరు ఉత్కంఠ రేకెత్తిస్తోంది. అన్నిచోట్లా ప్రచార కార్యక్రమం జోరుగా సాగినా ఒంగోలు, అద్దంకిలలో ప్రచారం ఉద్రిక్తతలకు దారితీసింది. ముందు నుంచే ఓటర్ల కొనుగోలు ప్రారంభ మైనా సోమవారం రాత్రికి అవి తారస్థాయికి చేరాయి. సరాసరిన ఓటు రేటు రూ.1500కి చేరగా ప్రతిష్టాత్మక వార్డుల్లో రూ.3వేలు పలికింది. ప్రత్యేక ప్యాకేజీల మోత మోగుతోంది. ఒంగోలు కార్పొరేషన్‌, చీరాల, మార్కాపురం మున్సిపాలిటీల్లో పోటీ తీవ్రత పెరగ్గా.. నగర పంచాయ తీల్లో పోరు రసవత్తరంగా మారింది. అద్దంకిలో హోరాహోరీ పరిస్థితి నెలకొనగా మిగిలిన చోట్ల అధికారపక్షం గెలుపు ధీమాతో ముందుకు సాగుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటుపై  నమ్మకంతో పలు వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు ఢీ అంటే ఢీ అంటున్నారు. ఏకపక్షంగా పోటీ సాగుతుందను కున్న మార్కాపురంలోను టీడీపీ దీటైన పోటీని ఇస్తోంది. నామినేషన ్లలోనే టీడీపీ వెనుకబడిన చీరాలలో వైసీపీ నేతల అంతర్గత పోరుతో కొన్ని వార్డుల్లో రెబల్స్‌ నుంచి పోటీ పెరిగింది. ఒంగోలులో వైసీపీ ముందంజలో ఉన్నప్పటికీ టీడీపీ పోటీ తీవ్రత అధికమైంది. 

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు) 

జిల్లాలో ఒంగోలు కార్పొరేషన్‌, చీరాల, మార్కాపురం మున్సిపాల్టీలతో పాటు నాలుగు నగరపంచాయతీల ఎన్నికల సమరానికి సంబంధించి జోరుగా సాగిన ప్రచారహోరు సోమవారం సాయంత్రంతో ముగిసింది. దీంతో ఓటర్ల ప్రభావిత కార్యక్రమాలు ఊపందుకు న్నాయి. అనూహ్యంగా అన్నిప్రాంతాల్లో టీడీపీ నుంచి పోటీ తీవ్రత పెరగటంతో ఓటర్ల కొనుగోలు వ్యవహారం కూడా తారస్థాయికి చేరింది. ప్రత్యేకించి కొన్నిప్రాంతాల్లో ప్రత్యేక ప్యాకేజీలతో ఓటు బ్యాంకర్లుగా ఉన్న వారిని ప్రసన్నం చేసుకునే కార్య క్రమం జోరుగా సాగుతోంది. దీంతో గెలుపోటములు ఎలా ఉన్నా టీడీపీ నుంచి ఎదురవుతున్న పోటీ అనేక వార్డుల్లో అధికారపక్షం అభ్యర్థులకు సవాల్‌ గా మారింది. ఒంగోలు కార్పొరేషన్‌లో టీడీపీ పక్షాన ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ప్రచార కార్యక్రమంతో ప్రచార హోరు తారస్థాయికి చేరింది. కొన్ని వార్డులను ఎంపిక చేసుకుని టీడీపీ నేతలు విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతుండగా భారీ ఆధిక్యతే లక్ష్యంగా వైసీపీ పక్షాన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యూహాత్మకంగా సమరంలో ముందుకు పోతున్నారు. అద్దంకిలో పోరు ఆసక్తికరంగా మారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చీమకుర్తిలో ను టీడీపీ శ్రేణుల నుంచి పోటీ తీవ్రత పెరగ్గా మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి సామదాన దండోపాయాలను ఉపయోగిస్తూ ఓటర్లను మరింత ప్రభావితం చేసి దిశగా పయనిస్తున్నారు. చీరాలలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి అనుచరుల నుంచి కొన్ని వార్డుల్లో పోటీ ఎదురుకాగా అనూహ్యంగా నాలుగైదు వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు ఢీ అంటే ఢీ అంటున్నారు. అసలు పోటీలోనే ఉండరని భావించిన మార్కాపురంలో ఏడెనిమిది వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు విజయంవైపు దూసుకుపోతున్న పరిస్థితులున్నాయి. ముందుగానే ఏడేసి వార్డుల ఏకగ్రీవాలతో ఉన్న గిద్దలూరు, కనిగిరిలోను మిగిలిన వార్డుల్లో టీడీపీ ఉత్కంఠ పోరుకి సిద్ధం కావటం విశేషం. 


ఒంగోలు కార్పొరేషన్‌లో..

ఒంగోలులో ఒక డివిజన్‌ను వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకోగా 49 డివిజన్లలో పోటీ జరుగుతోంది. ఇందులో 4 డివిజన్లలో టీడీపీ రంగంలో లేకపోగా అన్నిచోట్లా వైసీపీ పోటీలో ఉంది. అయితే జనసేన, బీజేపీ, సీపీఎం, సీపీఐలతో పాటు స్వతంత్రులు రంగంలో ఉండటంతో 49 డివిజన్లలోనూ పోటీ ఆసక్తికరంగా మారింది. అత్యధిక డివిజన్లలో ముఖాముఖి పోటీ పరిస్థితి కొనసాగగా ఏడెనిమిది డివిజన్లలో స్వతంత్ర లేక రెబల్స్‌ ప్రభావితం చూపే పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నికల వ్యూహంలో ఆరంభం నుంచి మంత్రి బాలినేని సారథ్యంలో వైసీపీ దూకుడుగా సాగగా నారా లోకేష్‌ ప్రచారంతో టీడీపీలో జోష్‌ పెరిగింది. దీంతో సునాయాసంగా గెలుస్తామని వైసీపీ నాయకులు భావించిన డివిజన్లలో కూడా తీవ్ర పోటీ నెలకొంది. తెలుగుదేశం రంగంలో లేని 38వ డివిజన్‌లో జనసేన అభ్యర్థి టీడీపీ మద్దతుతో వైసీపీకి దీటైన పోటీనిస్తున్నారు. 15వ డివిజన్‌లో వైసీపీ రెబల్‌ అభ్యర్థి చింతపల్లి గోపి నుంచి అధికారపక్షానికి తీవ్రమైన పోటీ ఎదురవుతోంది. మరో డివిజన్‌లో కూడా వైసీపీ రెబల్‌ అభ్యర్థి పోటీ రసవత్తరంగా మారింది. దాదాపుగా అన్ని డివిజన్లలోను ఓటు రేటు వెయ్యితో ప్రారంభమైంది. వార్డు పరిస్థితులను బట్టి రూ. వెయ్యి నుంచి రూ.3వేల వరకు పంపిణీ జరుగుతున్నట్లు సమాచారం. వైసీపీ మేయరు అభ్యర్థి గంగాడ సుజాత గెలుపుపై ఆ పార్టీ వర్గాలు ధీమాగా ఉండగా, టీడీపీ మేయరు అభ్యర్థి డాక్టరు సరోజిని రంగంలో ఉన్న డివిజన్‌లో పోటీ ఉత్కంఠ రేకెత్తిస్తోంది. 


అద్దంకిలో హోరాహోరీ

నగరపంచాయతీల విషయానికొస్తే అద్దంకి, చీమకుర్తిల సమరంవైపు యావత్తు జిల్లా ప్రజలు దృష్టిసారించారు. రాజకీయంగా కూడా అక్కడ ఫలితాల వైపు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అద్దంకి లో గతంలో టీడీపీకి పూర్తి ఆధిక్యత ఉండేది. తొలి ఎన్నికల్లో 15 వార్డులను ఆ పార్టీ గెలుచుకుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఆధిక్యత బాగా తగ్గింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అద్దంకి నగర పంచాయతీలో 1300 ఓట్ల ఆధిక్యం టీడీపీకి లభించింది. నియోజకవర్గం పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ హవా కనిపించింది. ఆ పార్టీ ఇన్‌చార్జ్‌ కృష్ణచైతన్య వ్యూహం ఫలించింది. అదే ఊపుతో ఆయన అద్దంకి ఎన్నికల్లోకి రాగా టీడీపీ పక్షాన ఎమ్మెల్యే రవికుమార్‌ కూడా ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలను తీసుకున్నారు. దీంతో రాజకీయ వాతావరణం పూర్తిగా వేడెక్కింది. స్వతహా టీడీపీకి ఉన్న బలం, ఆదరణకు తోడు రవికుమార్‌ చురుకుగా పనిచేస్తుండటం ఆ పార్టీకి కలిసొస్తుంది. సంక్షేమ కార్యక్రమాల అమలుతోపాటు ఇంటిస్థలాల పంపిణీ, అద్దంకి అభివృద్ధికి కృష్ణచైతన్య ప్రాధాన్యమిచ్చి కొన్ని పనులు పూర్తిచేయటం వారికి అదనపు బలమైంది. దీనికితోడు కొన్ని వార్డుల్లో ఎంతో కొంత ప్రభావాన్ని చూపగల నాయకులను టీడీపీ నుంచి వైసీపీలోకి రాబట్టుకున్నారు. అలాగే వైసీపీ నుంచి కొందరిని టీడీపీలోకి రవికుమార్‌ ఆకర్షించారు. అలాగే చీరాల ఎమ్మెల్యే బలరాం అనుచరులుగా ఉంటూ ఇంతకాలం రవికుమార్‌కి దూరంగా ఉన్న కొందరు నాయకులు ఈ పర్యాయం ఆయనకు మద్దతుగా చురుకుగా పనిచేస్తున్నారు. ఇకపోతే ఓటర్లను ఇతరత్రా రూపాల్లో ప్రభావితం చేసే విషయాలలో ఎవరికి ఎవరు తీసిపోవటం లేదు. 19 వార్డుల్లో ఎన్నికలు జరుగుతుండగా 7 వార్డుల్లో వైసీపీ, 6 వార్డుల్లో టీడీపీ ముందంజలో ఉన్నట్లు కనిపిస్తోంది. మరో 6 వార్డుల్లో గట్టిపోటీ నెలకొని ఉంది. ఓటుకి రూ.2వేలు లెక్కన ఇరువైపుల వారు డబ్బులు పంపిణీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కొన్ని వార్డుల్లో ఓటు రేటు రూ.3వేలు దాటిపోగా సోమవారం రాత్రి నుంచి ప్రత్యేక ప్యాకేజీల వ్యవహారం కూడా జోరందుకుంది. వైసీపీకి పార్టీ బలంతోపాటు అధికార అండ, కృష్ణచైతన్య సమన్వయం కలిసొస్తుండగా టీడీపీకి పార్టీ బలం, రవికుమార్‌ నాయకత్వమే కీలకమయ్యాయి.


అధికార దుర్వినియోగం

అధికార దుర్వినియోగంలో అధికార పార్టీ నేతలు అగ్రస్థానంలో నిలిచింది కనిగిరి నగర పంచాయతీ ఎన్నికల్లోనే. అయినా అధికారపక్షం ఉక్కిరిబిక్కిరి అవుతోందంటే అతిశయోక్తి కాదు. తాజాగా నామినేషన్లు వేసే అవకాశం వచ్చి ఉంటే ఎలా ఉండేదో కాని పాత నామినేషన్లే కావటంతో అప్పటి నుంచి వైసీపీ సాగించిన రాజకీయం ఫలించి ఏడు వార్డులను ఏకగ్రీవంగానే ఆ పార్టీ కైవసం చేసుకుంది. దీంతో మిగిలిన 13 వార్డులకు గాను 10చోట్ల టీడీపీ నేరుగా ఢీ అంటే ఢీ అంటుండగా, ఒకచోట సీపీఎం అభ్యర్థికి, రెండుచోట్ల స్వతంత్ర అభ్యర్థులకు టీడీపీ మద్దతిస్తోంది. ఆపార్టీ నేత ఉగ్రనరసింహారెడ్డి పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి ఎన్నికల వ్యూహాన్ని సక్రమంగా వేయటం వలన వైసీపీ ఏకగ్రీవ ఎన్నికతోనే కైవసం చేసుకోవాలన్న లక్ష్యానికి బ్రేక్‌ పడింది. మొత్తంపై విజయావకాశాలు వైసీపీకే కనిపిస్తున్నా టీడీపీ అభ్యర్థులు ఐదు నుంచి ఎనిమిది వార్డుల్లో విజయం సాధించే అవకాశాలు లేకపోలేదు.


చీరాలలో..

చీరాలలో వివిధ కారణాలతో అప్పట్లో టీడీపీ అభ్యర్థులు అన్ని స్థానాల్లో పోటీ చేయని విషయం తెలిసిందే. అయినప్పటికీ అధిష్ఠానం చేసుకున్న జోక్యంతో 13 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు నేరుగా రంగంలో నిలిచారు. 3 వార్డులను వైసీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకోగా 30 వార్డుల్లో పోటీ జరుగుతోంది. వైసీపీలో ఎమ్మెల్యే బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచిల మధ్య ఆధిపత్యపోరుకి ఫుల్‌స్టాప్‌ పెట్టే విధంగా మంత్రి బాలినేని అభ్యర్థుల ఎంపికను తన చేతిలోకి తీసుకున్న విషయం తెలిసిందే. మొత్తంపై వైసీపీ బీఫాం వచ్చిన అభ్యర్థుల్లో బలరాం మద్దతుదారులు అత్యధికంగా ఉన్నారు. అయితే కొన్నిస్థానాల్లో రెబల్స్‌ పోటీలో నిలిచారు. అందులో కొంతమంది ఆమంచి అనుచరులుగా ముద్రపడిన వారు ఉన్నారు. అలాంటి చోట్ల డబ్బు పంపిణీ, చీరల పంపిణీ వ్యవహారం బహిర్గతమైంది. మొత్తంపై 9 డివిజన్లలో వైసీపీ, రెబల్స్‌ మధ్య పోటీ తీవ్రంగా నడుస్తోంది. మరో 8 డివిజన్లలో టీడీపీ నుంచి పోటీ ఎదురుకాగా మూడుచోట్ల టీడీపీ అభ్యర్థులే ముందంజలో ఉన్నారు. అంతర్గత పోరు విషయాన్ని పక్కనబెడితే ఎమ్మెల్యే బలరాం ఆధ్వర్యంలో వైసీపీ పక్షాన జోరుగా ప్రచార కార్యక్రమం సాగింది. 


మార్కాపురంలో ఢీ అంటే ఢీ

మార్కాపురంలో తొలుత స్థానిక టీడీపీ నాయకులు అధికారపార్టీ అక్రమాలకు నిరసనగా పోటీ బహిష్కరణకు నిర్ణయం తీసుకోగా అధిష్ఠానం జోక్యంతో 25 డివిజన్లలో టీడీపీ అభ్యర్థులు రంగంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఐదు వార్డులను వైసీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. 30వార్డుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో ప్రధానంగా 17వార్డుల్లో టీడీపీ, వైసీపీ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. కనీసం 6 నుంచి 10లోపు వార్డులను కైవసం చేసుకోగలమన్న ధీమా టీడీపీ శ్రేణుల్లో కనిపిస్తోంది. ఓటు రేటు వెయ్యితో ప్రారంభం కాగా కొన్ని చోట్ల రూ.2వేలకు చేరే అవకాశం ఉంది. మద్యం పంపిణీలో అధికారపార్టీ ముందంజలో ఉంది.


గిద్దలూరులో అనూహ్య పోటీ

గిద్దలూరులో కూడా ఎన్నికలు జరిగే వార్డుల్లో  టీడీపీ అనూహ్య పోటీని ఇస్తోంది. ఎమ్మెల్యే అన్నా రాంబాబు చైర్మన్‌ అభ్యర్థి ఎంపిక విషయంలో వివాదాస్పదం కావడాన్ని కూడా టీడీపీ సొమ్ము చేసుకుంటోంది. అయితే ఏడు వార్డులను ఏకగ్రీవంగా గెలిపించుకోవటం ద్వారా ఎమ్మెల్యే ముందంజలో ఉన్నారు. కానీ మిగిలిన 13 వార్డుల్లో మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి సారథ్యంలో టీడీపీ అభ్యర్థులు ఢీ అంటే ఢీ అనే స్థాయికి చేరింది. మొత్తంగా విజయం ఎలా ఉన్నా టిడిపి శ్రేణులు కూడా ఎన్నికలు జరుగుతున్న 13 వార్డుల్లో సగం స్థానాలను కైవసం చేసుకునే అవకాశం లేకపోలేదు. అటు కనిగిరి, ఇటు గిద్దలూరులో కూడా పోటీ తీవ్రత పెరగటంతో ప్రధానంగా అధికార పార్టీ వారు ఓటర్లను ప్రభావితం చేసే చర్యలను తీవ్రతరం చేశారు. మనీతో పాటు పవర్‌ని కూడా వినియోగిస్తున్న దాఖలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.


Updated Date - 2021-03-09T07:41:58+05:30 IST