
టెలికాం కంపెనీలకు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదేశాలు
‘‘కరోనా వైర్‌సతో ఇప్పుడు యావత్ దేశం పోరాడుతోంది. మనమంతా ఆ వ్యాధితో పోరాడాలి. రోగితో కాదు...’’ ఇది కొవిడ్ వ్యాప్తి మొదలైన తొలినాళ్లలో మన ఫోన్లలో వినిపించిన కాలర్‌ట్యూన్!!
‘‘నమస్కారం.. కొవిడ్-19 అన్‌లాక్ ప్రక్రియ ఇప్పుడు దేశమంతటా మొదలైంది. ఇలాంటి సమయంలో అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటికి వెళ్లకండి’’ అంటూ మరో కాలర్‌ట్యూన్ ఫోన్లలో మోగింది!!
న్యూఢిల్లీ, మార్చి 27 : ‘‘జబ్ తక్ దవాయీ నహీ.. తబ్ తక్ కోయీ ఢిలాయీ నహీ’’ అంటూ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ కంచు కంఠంతో వినిపించిన కాలర్ ట్యూన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు!! ఇవన్నీ చరిత్రలో కలిసిపోనున్నాయి. దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోకి వచ్చిన ప్రస్తుత తరుణంలో కొవిడ్ కాలర్ ట్యూన్లకు ఇక స్వస్తి పలకాలని కేంద్ర ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఈమేరకు టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో గత 21 నెలలుగా మనమంతా ఫోన్లలో వింటున్న కొవిడ్ కాలర్ ట్యూన్లకు కాలం చెల్లినట్లయింది. ‘‘ఆ కాలర్ ట్యూన్ల లక్ష్యం నెరవేరింది.. ఇకనైనా తొలగించండి’’ అంటూ సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏ), మొబైల్ వినియోగదారుల నుంచి కేంద్ర టెలికాం విభాగానికి విజ్ఞప్తులు వెల్లువెత్తాయి.
‘‘ఎవరికైనా ఎమర్జెన్సీ కాల్స్ చేసుకునే క్రమంలో.. కొవిడ్ కాలర్‌ట్యూన్ వల్ల కాల్ కనెక్ట్ కావడానికి ఎక్కువ సమయం పడుతోంది. అంతేకాదు విలువైన సెల్యులార్ బ్యాండ్ విడ్త్ వినియోగం అవసరానికి మించి జరుగుతోంది. ఫలితంగా సాంకేతిక సమస్యలు తలెత్తి కాల్స్ కనెక్టివిటీకి పట్టే సగటు సమయం పెరుగుతోంది’’ అని పేర్కొంటూ టెలికాం విభాగానికి సీవోఏ ఓ లేఖ రాసింది. ఎంతోమంది మొబైల్ వినియోగదారులు కూడా ఈ అంశాన్ని పలుమార్లు లేవనెత్తారు. వీటని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ఆరోగ్యశాఖ ‘కొవిడ్ కాలర్ ట్యూన్’ను తొలగించాలని నిర్దేశించింది.