నిబంధనలు గాలికి

ABN , First Publish Date - 2021-05-07T04:28:21+05:30 IST

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల వద్ద కొవిడ్‌ నిబంధనలను గాలికొదిలేశారు.

నిబంధనలు గాలికి
సీసీకుంట చెరువులో గుంపులుగా పని చేస్తున్న కూలీలు

ఉపాధి పనుల వద్ద కరువైన పర్యవేక్షణ

ఒకే దగ్గర గుమికూడుతున్న కూలీలు

మాస్క్‌లు లేవు.. భౌతిక దూరం అంతంతే

జాబ్‌ కార్డులు ఉన్న వారిలో పని చేస్తున్నది 12 శాతమే


జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల వద్ద కొవిడ్‌ నిబంధనలను గాలికొదిలేశారు. ఈ పనుల కూలీలంతా ఒక చోట చేరి చేస్తారు. ప్రస్తుత కరోనా సమయంలో ఈ పనుల వద్ద ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించేలా నిరంతరం పర్యవేక్షించాలి. కానీ, అధికారులు పట్టించుకోకపోవడంతో క్షేత్ర స్థాయిలో కూలీలు గుంపులుగా పనులు చేస్తున్నారు. మాస్కులు ధరించడం లేదు. భౌతిక దూరం, శానిటైజర్‌ మరిచిపోయారు. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారి విజృంభించే ప్రమాదం పొంచి ఉంది.

- మహబూబ్‌నగర్‌


ఉపాధి పనులు చేసే పని ప్రదేశంలో కొవిడ్‌-19 జాగ్రత్తలను తీసుకోవడం లేదు. ఇది వరకు ఈ పనులను ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు పర్యవేక్షించే వారు. వారిని తొలగించడంతో ఇప్పుడు పంచాయతీ కార్యదర్శులకు బాధ్యతలు అప్పజెప్పారు. వారికి ఉండే పనులకు తోడు ఈ బాధ్యతలు అప్పగించడం వల్ల పనుల పర్యవేక్షణ గాలికొదిలేశారు. దాంతో కూలీలు కొవిడ్‌ నిబంధనలను పాటించడం లేదు. కరోనా భయం కారణంగా జాబ్‌కార్డులు పొందిన వారిలో ప్రస్తుతం 12 శాతం మంది మాత్రమే పనులకు వెళ్తున్నారు. మరోవైపు చేసిన పనులకు ఆరు వారాలైనా డబ్బులు రావడం లేదు.


గుమిగూడి పనులు

పథకం కింద కొన్ని గ్రామాల్లో చెరువుల్లో ఒండ్రు తరలించే పనులు చేయిస్తున్నారు. ఈ పనులు చేయడం వల్ల ఒకే దగ్గర వందల సంఖ్యలో కూలీలు గుమిగూ డుతున్నారు.  ఇందులో చాలామంది మాస్కులు ధరించడం లేదు. పర్యవేక్షణ ఉన్న కొన్ని ప్రాంతాల్లో మాస్కులు వినియోగిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ పనులు చేస్తున్నారు. ఒండ్రుమట్టి పనులకు బదులు కందకాలు తవ్వకం, ఫీడర్‌ చానల్‌ పనులు చేయిస్తే భౌతిక దూరం పాటించే అవకాశం ఉంటుంది. 

సీసీకుంట మండల కేంద్రంలో చెరువులో ఒండ్రుమట్టి తీత పనులు చేస్తున్నారు. గురువారం 170 మంది వరకు పనికి వచ్చారు. వారిలో చాలా మంది మాస్కులు ధరించ లేదు. 

ఉంద్యాల చెరువులో వారం కిందటి వరకు 400 మంది వరకు ఒండ్రుమట్టి పనులు చేశారు. వారిలో నలుగురికి ఇటీవల కరోనా పాజిటివ్‌ రావడంతో కూలీల సంఖ్య గురువారానికి 132కి పడిపోయింది. వైరస్‌ భయానికి చాలా చోట్ల ఇలాంటి పరిస్థితి నెలకొనడం వల్ల వేసవిలో లక్షల్లో కూలీలు పని చేయాల్సిన చోట జిల్లా వ్యాప్తంగా 30 వేల మంది మాత్రమే పనులు చేస్తున్నారు. జిల్లాలో 2.47 లక్షల మందికి జాబ్‌కార్డులు ఉండగా, అందులో 30,540 మంది మాత్రమే పనులు చేస్తున్నారు. నవాబ్‌పేట మండలంలో అత్యధికంగా 4 వేలకు పైగా కూలీలు పని చేస్తుండగా, అడ్డాకులలో అత్యల్పంగా వెయ్యిలోపు పని చేస్తున్నారు. 


పర్యవేక్షణ ఏదీ?

ఉపాధి హామీ పనులను నిరంతరం పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ బాధ్యతలను కార్యదర్శులకు అప్పగించడం వల్ల కొన్ని గ్రామాల్లో రెండు, మూడు రోజులైనా పని ప్రదేశాలకు వెళ్లని పరిస్థితి ఉంది. ఉపాధి హామీ పథకం అధికారులు పని ప్రారంభించిన రోజు వెళ్లి పనులు చూయించి, తరువాత కొలతలకే వెళ్తున్నారన్న విమర్శలున్నాయి. మస్టర్‌పై పర్యవేక్షణ కొరవడింది. పని చేసి ఆరు వారాలైనా కూలీ డబ్బులు రాకపోవడంతో ఈ కరోనా సమయంలో కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి పనుల వద్ద కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చూడాలని, డబ్బులు ఇప్పించాలని కోరుతున్నారు.

Updated Date - 2021-05-07T04:28:21+05:30 IST