Jammu and Kashmir : కుటుంబాన్ని వెంటాడుతున్న ‘‘ఉగ్రవాద సహచరుడు’’ ముద్ర

ABN , First Publish Date - 2022-07-13T19:45:26+05:30 IST

జమ్మూ-కశ్మీరులోని శ్రీనగర్‌లో మంగళవారం సాయంత్రం జరిగిన

Jammu and Kashmir : కుటుంబాన్ని వెంటాడుతున్న ‘‘ఉగ్రవాద సహచరుడు’’ ముద్ర

శ్రీనగర్ : జమ్మూ-కశ్మీరులోని శ్రీనగర్‌లో మంగళవారం సాయంత్రం జరిగిన ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అధికారి ముష్తాక్ అహ్మద్ ‌కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనతో రగిలిపోతున్నారు. ముష్తాక్ కుమారుడు అకిబ్ రెండేళ్ళ క్రితం ఓ ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన అకిబ్ ఉగ్రవాది అవుతాడని ఆ కుటుంబం ఊహించలేదు. అకిబ్ టెర్రరిస్ట్ అసోసియేట్ అని పోలీసులు చెప్పడం ఆ కుటుంబాన్ని వెంటాడింది. 


పోలీసు అధికారి ముష్తాక్ అహ్మద్ మంగళవారం సాయంత్రం శ్రీనగర్‌లోని లాల్ బజార్ చెక్ పాయింట్ వద్ద విధులు నిర్వహిస్తున్నారు. జీడీ గోయెంకా స్కూల్ వైపు నుంచి వచ్చిన ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ముష్తాక్ ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. ఈ దాడి తమ పనేనని ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) ప్రకటించింది. దాడికి సంబంధించిన ఓ వీడియోను కూడా విడుదల చేసింది. ఈ విధంగా దాడికి సంబంధించిన వీడియోను విడుదల చేయడం చాలా అరుదు. ఈ ఉగ్రవాద దాడిలో ముగ్గురు ఉగ్రవాదులు పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తిస్తామని చెప్పారు. సీనియర్ పోలీసు అధికారి విజయ్ కుమార్ మాట్లాడుతూ, సీసీటీవీ ఫుటేజ్‌ను విశ్లేషిస్తున్నామని, త్వరలోనే ఆ ఉగ్రవాదులను మట్టుబెడతామని చెప్పారు. 


ముష్తాక్ అహ్మద్‌కు శ్రీనగర్ పోలీస్ లైన్స్‌లో అంతిమ వీడ్కోలు పలికారు. అక్కడికి ఆయన కుటుంబ సభ్యులు వచ్చారు. శవపేటికలోని మృతదేహాన్ని చూసి, భోరున విలపించారు. ఆయన కుమారుడు అకిబ్ ఇంజినీరింగ్ చేశాడని, ఆయన ఉగ్రవాది అంటే తాము నమ్మలేకపోతున్నామని చెప్పారు. తండ్రీకొడుకులిద్దరివీ బలవన్మరణాలే కావడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 2020 ఏప్రిల్‌లో కుల్గాంలో జరిగిన ఎన్‌కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు పారిపోయారని పోలీసులు చెప్పారని, ఆ తర్వాత నిర్వహించిన సోదాల్లో అకిబ్ మృతదేహం కనిపించిందని చెప్పారు. ఆయన ఉగ్రవాదులకు సహచరుడని పోలీసులు ఆరోపించారని, దీనిని తాము ఖండించామని చెప్పారు. దీనిపై దర్యాప్తు జరిపిస్తామని పోలీసు ఉన్నతాధికారులు హామీ ఇచ్చారన్నారు. అయితే దర్యాప్తులో వెల్లడైన అంశాలను బయటపెట్టలేదన్నారు. 


ఉగ్రవాదుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించరని, అదే విధంగా అకిబ్ మృతదేహాన్ని కూడా తమకు అప్పగించలేదని తెలిపారు. కుల్గాం నుంచి 150 కిలోమీటర్ల దూరంలోని బారాముల్లా జిల్లాలో ఉన్న గుర్తు తెలియని శ్మశాన వాటికలో ఖననం చేశారని చెప్పారు. అకిబ్ ఉగ్రవాద సహచరుడనే ముద్ర ఇప్పటికీ తమను వెంటాడుతోందన్నారు. 


Updated Date - 2022-07-13T19:45:26+05:30 IST