పాక్ ఉగ్రవాదుల కొత్త పన్నాగం! వాట్సాప్, ఫేస్‌బుక్‌‌కు బదులుగా..

ABN , First Publish Date - 2021-01-24T22:52:26+05:30 IST

భారత్‌పై పాక్ ఉగ్రవాదుల కొత్త పన్నాగం

పాక్ ఉగ్రవాదుల కొత్త పన్నాగం! వాట్సాప్, ఫేస్‌బుక్‌‌కు బదులుగా..

న్యూఢిల్లీ: వాట్సాప్, ఫేస్‌బుక్ మెసెంజర్‌లు.. మూడోకంటికి సమాచారం అందకుండా అత్యున్నత స్థాయి ఎన్‌క్రిప్షన్‌ను అందించే యాప్‌లు. వీటి ద్వారా మూడోవ్యక్తికి తెలీకుండానే ఇద్దరు వ్యక్తులు సంభాషణలు జరపవచ్చు, సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవచ్చు. అయితే. ఈ లక్షణం దుర్వినియోగమయ్యే అవకాశం ఉందని నిపుణులు, ప్రభుత్వాల్లో ఎప్పటినుంచో ఆందోళన నెలకొంది. ఇవి టెర్రరిస్టుల చేతిలో ఆయుధాలుగా మారుతున్నాయని వారు హెచ్చరిస్తున్నారు. దీనిపై పెద్ద చర్చే జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పాక్ ఉగ్రవాదులు కొత్త పన్నాగాలకు దిగుతున్నట్టు తెలుస్తోంది. వాట్సాప్, ఫేస్‌బుక్ మెసెంజర్‌లకు బదులుగా కొత్త యాప్‌ల వినియోగిస్తున్నారని, సమాచారం మొబైల్‌ ఫోన్‌లో ఉండగానే ఇవి ఎన్‌క్రిప్షన్ ప్రక్రియ పూర్తిచేస్తున్నాయని భద్రతా అధికారులు పేర్కొన్నారు. దీంతో ఈ యాప్‌ల ద్వారా జరిగినే సమాచార బట్వాడాపై నిఘా పెట్టడం కష్టమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ యాప్‌ల ద్వారా జమ్ముకశ్మీర్‌ యువతను మతం మత్తులోకి దింపి ఉన్మాదులుగా మారుస్తున్నారని, భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు దిగాలంటూ రెచ్చగొడుతున్నారని అధికారులు పేర్కొన్నారు. 


ఈ యాప్‌లో పేర్లు నమోదు చేసుకునేందుకు కనీసం మొబైల్ ఫోన్ నెంబర్ అవసరం కూడా ఉండదు ఇటువంటివి మొత్తం మూడు యాప్‌లను అధికారులు గుర్తించారు. అయితే..భద్రతా కారణాల దృష్ట్యా ప్రభుత్వ వర్గాలు ఈ వివరాలను బహిరంగ పరచలేదు. వీటిలో ఓ యాప్‌ను అమెరికాకు చెందిన సంస్థ రూపొందించగా మిగిలిన రెండిటిలో ఒకదాన్ని యూరప్ సంస్థ మరోదాన్ని టర్కీ సంస్థ రూపొందంచినట్టు తెలుస్తోంది. కేవలం 2జీ మొబైల్ నెట్‌వర్క్ అందుబాటులో ఉన్నా కానీ ఈ యాప్‌లు సమర్థంగా పనిచేయగలవని సమాచారం. గతంలో కశ్మీర్‌లో ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించిన భారత్ ప్రభుత్వం.. ఆ తరువాత 2జీ సేవలను మాత్రమే అనుమతించింది. అత్యంత అధునాత సాఫ్ట్‌వేర్ ఆర్ఎస్ఏ-2048 ఆధారంగా ఈ యాప్‌లు రూపొందినట్టు అధికారులు తెలిపారు. ఈ యాప్‌లను నిషేధించేందుకు ప్రయత్నిస్తున్నట్టు కూడా వారు పేర్కొన్నారు. 


ఇప్పటికే భారత్‌లోని ఉగ్రవాదులను సంప్రదించేందుకు పాక్ టెర్రరిస్టులు వర్చువల్ సిమ్‌లను వినియోగిస్తూ భారత్ నిఘా వర్గాలను సవాలు విసురుతున్నారు.  వర్చువల్ అంటే ఆన్‌లైన్ అని అర్థం. ఈ విధానంలో భాగంగా విదేశీ సంస్థలు కొన్ని వినియోగదారుల కోసం కొన్ని ఫోన్‌నెంబర్లు సృష్టిస్తాయి. ఈ వర్చువల్ సిమ్, దాని సంబంధిత ఫోన్ నెంబర్ల వివరాలను ఆయా కంపెనీలు తమ సర్వర్లలో దాస్తాయి.  ఆ కంపెనీల యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుని వర్చువల్ సిమ్‌లను పొందవచ్చు. ఈ నెంబర్లు ఈమెయిల్, ఫేస్‌బుక్‌ వంటివాటికి లింక్ అయి ఉంటాయి. సిమ్ పొందిన అనంతరం.. కోరుకున్న వారిని ఇంటర్నెట్ ద్వారా లేదా నేరుగానే ఫోన్‌లోనే సంప్రదించవచ్చు. ఈ రకమైన సిమ్‌ల వివరాలను సేకరించేందుకు భారత్ నిఘా వర్గాలు తంటాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే టెర్రరిస్టులు సమాచార మార్పిడి కోసం కొత్త యాప్‌లను వాడటం పట్ల భారత్‌లో ఆందోళన నెలకొంది. అయితే..వీటిని బ్లాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2021-01-24T22:52:26+05:30 IST