Jammu and Kashmir : కశ్మీరీ పండిట్ దారుణ హత్య

ABN , First Publish Date - 2022-05-13T02:02:34+05:30 IST

జమ్మూ-కశ్మీరులోని బుడ్గాం జిల్లాలో ఓ కశ్మీరీ పండిట్

Jammu and Kashmir : కశ్మీరీ పండిట్ దారుణ హత్య

శ్రీనగర్ : జమ్మూ-కశ్మీరులోని బుడ్గాం జిల్లాలో ఓ కశ్మీరీ పండిట్ ఉద్యోగిని అనుమానిత ఉగ్రవాదులు గురువారం దారుణంగా హత్య చేశారు. కశ్మీరీ పండిట్ల కోసం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ప్యాకేజ్‌ పథకంలో ఆయన చదూర తహశీల్దారు కార్యాలయంలో గుమస్తాగా పని చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరలించినప్పటికీ, ఫలితం లేకపోయింది. 


Jammu and Kashmir పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రధాన మంత్రి ప్యాకేజి పథకంలో భాగంగా చదూర తహశీల్దారు కార్యాలయంలో గుమస్తాగా పని చేస్తున్న రాహుల్ భట్‌పై గురువారం ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయనను బడ్గాంలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆయనను శ్రీనగర్‌లోని మహారాజా హరి సింగ్ ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ ఆయన ప్రాణాలను కాపాడలేకపోయారు. 


చదూర ప్రాంతంలో ఉగ్రవాదులను పట్టుకునేందుకు జమ్మూ-కశ్మీరు పోలీసులు, భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఇదిలావుండగా, కశ్మీరీ పండిట్లను లక్ష్యంగా చేసుకుని దాడులు జరగడం ఇదే తొలిసారి కాదు. 2021 అక్టోబరు నుంచి హిందువులపై దాడులు జరుగుతున్నాయి. ఏప్రిల్ 4న ఉగ్రవాదులు షోపియాన్ జిల్లాలోని చోటీగామ్ గ్రామంలో బాల్ కృషన్ అనే కశ్మీరీ పండిట్‌పై కాల్పులు జరిపారు. అంతుకుముందు బిహార్‌కు చెందిన ఇద్దరు కూలీలు పాతాళేశ్వర్ కుమార్, జక్కు చౌదరిలను పుల్వామా జిల్లాలో చిత్రహింసలకు గురి చేశారు. శ్రీనగర్‌లోని ఫార్మసీ యజమాని ఎంఎల్ బింద్రూను హత్య చేశారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ఇద్దరు టీచర్లను కూడా హత్య చేశారు. జాతీయ గీతాన్ని ఆలపించేటపుడు అటెన్షన్‌లో నిలబడాలని విద్యార్థులను కోరినందుకు ఓ ప్రభుత్వ పాఠశాల టీచర్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. 


Read more