ఉత్కంఠ పోరులో టైటాన్స్ విజయం.. బెంగళూరుకు తప్పని భంగపాటు

ABN , First Publish Date - 2022-05-01T01:12:25+05:30 IST

రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు మరో భంగపాటు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో

ఉత్కంఠ పోరులో టైటాన్స్ విజయం.. బెంగళూరుకు తప్పని భంగపాటు

ముంబై: రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు మరో భంగపాటు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో చివరి ఓవర్ వరకు పోరాడి ఓటమి పాలైంది. 171 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టైటాన్స్ మరో మూడు బంతులు మిగిలి ఉండగానే నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. చివరి రెండు ఓవర్లలో విజయానికి 19 పరుగులు అవసరమైన వేళ 19వ ఓవర్‌ వేసిన హర్షల్ పటేల్ తొలి ఐదు బంతులను పొదుపుగా వేశాడు.


అయితే, చివరి బంతికి రాహుల్ తెవాటియా మిడాఫ్ మీదుగా అద్భుతమైన సిక్స్ కొట్టడంతో మ్యాచ్ స్వరూపం ఒక్కసారిగా మారిపోయింది. విజయం బెంగళూరు చేతుల్లోంచి జారిపోయింది. చివరి ఓవర్‌లో టైటాన్స్ విజయానికి ఏడు పరుగులు మాత్రమే అవసరం కాగా, హేజిల్‌వుడ్ వేసిన తొలి బంతి వైడ్ అయింది. ఆ తర్వాతి బంతికి ఫోర్ కొట్టగా, రెండో బంతికి సింగిల్ వచ్చింది. మూడో బంతిని తెవాటియా ఫోర్ కొట్టి జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఈ విజయంతో గుజరాత్ 16 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 


గుజరాత్ బ్యాటర్లలో సాహా 29, గిల్ 31, సాయి సుదర్శన్ 20 పరుగులు చేయగా, మిల్లర్ 39, తెవాటియా 43 పరుగులు చేశారు. అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్ని అందించిన రాహుల్ తెవాటియాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. కోహ్లీ (58), రజత్ పటీదార్ (52) అర్ధ సెంచరీలతో రాణించారు. మ్యాక్స్‌వెల్ 33, లోమ్రోర్ 8 పరుగులు చేశారు.

Updated Date - 2022-05-01T01:12:25+05:30 IST