Texas shooting.. పోలీసులపై స్థానికుల ఆగ్రహం.. అతడిని మట్టుపెట్టేందుకు ఎందుకంత ఆలస్యం చేశారంటూ..

ABN , First Publish Date - 2022-05-29T02:06:53+05:30 IST

పోలీసులు మరింత వేగంగా స్పందించి ఉంటే.. మరి కొందరు చిన్నారులు ప్రాణాలతో బయటపడి ఉండేవారంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Texas shooting.. పోలీసులపై స్థానికుల ఆగ్రహం.. అతడిని మట్టుపెట్టేందుకు ఎందుకంత ఆలస్యం చేశారంటూ..

ఎన్నారై డెస్క్: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న కాల్పుల ఘటన అగ్రరాజ్యాన్ని కుదిపేస్తోంది. ఓ 18 ఏళ్ల కుర్రాడి తూటాలకు స్థానిక పాఠశాలలోని 19 మంది చిన్నారులు, ఇద్దరు టీచర్లు బలయిపోయారు. ఉవాల్డీ ప్రాంతంలోని రాబ్ ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన జరిగింది. మే 24న ఓ తరగతి గదిలోకి వెళ్లిన నిందితుడు రామోస్.. అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. చివరకు పోలీసులు అతడిని మట్టుపెట్టారు. అయితే.. పోలీసులు మరింత వేగంగా స్పందించి ఉంటే.. మరి కొందరు చిన్నారులు ప్రాణాలతో బయటపడి ఉండేవారంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


స్థానిక మీడియా కథనాల ప్రకారం.. మంగళవారం ఉదయం 11.28 గంటలకు రామోస్.. తుపాకీతో స్కూల్‌లోకి ప్రవేశించాడు. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు.. ఆ తరువాత కొద్ది నిమిషాలకే లోపలకు వెళ్లారు. సుమారు 12.58 గంటల సమయంలో పోలీసులు.. నిందితుడు హతమయ్యాడంటూ పైఅధికారులకు సమాచారం అందించారు. అంతకుమునుపు.. 12.45 గంటల సమయంలో పోలీసుల ప్రత్యేక బృందం ఒకటి పాఠశాలలోకి ప్రవేశించింది. ఆ తరువాత నిందితుడున్న గదిలోకి చొచ్చుకెళ్లి అతడిని మట్టుపెట్టింది. అయితే.. అప్పటికే లోపల ఉన్న పోలీసులు రామోస్‌పై దాడి చేయకుండా దాదాపు 40 నిమిషాలు వేచి చూశారన్న వార్త స్థానికుల్లో ఆగ్రహాన్ని కలిగిస్తోంది. దీనిపై ఉవాల్డీ పోలీస్ చీఫ్.. ఇటీవల జరిగిన పత్రికా సమావేశంలో వివరణ ఇచ్చారు. తప్పు జరిగిందంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఘటనా స్థలంలో ఉన్న పోలీసు అధికారి ఒకరు అక్కడి పరిస్థితిని తప్పుగా అంచనా వేశారన్నారు. అయితే.. పోలీసులు వేచి చూస్తున్న సమయంలోనే తమను కాపాడాలంటూ విద్యార్థులు పలుమార్లు ఫోన్ చేసినట్టు తాజాగా వెలుగులోకి రావడంతో పోలీసుల తీరు పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.



Updated Date - 2022-05-29T02:06:53+05:30 IST