అతడి కారణాలు అతడికి ఉన్నాయ్.. నన్ను క్షమించండి.. Texas school లో కాల్పులు జరిపిన యువకుడి తల్లి మాటలివి..!

ABN , First Publish Date - 2022-05-29T00:25:56+05:30 IST

రామోస్ తల్లి ఇటీవలే మీడియా ముందుకు వచ్చారు. తన కొడుకును క్షమించాలని బాధిత కుటుంబాలను వేడుకున్నారు. అయితే.. ఇంతటి దారుణానికి పాల్పడేందుకు రామోస్‌కు తన కారణాలేవో తనకి ఉండే ఉంటాయని చెప్పారు.

అతడి కారణాలు అతడికి ఉన్నాయ్.. నన్ను క్షమించండి.. Texas school లో కాల్పులు జరిపిన యువకుడి తల్లి మాటలివి..!

ఎన్నారై డెస్క్: అమెరికాలోని ఓ ప్రాథమిక పాఠశాలలో ఇటీవల చోటు చేసుకున్న కాల్పుల ఘటన యావత్ దేశాన్నీ శోకసంద్రంలో ముంచేసింది. అసాల్ట్ రైఫిల్‌తో 18 ఏళ్ల రామోస్ ఆ పాఠశాలలోకి ప్రవేశించి విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో తరగతి గదిలోని 19 మంది చిన్నారులు, ఇద్దరు టీచర్లు అక్కడిక్కడే మరణించారు. చిన్నారులందరూ 11 ఏళ్ల లోపువారే! కాగా.. రామోస్ తల్లి ఇటీవలే మీడియా ముందుకు వచ్చారు. తన కొడుకును క్షమించాలని బాధిత కుటుంబాలను వేడుకున్నారు. అయితే.. ఇంతటి దారుణానికి పాల్పడేందుకు రామోస్‌కు తన కారణాలేవో తనకి ఉండే ఉంటాయని చెప్పారు. 


‘‘నాకు నోట మాట రావట్లేదు. ఆ సమయంలో అతడు ఏం ఆలోచించాడో నేను ఊహించలేకపోతున్నాను. కానీ.. అతడి కారణాలు అతడికి ఉండే ఉంటాయి. దయచేసి నా కుమారుడి విషయంలో అప్పుడే ఓ స్థిరాభిప్రాయానికి రావద్దు. నన్ను, నా కుమారుడిని క్షమించాలని బాధిత కుటుంబాలను వేడుకుంటున్నా’’ అని చెప్పారు. అయితే.. ఆ కారణాలు ఏమిటో మాత్రం ఆమె వివరించలేదు.  కాగా.. మే 24న పాఠశాలలోని ఓ తరగతి గదిలోకి తుపాకీతో వెళ్లిన రామోస్..అక్కడున్న వారిపై కాల్పులకు తెగబడ్డాడు.  పోలీసులు అతడిని మట్టుపెట్టాక కానీ.. ఈ నరమేధానికి ముగింపు పడలేదు. ఇక రామోస్.. ఉవాల్డే ఉన్నత పాఠశాలలో చదువుకునేవాడు. మార్చిలోనే అతడు తన పాఠశాలలో జరిగిన ఓ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నాడు. స్కూళ్లల్లోకి దుండగుడు తుపాకీతో వచ్చినప్పుడు విద్యార్థులు ఏం చేయాలనే విషయమై స్థానిక పోలీసు ఆఫీసర్ ఒకరు విద్యార్థులకు ఈ సందర్భంగా తర్ఫీదు ఇచ్చారు. అయితే.. రామోస్ తూటాలకు బలైన వారిలో ఆ ఆఫీసర్ భార్య కూడా ఉండటం స్థానికులను కలచివేస్తోంది.



Updated Date - 2022-05-29T00:25:56+05:30 IST