టీజీ భరత్
ప్రత్యర్థుల కుట్రలు ప్రజలు గమనిస్తున్నారు
కర్నూలు నియోజకవర్గ ఇన్చార్జి టీజీ భరత్
కర్నూలు: తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తేలేదని ఆ పార్టీ కర్నూలు నియోజకవర్గ ఇన్చార్జి టీజీ భరత్ స్పష్టం చేశారు. కొన్ని ప్రసార మాధ్యమాల్లో తాను వేరే పార్టీలోకి మారుతున్నట్లు ప్రచారం సాగుతోందని, అదంతా ప్రత్యర్థుల కుట్ర అని తేల్చి చెప్పారు. సోమవారం నగరంలోని మౌర్యఇన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొంతమంది నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.
వీటిని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ప్రయత్నాల వల్ల ప్రజల్లో తనమీద ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయలేరని, చేతనైతే అభివృద్ధి పనులు చేసి ప్రజల అభిమానం పొందాలని సూచించారు. టీడీపీ అభ్యర్థులు, నాయకుల మనోధైర్యం దెబ్బతీసేందుకే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల్లో ఎప్పటికీ అభిమానం చెరిగిపోని తెలుగుదేశం పార్టీని వీడనని మరోసారి స్పష్టం చేశారు.