Thailand: బ్యాంకాక్ విమానాశ్రయంలో ఇద్దరు భారతీయ మహిళల అరెస్ట్.. ఇంతకీ వారు ఏం చేశారో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-06-29T19:13:45+05:30 IST

థాయ్‌లాండ్ అధికారులు సోమవారం బ్యాంకాక్‌లోని సువర్ణభూమి విమానాశ్రయంలో ఇద్దరు భారతీయ మహిళలను అదుపులోకి తీసుకున్నారు.

Thailand: బ్యాంకాక్ విమానాశ్రయంలో ఇద్దరు భారతీయ మహిళల అరెస్ట్.. ఇంతకీ వారు ఏం చేశారో తెలిస్తే..

బ్యాంకాక్‌: థాయ్‌లాండ్ అధికారులు సోమవారం బ్యాంకాక్‌లోని సువర్ణభూమి విమానాశ్రయంలో ఇద్దరు భారతీయ మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరూ తమ లగేజీలో 109 జీవులను అక్రమంగా తరలిస్తుండడంతో అధికారులు వారిని అరెస్ట్ చేశారు.  విమానాశ్రయంలో ఇద్దరు భారతీయ మహిళలు అనుమానాస్పదంగా కనిపించడంతో అధికారులు వారి లగేజీని తనిఖీ చేశారు. ఆ సమయంలో వారికి సంబంధించిన రెండు సూట్‌కేసులలో (Suitcases) 109 జీవులు బయటపడ్డాయి. ఎయిర్‌పోర్ట్ అధికారుల సమాచారంతో వెంటనే అక్కడికి చేరుకున్న థాయ్‌లాండ్ జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణి, మొక్కల సంరక్షణ విభాగం అధికారులు ఆ జంతువులను స్వాధీనం చేసుకున్నారు.


కాగా, తనిఖీల్లో పట్టుబడ్డ 109 జీవుల్లో రెండు తెల్ల పందికొక్కులు, రెండు అర్మడిల్లోలు, 35 తాబేళ్లు, 50 బల్లులు, 20 పాములు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అనంతరం వాటిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు భారతీయ మహిళలు నిత్య రాజా, జకియా సుల్తానా ఇబ్రహీంను అదుపులోకి తీసుకున్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం 2019, జంతు వ్యాధుల చట్టం 2015, కస్టమ్స్ చట్టం 2017 ఉల్లంఘనల కింద వారిపై అభియోగాలు మోపారు. కాగా, వారిద్దరూ బ్యాంకాక్ నుంచి చెన్నైకి వెళ్తున్నట్లు థాయ్ అధికారులు తెలిపారు. 


ఇక విమానాశ్రయాల ద్వారా జంతువుల అక్రమ రవాణా అనేది చాలా కాలంగా పరిపాటిగా మారిందని ఈ సందర్భంగా థాయ్ అధికారులు పేర్కొన్నారు. 2019లో కూడా ఇలాగే బ్యాంకాక్ నుండి చెన్నైకి వచ్చిన ఒక వ్యక్తి వద్ద కస్టమ్స్ అధికారులు ఒక నెల వయసున్న చిరుతపులి పిల్లను కనుగొన్నారు. అలాగే గత నెలలో అదే చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు రెండు రోజుల వ్యవధిలోనే థాయ్‌లాండ్ నుండి అడవి జంతువులను స్మగ్లింగ్ చేసేందుకు చేసిన రెండు ప్రయత్నాలను అడ్డుకున్నారు. వన్యప్రాణుల వాణిజ్య పర్యవేక్షణ ఏజెన్సీ (TRAFFIC) 2022 నివేదిక ప్రకారం 2011-20 మధ్య 18 భారతీయ విమానాశ్రయాలలో 140 తనిఖీల్లో సుమారు 70వేలకు పైగా స్థానిక, విదేశీ అడవి జంతువులు బయటపడ్డాయి.


Updated Date - 2022-06-29T19:13:45+05:30 IST