తాళి కట్టిన చేతులే నులిమేశాయ్‌!

ABN , First Publish Date - 2022-08-08T05:38:03+05:30 IST

అల్లూరు మండలం ఇస్కపల్లి పంచాయతీ పెద్దపట్టపుపాలెంకు చెందిన ఆవల మురళికి (25) అదే ప్రాంతానికి చెందిన స్వాతితో (22) ఏడాదన్నర క్రితం వివాహం జరిగింది.

తాళి కట్టిన చేతులే  నులిమేశాయ్‌!
మృతదేహాల వద్ద విలపిస్తున్న కుటుంబ సభ్యులు

పసికందునూ చిదిమేశాయి!

చివరకు ఆ చేతులూ ఉరికొయ్యకు వైలాడిన వైనం

పెనుభూతంగా మారిన అనుమానం

ఇస్కపల్లి పెద్దపట్టపుపాలెంలో విషాదం


జీవితాంతం తోడుంటాడని నమ్మి వెంట నడిచిన ఆ ఇల్లాలి ఆశలు ఎన్నో రోజులు నిలవలేదు. వివాహమైన మూడు నెలలకే భర్త మదిలో పురుడు పోసుకున్న అనుమానం బుసలు కొట్టింది. రోజూ ఏదో సాకుతో గొడవ పడుతున్నా ఆ బాధను దిగమింగి కాపురం చేసింది. పుట్టిన ఆడబిడ్డకు తన పోలికలు లేవని పుట్టినింటిలోని వదిలేయంతో కుంగిపోయింది. మెట్టినింటికి రా తల్లీ అని ఆడపడుచు పిలుపుతో భర్త మారడని సంబరపడి పెనిమిటి చెంతకు చేరింది. సరిగ్గా రెండు రోజులు కూడా గడవక ముందే ఆ ఇల్లాలి పాలిట భర్తే కాలయముడయ్యాడు. గొంతు నులిమి ప్రాణాలు తీశాడు. ముక్కుపచ్చలారని ఐదు నెలల పసికందునూ పొట్టన పెట్టుకున్నాడు. చివరకు తానూ ఉరికొయ్యకు వేలాడాడు. ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొనగా అల్లూరు మండలం ఇస్కపల్లి పంచాయతీ పెద్దపట్టపుపాలెం గ్రామం శోకసంద్రంలో మునిగి పోయింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు..


 అల్లూరు, ఆగస్టు 7 : అల్లూరు మండలం ఇస్కపల్లి పంచాయతీ పెద్దపట్టపుపాలెంకు చెందిన ఆవల మురళికి (25) అదే ప్రాంతానికి చెందిన స్వాతితో (22) ఏడాదన్నర క్రితం వివాహం జరిగింది. అయితే, పెళ్లి అయిన 3 నెలల నుంచే భార్యపై అనుమానం పెంచుకున్న  మురళి తరచూ వేధింపులకు గురి చేసేవాడు. ఇందుకు భర్త తల్లిదండ్రులు ఆవుల గోవిందయ్య, బంగారమ్మ, సోదరి వెంకటమ్మ తోడవడంతో భార్యాభర్తల మధ్య దూరం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో గర్భం దాల్చిన స్వాతి కాన్పు కోసం పుట్టింటికి వెళ్లింది. ఐదు నెలల క్రితం పండింటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆడ బిడ్డ పుట్టిందని, ఆ బిడ్డకు తన పోలికలు లేవంటూ మరొక అంశాన్ని లేవనెత్తి మరింత పగను పెంచుకున్నాడు. ఈసాకుతో భార్యను కాపురానికి తీసుకురాలేదు.


మెట్టినింటికి వచ్చిన రెండోరోజే..

ఈ క్రమంలో మురళి తల్లిదండ్రులు కోడలు స్వాతిని ఇంటికి తీసుకురావాలని వారి కుమార్తె వెంకటమ్మను పంపించారు. దీంతో ఈ నెల 4వ తేదీన స్వాతిని మెట్టినింటికి తీసుకొచ్చింది. మెట్టినింటి నుంచి కాపురానికి రమ్మని కబురు రావడంతో  స్వాతికి కలిగిన సంతోషం ఎన్నో రోజులు నిలవలేదు. శనివారం రాత్రి భోజనాల అనంతరం మురళి, స్వాతి తన పాపతో కలిసి ఇంట్లోని ఒక గదిలోకి వెళ్లారు. ఈ సమయంలో వారి మధ్య వాగ్వివాదం జరిగింది. అర్ధరాత్రి వేళ గదిలో నుంచి బయటకు వచ్చిన మురళి తల్లిదండ్రులను నిద్రలేపి డబ్బులు అడిగాడు. ఆ సమయంలో డబ్బులు ఇచ్చేందుకు వారు నిరాకరించడంతో తిరిగి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. ఆదివారం ఉదయం యఽథావిధిగా అందరూ నిద్రలేచినా ఆ గది నుంచి ఎవరూ బయటకు రాకపోవడం, తలుపు తట్టినా ఎలాంటి స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి ఇంటి వెనుకవైపు ఉన్న కిటికీని స్థానికుల సహాయంతో పగులగొట్టి చూశారు. అంతే మురళి ఫ్యానుకు వేలాడుతూ కనిపించగా, స్వాతి, చిన్నారి మంచంపై విగతజీవులై ఉన్నారు. దీంతో తలుపులు పగులగొట్టి గదిలోకి వెళ్లగా వస్తువులు, దుస్తులు చెల్లాచెదురుగా పడి ఉండడం, స్వాతి గొంతుపై చేతి గోర్లు గీసుకుని ఉండడాన్ని బట్టి మురళి తన భార్య గొంతునులిపి చంపేశాడని, కన్న బిడ్డను కూడా గొంతునులిమి చంపేసినట్లు స్థానికులు భావిస్తున్నారు. ఆపై అతను కూడా ఫ్యానుకు చీరతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఎస్‌ఐ శ్రీనివాసులురెడ్డి పరిస్థితిని కావలి రూరల్‌ సీఐ ఖాజావలి, నెల్లూరు రూరల్‌ డీఎస్పీ హరినాథ్‌రెడ్డికి తెలియజేయడంతో వారు గ్రామానికి చేరుకుని విచారించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనుమానితులైన స్వాతి అత్తమామలు, ఆడపడుచులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఖాజావలి తెలిపారు. 


శోకసంద్రంలో పెద్దపట్టపుపాలెం

తమ కుమార్తె పుట్టినింటి నుంచి మెట్టినింటికి వెళ్లిందనే సంతోషం మూడు రోజులు కూడా కాకుండానే తమ బిడ్డతో పాటు మనుమరాలు విగతజీవులుగా మారి పడి ఉండడం ఆ తల్లిదండ్రులకు కడుపు కోతను మిగిల్చింది. చిన్న వయసులోనే ఇంతటి ఘోరం జరిగిపోయందని స్వాతి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోధన స్థానికులకు కంటతడి పెట్టించింది. 



Updated Date - 2022-08-08T05:38:03+05:30 IST