ltrScrptTheme3

ప్రేక్షకులకు ఏం కావాలో నాకూ తెలుసు! సంగీత దర్శకుడు తమన్‌

Jan 4 2021 @ 01:00AM

హీరో రవితేజ, సంగీత దర్శకుడు తమన్‌ది హిట్‌ కాంబినేషన్‌! ఇప్పటివరకూ వీళ్లిద్దరి కలయికలో పది చిత్రాలొచ్చాయి. ‘క్రాక్‌’ 11వది. గత సంక్రాంతికి విడుదలైన ‘అల... వైకుంఠపురములో’ సినిమా భారీ విజయంతో 2020 ప్రారంభించిన తమన్‌, ‘సోలో బ్రతుకే సో బెటర్‌’తో ముగించారు. ఈ సంక్రాంతికి ‘క్రాక్‌’తో బరిలో దిగుతున్నారు. జనవరి 9న ఈ సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా తమన్‌ చెప్పిన సంగీత సంగతులు...


‘క్రాక్‌’... పక్కా మాస్‌ మసాలా సినిమా. థియేటర్లలో మాస్‌ మహారాజా అభిమానులకు పండగే. వాణిజ్య హంగులున్న కథతో దర్శకుడు గోపీచంద్‌ మలినేని సినిమా తీశాడు. ఇటువంటి మాస్‌ చిత్రానికి హైరేంజ్‌ కమర్షియల్‌ ఆల్బమ్‌ ఇవ్వాలి. థియేటర్లలో పాటలు ఓ ఊపు ఊపాలి. సంగీత పరంగా వాణిజ్య విలువలతో పాటు ఉన్నత ప్రమాణాలు తగ్గకుండా చూసుకోవాలి. అవన్నీ ఆలోచించే ‘భూమ్‌ బద్దలు’, ‘భలేగా తగిలావే బంగారమ్‌’ చేశాం. ‘కోరమీసం పోలీసోడు’ పాట కుటుంబ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చుతోంది.


‘క్రాక్‌ బిర్యానీ’... సంగీత్‌ సాంగ్‌!

సినిమాలోని ‘క్రాక్‌ బిర్యానీ’ పాట సోమవారం విడుదలవుతుంది. కచ్చితంగా సంగీత్‌ వేడుకలు, రెస్టారెంట్లలో వినపడుతుందిది. ఈ పాట ఐడియా గోపీచంద్‌దే. విలన్‌కి హీరో వార్నింగ్‌ ఇచ్చి వచ్చిన తర్వాత ‘నీకు మంచి బిర్యానీ చేసి పెడతా’ అని హీరోయిన్‌ అంటుంది. అప్పుడు ఈ పాట వస్తుంది. కాసర్ల శ్యామ్‌ మంచి సాహిత్యం అందించారు. ‘ప్రతిరోజూ పండగే’లో ‘ఓ బావా’ ఎలా హిట్టయ్యిందో... అటువంటి ఫ్యామిలీ హిట్‌ సాంగ్‌ అవుతుంది. 


సౌండింగ్‌ మారింది!

గతేడాది మార్చి లేదా ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన చిత్రమిది.  కరోనా వల్ల మార్చిలో చిత్రీకరణ ఆగింది. లాక్‌డౌన్‌ తర్వాత అనుమతులు వచ్చిన వెంటనే ఎన్నో జాగ్రత్తలు తీసుకుని అక్టోబర్‌లో సెట్స్‌కు వెళ్లారు. పాటలను గ్రాండ్‌గా చిత్రీకరించారు. ఏప్రిల్‌ 2020 నుంచి డిసెంబర్‌ వరకూ సౌండింగ్‌ పరంగా ఎన్నో మార్పులు వచ్చాయి. కొత్త ఆల్బమ్స్‌ వచ్చాయి. అందుకని, మేం మా ఐడియాలు మార్చుకుని మ్యూజిక్‌ చేశాం. ఇక్కడ నేనేమీ ఇండిపెండెంట్‌ మ్యూజిక్‌ చేయడం లేదు. కథను బట్టే సంగీతం ఉంటుంది. సినిమా ఏం అడుగుతుందో... అదే చేయాలి కదా! థియేటర్లలో ఈ పాటలను చూస్తే వేరే లెవల్‌లో ఉంటాయి.


షారూఖ్‌ చిత్రానికి ముందే...

జి.కె. విష్ణు నాకు మంచి ఫ్రెండ్‌. చాలా రోజులుగా తెలుసు. తమిళంలో ‘మెర్సల్‌’, ‘బిగిల్‌’ చేశాడు. గోపీచంద్‌ ‘క్రాక్‌’ కథ చెప్పిన తర్వాత అతడి సినిమాటోగ్రఫీ అయితే బావుంటుందని చెప్పాను. అప్పటికి హిందీలో షారూఖ్‌ ఖాన్‌తో ఓ సినిమా చేయడానికి విష్ణు అంగీకరించాడు. అయితే, అది మొదలు కాలేదు. ఎనిమిది నెలలు పడుతుందన్నాడు. ‘ఈ లోపుక్రాక్‌ చేసి వెళ్లు’ అని చెప్పా. గోపీచంద్‌, తను మాట్లాడుకుని  ఐడియాలు షేర్‌ చేసుకున్నారు. ‘క్రాక్‌’ ట్రైలర్‌లో సినిమాటోగ్రఫీ ఎలా ఉందో చూశారు కదా! థియేటర్‌లో ఇంకా బావుంటుంది.


రవితేజతో... ‘కిక్‌’ నుంచి!

‘కిక్‌’ నుంచి రవితేజగారు నన్నెంతో ప్రోత్సహిస్తున్నారు. నాతో ఎక్కువ చిత్రాలు చేసిన హీరో ఆయనే. మా మధ్య స్పెషల్‌ బాండింగ్‌ ఉంది. సంగీత దర్శకుడిగా నన్ను పరిశ్రమకు తీసుకొచ్చిన రవితేజ సినిమా అంటే ఏమాత్రం అలసత్వం ప్రదర్శించను. బెస్ట్‌ ఇస్తాను. ఈ సినిమాకూ ఇచ్చాను. 


లాక్‌డౌన్‌లో... ఆగలేదు!

మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ స్టూడియోల్లోనే జరుగుతాయి. మాది ఎప్పుడూ ఐసోలేషన్‌ వర్కే కదా! గత 8 నెలలుగా ‘వకీల్‌ సాబ్‌’, ‘సర్కారు వారి పాట’, ‘సోలో బ్రతుకే సో బెటర్‌’, ‘మిస్‌ ఇండియా’తో పాటు మిగతా సినిమాల కంపోజింగ్స్‌ జరిగాయి. ఎక్కడా పని ఆగలేదు. అందువల్ల, లాక్‌డౌన్‌లో నాకు కొత్తగా ఏమీ లేదు.


ప్రతి చిత్రానికి మనసు పెడతా!

నేను ప్రతి చిత్రానికీ మనసు పెట్టి పని చేస్తా. మంచి పాటలు ఇవ్వడానికి కృషి చేస్తా. ప్రేక్షకులు ఆదరిస్తారా? లేదా? అనేది వాళ్ల చేతుల్లో ఉంటుంది. అయితే, నేను చేసే పాట ముందు నాకు నచ్చాలి. మనకు నచ్చితేనే జనాలకు నచ్చుతుంది. నేనూ జనంలో ఒకడినే కదా! ఈ లోకంలోనే బ్రతుకున్నాను కదా! ప్రేక్షకులకు ఏం కావాలో నాకూ తెలుసు. ఒక్కొక్క సంగీత దర్శకుడిదీ ఒక్కో శైలి. నాదొక శైలి... అంతే!


మహేశ్‌తో ఆరేళ్ల తర్వాత!

మహేశ్‌బాబుగారితో ఆరేళ్ల తర్వాత పని చేస్తున్నా. ‘దూకుడు’, ‘బిజినె్‌సమేన్‌’, ‘ఆగడు’ తర్వాత... మళ్లీ ఇప్పుడు ‘సర్కారు వారి పాట’కి సంగీతం అందిస్తున్నా. ఆల్రెడీ రెండు పాటలు ఫైనల్‌ చేశాం. మిగతావి ఫైన్‌ ట్యూన్‌ చేస్తున్నా. చిత్రీకరణ ప్రారంభించడానికి సమయం ఉంది కాబట్టి మళ్లీ రీవర్క్‌ చేస్తున్నా. నా బెస్ట్‌ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నా. మహేశ్‌ వంటి స్టార్‌తో సినిమా కాబట్టి దర్శకుడు బుజ్జి (పరశురామ్‌) హై స్టాండర్ట్స్‌, కమర్షియల్‌ వేల్యూస్‌ ఉన్న కథ రెడీ చేశాడు. మ్యూజికల్‌ అప్‌డేట్‌ ఇచ్చి షూటింగ్‌కి వెళతాం.


‘వకీల్‌ సాబ్‌’... మర్యాద తెచ్చే సినిమా

ప్రామిస్‌ చేసి చెబుతున్నా... ‘వకీల్‌ సాబ్‌’ చాలా మంచి చిత్రం. యూనిట్‌ అందరికీ మర్యాద తెచ్చే సినిమా. పవన్‌కల్యాణ్‌గారి గురించి చెప్పలేను... ఆయన్ను చూసి ఆనందిస్తున్నా. ఆయనతో రెండు చిత్రాలు చేస్తున్నాననే విషయాన్ని ఇంకా నమ్మలేకపోతున్నా. ఈ క్రెడిట్‌ అంతా త్రివిక్రమ్‌గారిదే. ఆయన వల్లే పవర్‌స్టార్‌తో పరిచయం ఏర్పడింది. ‘వకీల్‌ సాబ్‌’, ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ రీమేక్‌ చేసే అవకాశం వచ్చింది. ఇప్పుడీ రెండు చిత్రాలతో పాటు ఎన్టీఆర్‌30, ‘వకీల్‌ సాబ్‌’ తర్వాత ‘దిల్‌’ రాజుగారి నిర్మాణంలో ‘థ్యాంక్యూ’ చేస్తున్నానంటే త్రివిక్రమ్‌గారి వల్లే! ఆయన నా డ్రైవింగ్‌ ఫోర్స్‌ అని చెప్పవచ్చు. నా వెనుక ఉండి నన్ను ముందుకు నడిపించే మార్గదర్శి అయనే!


త్రివిక్రమ్‌... నాలో మార్పు!

‘అరవింద సమేత వీరరాఘవ’కి ముందు... ఆ తర్వాత... తమన్‌ ఏంటనేది ప్రేక్షకులందరికీ తెలుసు. నాలో చాలా విషయాలను ఆయన మార్చారు. ఇవాళ నేను ఈ స్థాయిలో ఉన్నానంటే... కారణం ఆయనే! నేను సినిమాను ఓ విధంగా అర్థం చేసుకుంటున్నాను. త్రివిక్రమ్‌తో పరిచయం తర్వాత వేరే విధంగా చేసుకుంటున్నా. ఆయన నన్నెంతో మార్చారు. ఇటీవల వచ్చిన ‘దాదా సాహెబ్‌ ఫాల్కే - సౌత్‌ 2020’ అవార్డును ఆయనకు అంకితమిస్తున్నా.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.