తప్పిన ఘోర ప్రమాదం

ABN , First Publish Date - 2022-09-30T05:18:32+05:30 IST

మండలంలోని ముంబై జాతీయ రహదారిపై గురువారం ఓ కారు ఆటోను ఢీకొన్న ఘటనలో ఘోర ప్రమాదం తప్పింది.

తప్పిన ఘోర ప్రమాదం
సంఘటన చోట గుమ్మిగూడిన జనం తీవ్రంగా గాయపడిన అంకమ్మ

వాహనాన్ని క్రాస్‌ చేస్తూ ఆటోను ఢీకొన్న కారు

ఆటో డ్రైవర్‌తోపాటు 9 మంది ప్రయాణికులకు గాయాలు  


సంగం, సెప్టెంబరు 29: మండలంలోని ముంబై జాతీయ రహదారిపై గురువారం ఓ కారు ఆటోను ఢీకొన్న ఘటనలో ఘోర ప్రమాదం తప్పింది. స్థానికుల కథనం  మేరకు.. బుచ్చిరెడ్డిపాళెంకు చెందిన మురళి తన ఆటోలో ప్రయాణికులను ఎక్కించుని సంగం బయలుదేరాడు. మార్గమధ్యలో వెంగారెడ్డిపాళెం వద్ద ఓ మహిళ, బాలుడు ఎక్కారు. ఆటోలో మొత్తం డ్రైవర్‌తోపాటు 8 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆటో సంగం చెక్‌పోస్టు దాటిన తర్వాత ఎదురుగా వస్తున్న కారు ముందు వెళ్తున్న లారీని క్రాస్‌చేసి, వేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టింది. ఈ క్రమంలో వెనుక చక్రం విరిగి.. ఆటోలోని కొంత మంది కింద పడ్డారు. ఆటోడ్రైవర్‌ మురళీతో పాటు వెంగారెడ్డిపాళెంకు చెందిన అంకమ్మ, సూరాయపాళెంకు చెందిన రాజమ్మ, సంగం బ్యారేజి వద్ద పనిచేసే బిహార్‌ రాష్ట్రానికి చెందిన శ్యామ్‌ కుమార్‌, దేవా, సంజయ్‌ చౌదరి, ముఖేష్‌ కుమార్‌, బికార్‌ కుమార్‌లకు  గాయాలయ్యాయి. 108 వాహనం అందుబాటులో లేకపోవడంతో తీవ్రంగా గాయపడిన అంకమ్మ, ఓ వ్యక్తిని ఆటోలో వైద్యశాలకు తరలించారు. అనంతరం టోల్‌ గేట్‌ నుంచి వచ్చిన అంబులెన్స్‌లో మిగతా వారిని వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అందరిని 108లో నెల్లూరు వైద్యశాలకు తరలించారు. కారు యజమాని జనార్ధన్‌ డ్రైవింగ్‌ చేస్తూ బుచ్చిలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు కరటంపాడు నుంచి బయలుదేరాడు. సంగం కొండ దిగేటప్పుడు వేగంగా వస్తూ ముందు వెళ్తున్న లారీని క్రాస్‌ చేస్తూ ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో జనార్థన్‌కు స్వల్ప గాయాలయ్యాయి. కారులో ఉన్న కుటుంబ సభ్యులకు ఎటువంటి ప్రమాదం జరుగలేదు.  పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-09-30T05:18:32+05:30 IST