చినుకు పడితే అంతే

ABN , First Publish Date - 2022-06-27T06:51:25+05:30 IST

మునిసిపాలిటీల్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో చిన్నపాటి వర్షానికే పొంగిపొర్లుతున్నాయి. మురుగు కాల్వల నిర్వహణ సరిగా లేకపోవడం, కొన్ని ప్రాంతాల్లో అస్త వ్యస్తంగా మారడంతోపాటు డ్రైనేజీల్లో నిండిన చెత్తాచెదారం రోడ్లపైకి వస్తోంది.

చినుకు పడితే అంతే
పోచంపల్లిలో చౌటుప్పల్‌కు వెళ్లే దారిలో ప్రవహిస్తున్న మురుగునీరు

అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ

రహదారులపైకి మురుగునీరు

ఇబ్బందుల్లో పుర ప్రజలు

మునిసిపాలిటీల్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో చిన్నపాటి వర్షానికే పొంగిపొర్లుతున్నాయి. మురుగు కాల్వల నిర్వహణ సరిగా లేకపోవడం, కొన్ని ప్రాంతాల్లో అస్త వ్యస్తంగా మారడంతోపాటు డ్రైనేజీల్లో నిండిన చెత్తాచెదారం రోడ్లపైకి వస్తోంది. దీంతో రోజుల తరబడి రహదారులపైనే మురుగు నిలిచి దోమలు, పందులకు ఆవాసాలుగా మారుతున్నాయి. ఫలితంగా ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు.

భువనగిరి టౌన్‌: జిల్లా కేంద్రమైన భువనగిరి మునిసిపాలిటీలో డ్రైనేజీలు నిర్మించినా మురుగునీటి సమస్య పూర్తిస్థాయిలో పరిష్కారానికి నోచుకోలేదు. కొన్ని కాలనీల్లో మురుగుకాల్వలు లేక రహదారులపైకి నీరు చేరుతోంది. సుమారు 70వేల జనాభా ఉన్న భువనగిరిలో 35వార్డులు ఉన్నాయి. మునిసిపాలిటీకి రూ.3కోట్లు మంజూరు కాగా, రెండున్నరేళ్ల క్రితం డ్రైనేజీలు నిర్మించినా సమస్య పరిష్కారమవ్వలేదు. హెచ్‌బీ కాలనీలో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ అస్తవ్యస్తంగా మారింది. బంజారాహిల్స్‌ తదితర ప్రాంతాల్లో మ్యాన్‌హోల్స్‌పై మూతలు లేవు. చిన్నపాటి వర్షానికే గాంధీనగర్‌, బీచ్‌మహల్లా, జంఖాన్‌గూడ, ఇస్లాంపుర, తదితర బస్తీలో ఇళ్లలోకి మురుగునీరు వస్తోంది. రూ.25కోట్లతో పట్టణ ప్రధాన రహదారి 100 ఫీట్ల విస్తరణ కొనసాగుతుండగా, దీనికి ఇరువైపులా 4.440కి.మీ నూతన డ్రైనేజీలు, వరద నీటి కాల్వలు నిర్మిస్తున్నా ప్రమాణాలను విస్మరించడంతో బస్తీల్లోకి మురుగునీరు చేరుతోంది. విలీన గ్రామాలైన బొమ్మాయిపల్లి, పగిడిపల్లి, రాయిగిరిలోనూ డ్రైనేజీ సమస్య ఉంది. దీంతో వర్షాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఆలేరు: నిధులున్నా పనులకు నోచుకోక ఆలేరు మునిసిపాలిటీలో డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపడటం లేదు. 17వేల జనాభాతో 12 వార్డులు ఉన్న పట్టణానికి సీఎం ప్రకటించిన రూ.50 లక్షలతో చేపట్టాల్సిన పనులు టెండర్ల ప్రక్రియకు కూడా నోచుకోలేదు. దీంతో వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రధాన సమస్యగా మారాయి. ఇటీవలే కొన్నివార్డుల్లో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు చేపట్టారు. మరికొన్ని వార్డుల్లో అండర్‌గ్రౌండ్‌ పనులు ప్రారంభించాల్సి ఉంది. అదేవిధంగా పట్టణంలోని ఆర్‌యూబీ(రైల్వే అండర్‌ పాస్‌ బ్రిడ్జి) వెంట సర్వీసు రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు విడుదలచేయకపోవడంతో ఈ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. దీంతో బ్రిడ్జి వద్ద మురుగునీరు, చెత్తా చెదారం పేరుకుపోయి దుర్వాసన వస్తోంది.

చౌటుప్పల్‌: హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో చౌటుప్పల్‌ ఒకటి. ఈ పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ ప్రధాన సమస్యగా మారింది. తంగడపల్లి చౌరస్తా, గణే్‌షనగర్‌, రాం నగర్‌, తదితర ప్రాంతాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. పట్టణంలోని పైభాగంలోని మురుగునీరంతా లోతట్టు కాలనీల ఇళ్ల మధ్య నుంచే ప్రవహిస్తోం ది. దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులుపడుతున్నారు. వర్షాకాలంలో ఈ సమస్య మరింత అధికంగా ఉంటోంది. రూ.7కోట్లతో తంగడపల్లి రోడ్డులో ప్రఽధాన మురుగు కాల్వ, పలు కాలనీల్లో అంతర్గత కాల్వల నిర్మాణం చేపట్టేందుకు మునిసిపల్‌ అధికారులు ప్రణాళికలు రూపొందించారు.

యాదగిరిగుట్ట రూరల్‌: యాదగిరిగుట్ట మునిసిపాలిటీ పరిధిలోని 12 వార్డులలో డ్రైనేజీ సమస్య నెలకొంది. కొన్ని వార్డుల్లో మురుగుకాల్వలు వాహనదారులకు ప్రాణసంకటంగా మారాయి. అండర్‌గ్రౌండ్‌ డ్రైనే జీ అస్తవ్యస్తంగా ఉండటంతో భారీ వర్షం వస్తే చెత్తాచెదారం చేరి మురుగునీరు రోడ్లపైకి వస్తోంది. ఓపెన్‌ గట్టర్ల నిర్వహణ సరిగా లేక అక్కడక్కడ మురుగునీరు నిలుస్తోంది.

భూదాన్‌పోచంపల్లి: ప్రపంచ పర్యాటక ప్రాంతమైన పోచంపల్లి మునిసిపాలిటీలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. 13వార్డుల్లో కనీస వసతులు కరువయ్యా యి. ఏళ్ల క్రితం ఏర్పాటుచేసిన పైప్‌లైన్లలో ఫ్లోరిన్‌ నిండి తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. కొన్ని వార్డుల్లో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీలు నిర్మిస్తుండగా, మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ వార్డు బాత్క లింగస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న బీసీ కాలనీ, హస్తినాపురం కాలనీలో డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. కొద్దిపాటి వర్షం వచ్చినా చౌటుప్పల్‌కు వెళ్లే రహదారిపైకి మురుగునీరు ప్రవహిస్తోంది. అంబేడ్కర్‌ యువజన సంఘం వద్ద రహదారిపై మ్యాన్‌హోల్‌ లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

సూర్యాపేటటౌన్‌: జిల్లా కేంద్రమైన సూర్యాపేట మునిసిపాలిటీ పరిధిలో డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా మారింది. చాలా చోట్ల మ్యాన్‌హోల్స్‌ ధ్వంసమయ్యాయి. వర్షం వస్తే ఏ క్షణం లో ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు భయపడుతున్నా రు. పట్టణంలో మొత్తం 48 వార్డులు ఉండగా, 1.37లక్షల జనాభా ఉంది. పట్టణంలో 153.30కి.మీ విస్తీర్ణం మేర మురుగుకాల్వలు ఉన్నాయి. మొత్తం 367 మురుగు కాల్వలు ఉండ గా, సీసీ ఉన్నవి 181 మాత్రమే. మట్టి కాల్వలు 68 ఉండగా, అందులో 40కుపైగా శిథిలావస్థకు చేరాయి. కొన్నిచోట్ల డ్రైనేజీ లో నిర్మాణదశలో ఉన్నాయి. గత వానాకాలంలో కురిసిన వర్షానికి పేట అతలాకుతలమైంది. ప్రధానంగా శివారు ప్రాం తాల్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక పలు ప్రాంతాలు నీట మునిగాయి.మానసనగర్‌, తాళ్లగడ్డ, ఆర్‌కే గార్డెన్‌, స్నేహనగర్‌, ఇం దిరమ్మ కాలనీ 1, 2, 3, ఏన్టీఆర్‌ కాలనీ, శ్రీశ్రీనగర్‌, శ్రీరాంనగ ర్‌, కుడకుడ ప్రాంతం, అంజనాపురికాలనీ, 60 ఫీట్లరోడ్డు, భగత్‌సింగ్‌నగర్‌లతో పాటు పలు ప్రాంతాలు గత వానాకాలంలో వరదలో మునిగాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇళ్లలోకి వర్షపునీరు చేరింది. పట్టణ ప్రగతిలో భాగంగా రూ.8కోట్ల మేర నిధులతో సీసీరోడ్లు, మురుగు కాల్వల నిర్మాణాలకు ప్రజాప్రతినిధులు శంకుస్థాపనలు చేశారు.

తిరుమలగిరి : తిరుమలగిరి మునిసిపాలిటీలో డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా ఉంది. దళిత వాడల్లో అభివృద్ధి పనుల కోసం రూ.2.5కోట్లకు ప్రతిపాదనలు పంపగా మోక్షం లభించలేదు. తొర్రూర్‌ రోడ్డులో ఓపెన్‌ నాలా పనులకు రూ.కోటి ప్రతిపాదనలు చేసినా విడుదల కాలేదు. చిన్నవానకే క్రాస్‌రోడ్డు కూడలి కుంటను తలపిస్తోంది. 15వార్డుల్లో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులు చేపట్టలేదు. వానాకాలం వస్తే ప్రజలు బురదలో నడవలేక ఇబ్బందులు పడుతున్నారు. నిధుల సమస్యలేదని అధికారులు చెబుతున్నా, మౌలిక వసతులు మాత్రం కల్పించలేకపోతున్నారు. పట్టణ ప్రగతిలో గుర్తించిన ఏ సమస్యనూ పరిష్కరించలేదు. మూడేళ్లలో రూ.1.8 కోట్లతో సీసీ రోడ్లు, రూ.1.10 కోట్లతో డ్రైనేజీల నిర్మాణం చేసినట్లు ఖర్చు చూపిస్తున్నా క్షేత్రస్థాయిలో అభివృద్ధి కనిపించడం లేదు. 

హుజూర్‌నగర్‌ : హుజూర్‌నగర్‌ మునిసిపాలిటీలో 28వార్డులు, 35,411 మంది ఓటర్లు, 10,800 కుటుంబాలు, 52వేల జనాభా ఉంది. వార్డుల్లో పం దులు స్వైరవిహారం చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. పారిశుధ్యం అం తంతమాత్రమే. ఇందిరాసెంటర్‌, మిర్యాలగూడ రోడ్డు, గోవిందాపురం, అంబేడ్కర్‌కాలనీ, ఎన్‌ఎ్‌సపీ క్యాంప్‌, శ్రీనగర్‌కాలనీ, జంగిడి బజార్‌, సుందరయ్యనగర్‌ కాలనీల్లో డ్రైనేజీలు సరిగాలేవు. మందుల బజారు, సుందర య్యనగర్‌, గోవిందాపురం, అంబేడ్కర్‌ కాలనీలో డ్రైనేజీలు సరిగా లేకపోవ డం, చెత్తా చెదారంతో నిండటంతో పందులు స్వైరవిహారంచేస్తున్నాయి.

నేరేడుచర్ల : నేరేడుచర్ల మునిసిపాలిటీలోని పలు వార్డుల్లో డ్రైనేజీల నిర్మాణం లేక మురుగునీరు పోయే దారిలేదు. దీంతో గత ఏడాది వర్షాలకు లోతట్టు ప్రాంతాలు మునిగాయి. సీసీ రోడ్డు నిర్మించినా వాటి వెంట డ్రైనేజీల నిర్మాణం చేపట్టలేదు. పలు వార్డుల్లో ఇదే పరిస్థితి. ఈ ఏడాది వర్షాకాలంలో తిరిగి ఇబ్బందులు పడక తప్పేలా లేదని లోతట్టు ప్రాంతవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కోదాడ : కోదాడ మునిసిపాలిటీలో డ్రైనేజీ సమస్యతో ప్రజలు సతమతమవుతున్నారు. 35 వార్డులకు పట్టణశివార్లలో సీసీ రోడ్డు నిర్మాణాలు, మురుగుకాల్వలు లేవు. మ్యా న్‌హోల్స్‌ నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తయినా నిర్మాణాలు చేపట్టలేదు. వర్షం వస్తే ఇబ్బంది పడాల్సి వస్తోంది. పట్టణ ప్రగతిలో డ్రైనేజీలకు మరమ్మతులు, చెత్తతొలగిం పు వంటివి చేపట్టినా, పూర్తిస్థాయి నిర్మాణాలు లేవు. డ్రైనేజీల నిర్మాణాలు చేపట్టి మురుగునీరు కోదాడ పెద్ద చెరు వు అలుగుకు కలపాలని ప్రజలు కోరుతున్నారు.

రామగిరి : నల్లగొండ పట్టణంలో 48 వార్డులు ఉన్నాయి. పాతబస్తీ చౌరస్తాలో కొన్నేళ్ల కిందట మురుగుకాల్వ ధ్వంసమై ప్రమాదకరంగా మారింది. శాంతినగర్‌, రవీంద్రనగర్‌ ప్రాంతాల్లోని నాలాలపై స్లాబ్‌ నిర్మించలేదు. పానగల్‌ బైపాస్‌ వద్ద వరద నీరు ప్రవాహం కోసం నిర్మిస్తున్న నాలా పనులు 50 శాతమే పూర్తయ్యాయి. ఇక్కడి డ్రైనేజీ చెత్తాచెదారంతో నిండి వర్షం వచ్చినప్పుడు చెరువును తలపిస్తోంది. పాతబస్తీ చౌరస్తా నుంచి స్టార్‌ఫంక్షన్‌ హాలుకు వెళ్లే దారిలో ఓపెన్‌ నాలా ప్రమాదకరంగా మారింది. బీఎ్‌సఎన్‌ఎల్‌ కార్యాలయ సమీపంలో డ్రైనేజీ చిన్నదిగా ఉండడం, మురుగు నీరు రోడ్డుపైనే ప్రవహిస్తోంది.

చిట్యాల : మునిసిపాలిటీలో పారిశుధ్యం అధ్వానంగా ఉంది. 14,850  జనాభా ఉండగా, 12వార్డుల్లో ప్రధానంగా 3, 4, 12 వార్డుల్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక ఇళ్ల మధ్య మురుగునీరు నిలుస్తోంది. మురుగుకాల్వల నిర్మాణం చేపట్టినా పనులు నత్తనడకన సాగుతుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో నీరు నిలిచి దుర్వాసన వెదజల్లడంతో పాటు దోమలు వృద్ధి చెందడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 2, 9, 10 వార్డుల్లో మురుగు కాల్వ నిర్మించి దానిపై స్లాబ్‌ వేయకపోవడంతో ప్రమాదకరంగా మారాయి. భారీ వర్షాలకు 4వ వార్డులో ఇళ్ల మధ్య నీరు నిలుస్తుండడంతో డ్రైనేజీ నిర్మాణానికి ఇటీవల రూ.65లక్షలు మంజూరు చేశారు.

మిర్యాలగూడ టౌన్‌: మిర్యాలగూడ మునిసిపాలిటీలో పుష్కరకాలం కిందట నిర్మించిన అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు నేటికీ పూర్తికాలేదు. పట్టణంలో 48 వార్డులుండగా అన్నిచోట్ల మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ అందుబాటులో లేదు. పలు వార్డుల్లో డ్రైనేజీలు, ప్రధాన, పంట కాల్వలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో మురుగు, వరద వీధుల్లో ప్రవహిస్తూ లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతోది. ప్రధానంగా హనుమాన్‌పేట, సీఐటీయూకాలనీ, తాళ్లగడ్డ, ముత్తిరెడ్డికుంట, బంగారుగడ్డ, సుందర్‌నగర్‌, చర్చిరోడ్డు, అశోక్‌నగర్‌, ఇస్లాంపుర తదితర కాలనీల్లో సమస్య తీవ్రంగా ఉంది. ఇక్కడ మురుగునీరు పారే పరిస్థితి లేదు. చిన్నపాటి వర్షానికి ఎక్కడికక్కడ నీరు నిలుస్తోంది.

నకిరేకల్‌: మునిసిపాలిటీలో 20 వార్డులు ఉండగా, ఏడాది కాలంగా మురుగుకాల్వల మరమ్మతులు పూర్తిస్థాయిలో చేపట్టలేదు. గత ఏడాది వర్షాలకు సాయిబాబా దేవాలయం ప్రాంతం, చీమలగడ్డ, తాటికల్‌ రోడ్డు, డాక్టర్స్‌ కాలనీ, పన్నాలగూడెంలో డ్రైనేజీ సౌకర్యం లేక మురుగునీరు ఎక్కడికక్కడ నిలిచి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దీంతో అప్పటికప్పుడు తాత్కాలిక చర్యలు చేపట్టారు తప్పా డ్రైనేజీ ఏర్పాటు చేయలేదు. దీంతో ఈ ఏడాది వర్షాలకు మళ్లీ మురుగునీరు నిలిచి ఇబ్బందులు పడుతామని ఆయా కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు.

నాగార్జునసాగర్‌: నందికొండ మునిసిపాలిటీలో 12 వార్డులకు పది వార్డుల్లో మురుగు నీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. చిన్న పాటి వర్షానికే మ్యాన్‌హోల్స్‌ పొంగిపొర్లుతున్నాయి. ఎన్‌ఎస్పీ ఆధ్వర్యంలో 2018లో రూ.12కోట్లతో కాలనీల్లో మురుగునీటి వ్యవస్థను ఏర్పాటుచేశారు. కొన్నిచోట్ల వీధి మధ్యలో మ్యాన్‌హోల్స్‌ ఏర్పాటుచేయడంతో స్థానికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హిల్‌కాలనీలో మ్యాన్‌హోల్స్‌పై మూతలేక పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. పైలాన్‌కాలనీలో మ్యాన్‌హోల్స్‌ మూసుకుపోవడంతో మురుగునీరు వీధుల్లో ప్రవహిస్తోంది. అధికారులు సమస్య ఉన్న ప్రాంతంలో మ్యాన్‌హోల్స్‌కు మరమ్మతులు నిర్వహించి వర్షాకాలంలో రోడ్లపైకి మురుగు నీరు రాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

హాలియా: మునిసిపాలిటీలో 25వేల జనాభా ఉంది. పట్టణంతో పాటు అనుముల, ఇబ్రహీంపేట, అనుములవారిగూడెంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు. పట్టణం గుండా పేరూరు మేజర్‌ ప్రవహిస్తుండగా, సాగర్‌ రోడ్డు వెంట ఉన్న కాలనీల మురుగు నీరంతా ఈ మేజర్‌లోకి చేరి దుర్వాసన వెదజల్లుతోంది. దోమలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కేటీఆర్‌ హాలియా పర్యటనలో డ్రైనేజీ నిర్మాణానికి రూ.15కోట్లు ప్రకటించినా, ఇంకా నిధులు మంజూరు కాలేదు.

చండూరు: కొత్తగా ఏర్పడిన చండూరు మునిసిపాలిటీలో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉంది. వర్షాకాలం వచ్చిందంటే  మురుగు రహదారులపై ప్రవహిస్తోంది. కస్తూర్బాగాంధీ పాఠశాల మరుగుదొడ్ల నుంచి నీరు రోడ్డుపైకి వచ్చి దుర్గంధం వెదజల్లుతోంది. మునిసిపాలిటీకి రూ.10కోట్ల అభివృద్ధి నిధులు మంజూరైనా 10వార్డులో అభివృద్ధి పనులు చేపట్టడంలో పాలకవర్గం, అధికారులు విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి.  ఒక్క వార్డులో కూడా సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు.



Updated Date - 2022-06-27T06:51:25+05:30 IST