జీ హుజూర్‌ అంటే అంతే!

Published: Mon, 28 Mar 2022 00:12:40 ISTfb-iconwhatsapp-icontwitter-icon
జీ హుజూర్‌ అంటే అంతే!

నాయకులతో అంటకాగుతున్న కొందరు అధికారులు
అధికార పార్టీ వారి మెప్పు కోసం పాకులాట
చెప్పింది చేస్తూ మెడమీదకు తెచ్చుకుంటున్న తీరు


గత ఏడాది జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో వన్‌టౌన్‌ సీఐ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని 2వ వార్డు బీజేపీ అభ్యర్థి గణేష్‌ జాతీయ బీసీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. జాతీయ బీసీ కమిషన్‌ అప్పటి కలెక్టర్‌, ఎస్పీలను కమిషన్‌ ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. విచారణకు తమకు తగిన సమయం ఇవ్వాలని కోరడంతో వారి తరపున సీఐ జాతీయ బీసీ కమిషన్‌ ముందు హాజరయ్యారు.

గత ఏడాది ఆగస్టులో కర్నూలు మండలం జి.సింగవరం సచివాలయ నిర్మాణంపై పంచాయతీ సెక్రటరీ, సర్పంచ్‌ నాగేంద్ర నాయుడు మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో డీపీవో ప్రభాకర్‌ రావు సర్పంచ్‌ చెక్‌ పవర్‌ను నిలిపివేశారు. దీనిపై నాగేంద్ర హైకోర్టును ఆశ్రయించగా చెక్‌ పవర్‌ను పునరుద్ధరించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను పాటించకపోవడంతో గత ఏడాది సెప్టెంబరులో డీపీవోపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ను ఆదేశించింది.

ఇటీవల మ్యుటేషన్‌ చేయకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు సి.బెళగల్‌ తహసీల్దార్‌ శివశంకర్‌ నాయక్‌కు జైలు శిక్ష పడింది. తమ ఆదేశాలు పాటించనందుకు హైకోర్టు తహసీల్దార్‌కు ఆరు నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది.

తాజాగా కర్నూలు మూడో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ సీఐ తబ్రేజ్‌ను సివిల్‌ కేసుకు సంబంధించి కోర్టుకు హాజరు కావాలని కర్నూలు ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి ఆదేశించారు. సీఐ కోర్టుకు హాజరు కాకపోవడంతో తర్వాత మళ్లీ సమన్లు జారీ చేసింది. అయినా ఆయన హాజరు కాకపోవడంతో కోర్టు ధిక్కరణ కేసు కింద జడ్జి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేశారు.


కర్నూలు, ఆంధ్రజ్యోతి: ప్రజలకు సేవ చేయాల్సిన కొందరు అధికారులు అధికార పార్టీ నాయకుల మెప్పు కోసం వెంపర్లాడుతున్నారు. వారి సేవలో మునిగి తేలుతున్నారు. తద్వారా తమ మెడ మీదకు తెచ్చుకుంటున్నారు. కమిషన్ల ముందు హాజరవుతూ చర్యలకు గురవుతున్నారు. ఇలాంటి వారిని ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి కూడా ఉపేక్షించడం లేదు. వీఆర్‌కు పంపించడం లేదా సస్పెన్షన్‌ వేటు వేస్తున్నారు.

తెలిసి మసలుకోవాలి..

అధికారుల కోర్టు ధిక్కరణ కేసులను పరిశీలిస్తే అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రతివాదులు పేర్కొనవి అధిక శాతం ఉన్నాయి. అధికార పార్టీ నాయకుల ఒత్తిడికో, ప్రలోభాలకో తలొగ్గి వారేం చెప్తే అది చేయడానికి కొంతమంది అధికారులు వెనుకాడ్డం లేదు. దీని వల్ల తాత్కాలికంగా ప్రాధాన్యం లభిస్తుందే మో కానీ.. భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోంది.

పాఠాలు నేర్చుకోరే..


ప్రభుత్వ ఉద్యోగులకు సంఘంలో ఓ హోదా ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిం చడం వల్ల కోర్టుల చుట్టూ తిరగడం, చర్యలకు గురికావడం వల్ల వారితో పాటు, వారి కుటుంబ సభ్యులు మానసిక క్షోభకు గురి కావాల్సి ఉంటుంది. ఇదే ప్రమోషన్లు, ఇంక్రిమెంట్‌ విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి. అధికార పార్టీ నాయకులు చెప్పినట్లు చేసినందుకు గతంలో కొందరు సీనియర్‌ ఐఏఎస్‌లే జైలు ఊచలు లెక్క పెట్టాల్సి వచ్చింది. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో కూడా చాలామంది సీనియర్‌ అధికారులు హైకోర్టు ఆగ్రహానికి గురవుతున్నారు. వీటన్నింటిని చూస్తూ కూడా కొందరు అధికారుల తీరు మారడం లేదు. తమకు అన్యాయం జరిగితే ఇప్పుడు సామాన్యులెవరూ గతంలో మాదిరి ఉరుకోవడం లేదు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తూ అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. దీనికి పైఉదాహరణలే నిదర్శనం.

స్వలాభంతోనే ఇలా..

అధికారులు స్వలాభంతో అధికార పార్టీ వారికి వత్తాసు పలుకుతున్నారు. దీనివల్ల కోర్టు ధిక్కరణ కేసులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇప్పుడు ప్రజల్లో చైతన్యం పెరిగింది. గతంలో మాదిరి అధికారులు, పోలీసులు ప్రవర్తిస్తామంటే కుదరదు. ప్రజలు తిరగబడుతున్నారు. కోర్టు మెట్లు ఎక్కిస్తున్నారు. ప్రభుత్వం ఉన్నదే ప్రజల కోసం. ప్రజలకు అవసరమైన సేవలు చేయాల్సిందే! అది కాదని ప్రవర్తిస్తే జైలు పాలు కావాల్సి వస్తుంది.

- బిర్రు ప్రతాప్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ పంచాయతీరాజ్‌ చాంబర్‌, కర్నూలు

ఉదాసీనత ఎక్కువైంది

అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలే కోర్టుకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం అందుకు భిన్నంగా ప్రవరిస్తారా? అందుకే కోర్టు ఆదేశాల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే కోర్టుల పట్ల ఇలా ప్రవర్తించడం మరీ దారుణంగా ఉంది. అసలు క్షేత్రస్థాయిలో సామాన్యులకు న్యాయం జరగడం లేదంటే అధికారులు, పోలీసులు ప్రజల పట్ల ఎలా వ్యవహరిస్తున్నారో అర్థమవుతోంది. ఇది ఇలాగే కొనసాగితే ప్రజలకు ప్రభుత్వ యంత్రాంగాలపైన, ప్రభుత్వంపైన నమ్మకం పోయే ప్రమాదం ఉంది.

- రామాంజనేయులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, కర్నూలు

న్యాయస్థానాలను అవహేళన చేయడమే

కోర్టు ధిక్కరణకు పాల్పడడమంటే భారత ప్రజాస్వామ్యానికి మూలస్తంభాల్లో ఒకటైన న్యాయవ్యవస్థను అవహేళన చేయడమే. ఇలాంటి వారు ప్రజలకు మేలు చేస్తారని ఆశించడం హాస్యాస్పదమే అవుతుంది. ఉద్యోగులు, పోలీసుల దురుసు ప్రవర్తన అక్కడక్కడా చూస్తూనే ఉన్నాం. అధికార పార్టీ అండతో అడ్డూ అదుపు లేకుండా ప్రవర్తిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు. గతంలో ప్రభుత్వ అక్రమ వ్యవహారాలకు సహకరించి జైలు పాలైన ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల ఉదాహరణలు ఉండనే ఉన్నాయి.                   

- గౌస్‌ దేశాయ్‌, సీపీఎం జిల్లా కార్యదర్శి, కర్నూలు

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.