ఈ ప్యూర్‌కు నాంది ఆ కాల్‌

ABN , First Publish Date - 2022-10-03T08:20:53+05:30 IST

‘‘పీపుల్‌ ఫర్‌ రూరల్‌ అండ్‌ అర్బన్‌ ఎడ్యుకేషన్‌’... ‘ప్యూర్‌’... 2016లో దీనికి అంకురార్పణ జరిగింది.

ఈ ప్యూర్‌కు నాంది ఆ కాల్‌

మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన ఒక ఫోన్‌ కాల్‌... ఆమె ఆలోచనల్నే మార్చేసింది. ఆ మార్పు... వందల మంది చిన్నారులకు ఆసరా అయింది.  ‘జీరో పీరియడ్‌ పావర్టీ’ నినాదంతో... మొట్టమొదటిసారిగా మారథాన్‌ నిర్వహిస్తున్న ఎన్‌ఆర్‌ఐ... ‘ప్యూర్‌’ స్వచ్ఛంద సంస్థb వ్యవస్థాపకురాలు... శైల తాళ్లూరిని ‘నవ్య’ పలుకరించింది... 


‘‘పీపుల్‌ ఫర్‌ రూరల్‌ అండ్‌ అర్బన్‌ ఎడ్యుకేషన్‌’... ‘ప్యూర్‌’... 2016లో దీనికి అంకురార్పణ జరిగింది. ఒక చిన్నారికి... తన చదువుకు మధ్యలో ఏ అవరోధాలున్నా వాటిని అధిగమించేందుకు ప్రయత్నించే లక్ష్యంతో ఏర్పాటైన సంస్థ ఇది. ఉదాహరణకు కాళ్లు లేని పిల్లాడు స్కూల్‌కు వెళ్లడం కష్టం. అతడికి మేం చేయూతనందిస్తాం. ప్రభుత్వ బడుల్లో బెంచీలు, టాయ్‌లెట్‌లు, ల్యాబ్‌ల వంటి మౌలిక వసతులు కల్పిస్తాం. వ్యక్తిగత సమస్యలు... అంటే స్కూల్‌ ఫీజ్‌, మెస్‌ చార్జీలు కట్టలేకపోవడం, పుస్తకాలు, డ్రెస్‌లు కొనుక్కోలేకపోవడం వంటివన్నీ ‘ప్యూర్‌’కు సంబంధించిన అంశాలే. పేద విద్యార్థుల చదువుకు కావల్సిన వసతులన్నీ కల్పించడమే ధ్యేయంగా... 500 ప్రభుత్వ పాఠశాలలతో కలిసి పని చేస్తున్నాం. 


పుస్తకాలా... ప్లేట్లా...  

ఆలోచనకు పునాది... ఆరేడేళ్ల కిందట భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బాసిత్‌నగర్‌ తండా నుంచి వచ్చిన ఒక ఫోన్‌ కాల్‌. అక్కడి స్కూల్లోని 205 మంది విద్యార్థులకు నోట్‌బుక్స్‌ అవసరం ఉందంటే... ఇస్తానన్నాను. గంటలో మళ్లీ వాళ్ల దగ్గర నుంచి కాల్‌ వచ్చింది... ఏవో స్టీల్‌ ప్లేట్స్‌ కూడా కావాలని! ‘ఇందాకే కదా నోట్‌బుక్స్‌ ఇస్తానన్నాను... ఎన్ని అడుగుతారు’ అన్నాను. నేను పుట్టింది మా అమ్మమ్మ గారి ఊరు పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో అయినా... మా నాన్న ఉద్యోగ రీత్యా తెలంగాణ, ఏపీల్లోని పలు ప్రాంతాల్లో చదివాను. హైదరాబాద్‌లో చదువు అయిపోగానే 1998లో అమెరికా వెళ్లాను. ఫ్లోరిడాలో నివాసం. ప్రస్తుతం అక్కడి ఓ కంపెనీకి సీఓఓగా ఉన్నాను. చదివినదంతా కాన్వెంటుల్లోనే కావడంతో... స్కూళ్లల్లో అసలు ప్లేట్ల అవసరం ఏంటో కూడా నాకు తెలియలేదు. ఆ మర్నాడు ఆఫీ్‌సకు వెళుతుంటే అనిపించింది... ‘కనీసం ఎందుకు’ అని అడగాలన్న ఆలోచన కూడా రాలేదే అని! స్కూల్‌కు ఫోన్‌ చేస్తే తెలిసింది... అప్పటికే ఏడో తరగతి టీచర్‌.. పిల్లలతో ‘పుస్తకాలా..? ప్లేట్లా..? ఏదో ఒకటే ఇస్తానన్నారుట. ఏది కావాల’ని అడిగారట! దానికి పిల్లలు పుస్తకాలే కావాలని చెప్పారట. అది విని నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ తండాలో బడికి వచ్చిన తొలి తరం విద్యార్థులు వారు. మధ్యాహ్న భోజనం సమయంలో ఒక్కో ప్లేటులో నలుగురు తింటున్నారట. అంత ఆకలిలో కూడా చదువుకే ప్రాధాన్యం ఇచ్చారు. ఆ క్షణమే నిర్ణయించుకున్నా... ఇలాంటి విద్యార్థులందరికీ అండగా నిలవాలని! 


దేశవిదేశాల్లో... 

సాధ్యమైనంత మందికి సాయపడాలన్న ఉద్దేశంతో నా ఆలోచనల్ని మా చిన్ననాటి స్నేహితుల వాట్సప్‌ గ్రూప్‌ల్లో పంచుకున్నాను. దానికి వారందరూ ముందుకు వచ్చారు. అంతా కలిసి ఆ బడి రూపు రేఖలు మార్చేశాం. రంగులు వేశాం. వసతులన్నీ కల్పించాం. బడిని చూస్తే మాకే ఎంతో ఆనందం కలిగింది. అప్పుడు అనిపించింది... ఏదైనా ఒక సంస్థ నెలకొల్పి, దాని ద్వారా నిరంతరం సేవ చేయాలని! ఆ ఆలోచనతోనే ‘ప్యూర్‌’ నెలకొల్పాను. మేం ప్రారంభించి ఆరేళ్లే అయినా... ఇప్పుడు భారత్‌తో పాటు పది దేశాల్లో సేవలు అందిస్తున్నాం. అందరూ నాలాగా ఉద్యోగాలు చేసుకొంటూ... దీని కోసం పని చేసేవారు. 


‘పీరియడ్‌ పావర్టీ’... 

సంస్థ కార్యక్రమాల్లో భాగంగా పల్లెల్లో తిరుగుతున్నప్పుడు మాకు ఒక విషయం తెలిసింది. అదేంటంటే ఏడో తరగతి తరువాత స్కూల్‌కు వచ్చే ఆడపిల్లల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోందని! అప్పటి వరకు బాగున్న హాజరు ఉన్నట్టుండి ఎందుకు తగ్గిపోతుందని ఆరాతీస్తే... రుతుక్రమ సమయంలో సమస్యలని తెలిసింది. పిల్లలు, తల్లితండ్రులకు దీనిపై సరైన అవగాహన, స్కూళ్లలో టాయిలెట్స్‌ వంటి వసతులు లేకపోవడం, బిడియంతో నలుగురిలో మాట్లాడలేకపోవడం, సమాజంలో పాతుకుపోయిన కొన్ని నమ్మకాల వంటి కారణాలు ఎన్నో! ఒక అమ్మాయిని బతికించాలన్నదే కాదు... వాళ్లకు మెరుగైన జీవితం, విద్య, ఆరోగ్యం, గౌరవం ఇవ్వడం కూడా ముఖ్యమే. రుతుక్రమంలో ఇబ్బందుల వల్ల చాలామంది అమ్మాయిలు బడి మానేస్తున్నారు. ‘మెనుస్ట్రుల్‌ హైజీనిక్‌’పై అవగాహన లేకపోవడం, ప్యాడ్స్‌ లాంటివి అందుబాటులో లేకపోవడం, వాటిని కొనగలిగే ఆర్థిక స్థోమత లేకపోవడం... వీటన్నిటినీ ‘పీరియడ్‌ పావర్టీ’గానే పరిగణిస్తారు. రుతుస్రావ సమస్యలతో ఆడపిల్లలు నెలకు మూడు నుంచి ఐదు రోజులు బడికి వెళ్లలేకపోతున్నారు. ఈ సమస్య భారత్‌లోనే కాదు... అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఉంది. 


ఆ పరిస్థితి మారాలి... 

ఒక ఆడపిల్ల తన జీవిత కాలంలో సగటున 2,500 రోజులు, అంటే దాదాపు ఏడేళ్లు బ్లీడింగ్‌తో ఇబ్బంది పడుతుంది. కనుక అందుబాటులో ఉన్నదాన్ని ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి? ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? అనేవి ప్రతి ఆడపిల్లా తెలుసుకోవాలి. దాని కోసం ఇప్పటి వరకు 800 అవగాహనా సదస్సులు నిర్వహించాం. అన్నీ పల్లెల్లోనే. దిగ్ర్భాంతికర విషయమేమంటే... ములుగులో ఇప్పటికీ కొందరు పీరియడ్స్‌ను మేనేజ్‌ చేసుకోవడానికి ఆవుపేడ వాడుతున్నారు. అమెరికాలో అయితే సాక్స్‌, ప్లాస్టిక్‌ బ్యాగ్‌లు ఉపయోగిస్తున్నారు. ఎంత దారుణం! ఇదంతా పేదరికంవల్ల. అవగాహన లేకపోవడంవల్ల. ఈ పరిస్థితి మారాలి. దాని కోసం మేం ‘పీరియడ్‌ ఏటీఎమ్స్‌’ లాంటివి ఏర్పాటు చేశాం. నిర్మల్‌, నల్లగొండల్లో రెండు శానిటరీ నేప్కిన్‌ తయారీ యూనిట్స్‌ నెలకొల్పాం. విద్యార్థుల తల్లితండ్రులకు ఉపాధి కల్పించాం. మేం తయారు చేసేవన్నీ బనానా ఫైబర్‌తో రూపొందించిన, పర్యావరణహితమైన బయోడీగ్రేడబుల్‌ ఉత్పత్తులే. ప్రస్తుతం మా సంస్థలో వెయ్యి మందికి పైగా వాలంటీర్లున్నారు.  


‘ప్యూర్‌’ ఉండకూడదు... 

మా ప్రధాన లక్ష్యం... భవిష్యత్తులో ‘ప్యూర్‌’ అనేది ఉండకూడదు. అంటే దాని అవసరం లేని విధంగా ఈ సమాజంలో మార్పు రావాలన్నది మా ఆకాంక్ష. దాని కోసం ‘సస్టెయినబుల్‌ ఎంపవర్‌మెంట్‌’ పేరిట నిరంతరం కృషి చేస్తున్నాం. అంటే ఏదో నాలుగు రోజులువ వెళ్లి, సదస్సులు పెట్టేసి, కావల్సినవి సమకూర్చి వచ్చేస్తే సరిపోదు. కోరుకున్న మార్పు రావాలంటే మొదట మనం చేసే పని గురించి అందరికీ తెలియాలి. చేపట్టిన పని లక్ష్యం నెరవేరుతుందో లేదో పరిశీలించాలి. దానికి నిరంతరాయంగా నిధులు అందేలా చూడాలి. అయితే ఇది ఒక్కరితో అయ్యేది కాదు. ప్రభుత్వం, ప్రజలు కలిసి... బాధ్యతగా తీసుకొని అంతా ఒకే సమస్యపై గళమెత్తితేనే మార్పు సాధ్యమవుతుంది. అలాంటి మార్పును కాంక్షిస్తూ ‘ప్యూర్‌’ను ముందుకు నడిపిస్తున్నాం. 

హనుమా 


గట్టిగా వినిపించేందుకే... ‘ప్యూరథాన్‌’... 

గతంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితి కొంత మెరుగైంది. కనీసం దీని గురించి మాట్లాడగలుగుతున్నాం. ఒక్కటి గమనించాలి... ‘పీరియడ్‌ పావర్టీ’ అనేది ఆడవాళ్ల సమస్య మాత్రమే కాదు. ఇది అందరికీ, అన్ని వర్గాలకీ సంబంధించిన సమస్య. ప్రతి ఆడపిల్లా ప్రతి నెలా పడుతున్న బాధ. మగవాళ్లు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలి. ఎందుకంటే ఇంట్లో తల్లి, సోదరి, భార్య ఉంటారు కదా! వాళ్లకు సౌకర్యవంతమైన జీవితం అందించడం వారి బాధ్యత. ఇదే విషయాన్ని గట్టిగా చెప్పేందుకు ఈ నెల 9న హైదరాబాద్‌, విజయవాడల్లో ‘ప్యూరథాన్‌’ పేరిట ‘10కె, 5కె రన్‌’ నిర్వహిస్తున్నాం. తద్వారా ‘రుతుస్రావం అనేది చాలా సాధారణ విషయం. మీ ఇబ్బందులు చెప్పేందుకు మొహమాట పడాల్సిన పనిలేదు’ అని ఆడపిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించే ప్రయత్నం చేస్తున్నాం. 

Updated Date - 2022-10-03T08:20:53+05:30 IST