అది ఫోర్జరీ సంతకమే

ABN , First Publish Date - 2021-11-11T07:35:00+05:30 IST

తిరుపతి కార్పొరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో ఏడో డివిజన్‌ నామినేషన్‌ ఉపసంహరణ పత్రంలో చేసిన సంతకం ఫోర్జరీదేనని రాష్ట్ర ప్రభుత్వ ఫోరెన్సిక్‌ సైన్స్‌ స్పష్టంచేసింది.

అది ఫోర్జరీ సంతకమే
కార్పొరేషన్‌ ఎన్నికల సందర్భంగా ఫోర్జరీ సంతకంతో నామినేషన్‌ ఎలా విత్‌డ్రా చేస్తారంటూ ఆర్వోను నిలదీస్తున్న విజయలక్ష్మి, ఆమె భర్త మధు (ఫైల్‌ ఫొటో)

తిరుపతి ఏడో డివిజన్‌ టీడీపీ అభ్యర్థి నామినేషన్‌ ఉపసంహరణ పత్రంలో సంతకంపై ఫోరెన్సిక్‌ నివేదిక


తిరుపతి, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): తిరుపతి కార్పొరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో ఏడో డివిజన్‌ నామినేషన్‌ ఉపసంహరణ పత్రంలో చేసిన సంతకం ఫోర్జరీదేనని రాష్ట్ర ప్రభుత్వ ఫోరెన్సిక్‌ సైన్స్‌ స్పష్టంచేసింది. ఆమేరకు జిల్లా కోర్టుకు సీల్డుకవర్‌లో నివేదిక పంపింది. అసలు సంతకంతో విత్‌డ్రాయిల్‌ దరఖాస్తులోని సంతకాన్ని మాగ్నిఫైయర్లు, స్టీరియో మైక్రోస్కోప్‌, వీడియో స్పెక్ట్రల్‌ కంపారిటర్ల కింద పరిశీలించిన అనంతరం ఫోరెన్సిక్‌ సైన్స్‌ రెండు సంతకాలలో తేడాలను గమనించింది. తిరుపతి కార్పొరేషన్‌ ఎన్నికల్లో అధికార పార్టీ అరాచక చర్యలకు అద్దంపట్టేలా ఫోరెన్సిక్‌ నివేదిక రావడం పట్ల బాధిత అభ్యర్థి హర్షం వ్యక్తంచేస్తున్నారు. వివరాలలోకి వెళితే.. ఈఏడాది మార్చిలో జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియల్లో 7వ డివిజన్‌ టీడీపీ అభ్యర్థి విజయలక్ష్మి సంతకాన్ని కొందరు ఫోర్జరీ చేసి నామినేషన్‌ను ఉపసంహరించారు. ఇది తెలుసుకున్న విజయలక్ష్మి, ఆమె భర్త టీడీపీ నేత పెరుమాల్‌ మధు కార్పొరేషన్‌ కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారిని నిలదీశారు. తన సంతకాన్ని మురళి అనే వ్యక్తి ఫోర్జరీ చేసి నామినేషన్‌ను విత్‌డ్రాచేశారంటూ ఎన్నికల అధికారులను నిలదీశారు. తమకు న్యాయం జరగకపోతే కార్పొరేషన్‌ కార్యాలయం ముందే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. విజయలక్ష్మికి జరిగిన అన్యాయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న రాష్ట్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243కే ప్రకారం కమిషన్‌ తన పూర్తి అధికారాలను వినియోగించుకుంది. 7వ డివిజన్‌ ఎన్నికలను ఆపాలంటూ జిల్లా ఎన్నికల అధికారుకులకు ఆదేశాలు జారీచేసింది. ఈక్రమంలో తిరుపతి ఈస్టు పోలీస్‌ స్టేషన్లో ఆర్వోతోపాటు మురళిపై విజయలక్ష్మి ఫిర్యాదు చేశారు. అయితే  ఆర్వోపై ఫిర్యాదుచేస్తే స్పందించలేమని పోలీసులు తేల్చిచెప్పేశారు. తమ నామినేషన్‌ ఫారాల్లోని సంతకాలను ఆర్వో బయట పెట్టడం వలనే ఫోర్జరీ చేసేవాళ్లకు సులభమైందనేది బాధితుల వాదన. దీంతో ఫోర్జరీ అరోపణలు ఎదుర్కొన్న మురళిపై ఫిర్యాదుచేశారు. ఇరువర్గాలు కోర్టును ఆశ్రయించాయి. ఫోర్జరీ సంతకమో కాదో తేలేందుకు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నివేదిక కావాలని కోర్టు ఆదేశించింది. ఫోరెన్సిక్‌ నివేదిక టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా వచ్చిన నేపథ్యంలో పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేయాల్సి ఉంది. కాగా, కుప్పం ఎన్నికల్లోనూ టీడీపీకి చెందిన కొందరి నామినేషన్లను ఫోర్జరీ సంతకాలతో ఉపసంహరించారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ ఫోరెన్సిక్‌ నివేదిక రావడం గమనార్హం. 


ఇకనైనా ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించండి 

మా పోరాటంలో న్యాయం ఉంది కాబట్టే ఎస్‌ఈసీ ప్రజాస్వామ్యానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. అధికార పార్టీ ఎన్నో ప్రలోభాలకు గురిచేసినా మేము తలొగ్గక పోవడంతో అధికారులతో కుమ్మక్కై చివరకు ఫోర్జరీ సంతకంతో ఉపసంహరించారు. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నివేదిక కూడా అది ఫోర్జరీ సంతకమని తేల్చేసింది. ఇప్పటికైనా వైసీపీ నేతలు ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలి. 

- విజయలక్ష్మి, 7వ డివిజన్‌ అభ్యర్థి

Updated Date - 2021-11-11T07:35:00+05:30 IST