చర్యలు తీసుకోకుంటే..కొంపలేమీ మునిగిపోవు

ABN , First Publish Date - 2022-08-09T09:36:26+05:30 IST

హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ అశ్లీల వీడియో వ్యవహారంపై ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకోకుంటే కొంపలేమీ మునిగిపోవని ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్ప ష్టం చేశారు.

చర్యలు తీసుకోకుంటే..కొంపలేమీ మునిగిపోవు

  • అది మాధవ్‌ ప్రైవేటు వ్యవహారం!
  • మార్ఫింగ్‌ కాదని తేలాకే చర్యలు
  • ముందు ఓటుకు నోటు కేసు తేల్చాలి
  • ప్రభుత్వ సలహాదారు సజ్జల వ్యాఖ్యలు

అమరావతి, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ అశ్లీల వీడియో వ్యవహారంపై ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకోకుంటే కొంపలేమీ మునిగిపోవని ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్ప ష్టం చేశారు. ఇదేమీ అంత సీరియస్‌ అం శం కాదన్నారు. వీడియో నిజమైందేనని నిరూపించే బాధ్యత.. ఆరోపణలు చేసినవారిపైనే ఉందని చెప్పారు. సోమవారమిక్కడ తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. మాధవ్‌ అశ్లీల వీడియో ప్రస్తావన వచ్చిన వెంటనే.. ఇది నాలుగు గోడల మధ్య జరిగిన ప్రైవేటు వ్యవహారంగా ఆయన కొట్టివేశారు. తనను లైంగిక వేధింపులకు గురిచేశారంటూ మాధవ్‌పై ఆరోపణలు చేస్తూ ఎవరూ ముందుకు రాలేదని.. ఈ వీడియోను ఎంపీ  ఖండిస్తున్నారని.. పోలీసు దర్యాప్తు కోరారని, వీడియోలో ఉన్నది తాను కాదని.. మార్ఫింగ్‌ అంటూ సవాల్‌ చేస్తున్నారని అన్నారు. 


వాస్తవానికి 2015లో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తెలంగాణలో ఓటు కొనుగోలు వ్యవహారంలో అప్పటి తెలుగుదేశం నేత రేవంత్‌రెడ్డి సూట్‌ కేసులతో అడ్డంగా దొరికిపోయారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో ‘..మన వాళ్లు బ్రీఫ్డ్‌ మీ’ అంటూ గొంతు వినిపించిందని.. అది తనదో కాదో చంద్రబాబు చెప్పడం లేదన్నారు. ఈ కేసు ఏడేళ్లుగా కొనసాగుతోందం టూ మాధవ్‌ వీడియోకూ, ఈ అంశానికీ సజ్జల ముడిపెట్టారు. రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందని ప్రచారం చేస్తూ.. ప్రజల దృష్టిని మళ్లించేందుకే టీడీపీ ఇలాంటి డ్రామాలకు తెరతీస్తోందని ఆరోపించారు. ఎంపీ అశ్లీల వీడియో ఘటనపై విచారణ జరుగుతోందని చెప్పారు. వీడియో మార్ఫింగ్‌ కాదని తేలితే చర్యలు తీసుకుంటామని.. తొందరేముందని ప్రశ్నించారు. ముం దుగా 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కొనుగోలు చేసేందుకు ప్రయత్నించినప్పుడు చంద్రబాబు మా ట్లాడారో లేదో తేలాల్సి ఉందని అన్నారు. మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి అవం తి శ్రీనివాస్‌ వ్యవహారంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుందని చెప్పారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు ఆడియో టేపు బయటకు వచ్చిన వెంటనే.. చంద్రబాబు ఏపీకి వచ్చేశారని.. అప్పట్లో కేసీఆర్‌కు ఆయనకు మధ్య ఏం అవగాహన కుదిరిందో తెలియదన్నారు. రాష్ట్రం విడిచిపెడితే చాలని చంద్రబాబుకు కేసీఆర్‌ చెప్పారేమోనని సజ్జల వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-08-09T09:36:26+05:30 IST