అది విదేశీ పాలన కాదు

Published: Fri, 25 Mar 2022 00:33:10 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అది విదేశీ పాలన కాదు

పంజాబ్ కేసరి లాలా లజపత్ రాయ్ (1865–1928) లాల్, బాల్, పాల్ త్రయంలో ఒకరు. ‘గ్రంథకర్త, పత్రికా సంపాదకుడు, సంఘ సంస్కర్త, రాజకీయాలలో నిధి, ఆర్థిక విషయాలలో నిష్ణాతుడు. గాంధీజీ భారత రంగంలో పాదం పెట్టక ముందే అస్పృశ్యతా నివారణకు, స్త్రీ జనోద్ధరణకు, కుల విభేదాల నిర్మూలనకు లాలాజీ కృషి చేశారు’. భారత జాతీయోద్యమ చరిత్రను ఒక విశాల దృక్పథంతో వివరిస్తూ గత శతాబ్ది రెండో దశాబ్దంలో అమెరికా ప్రవాస జీవిత కాలంలో లజపత్ రాయ్ రాసిన ‘యంగ్ ఇండియా’ గ్రంథం నుంచి కొన్ని భాగాలు:

అది విదేశీ పాలన కాదు

భారత్‌లో మహమ్మదీయుల పాలన ఆరు శతాబ్దాల పాటు వర్థిల్లింది. 13 నుంచి 16వ శతాబ్దం వరకు వారి పాలన ఉత్తర భారతావనికే పరిమితమయింది. అక్బర్ చక్రవర్తి సువిశాల భారతదేశ మంతటా తన ఆధిపత్యాన్ని నెలకొల్పేంతవరకు దక్కన్, రాజ్ పుఠానా, మధ్య భారతం చాలవరకు స్వతంత్రంగా ఉండేవి. ఉదయపూర్ పాలకుడు రాణా ప్రతాప్‌ను తన సామంతుడిగా చేసుకోవడంలో అక్బర్ విఫలమయ్యాడు. ఓడిపోయి, అడవుల్లో తలదాచుకున్న ప్రతాప్‌ను అక్బర్ సేనలు వెంటాడి వేధించాయి. అయినా అక్బర్‌కు లొంగిపోయేందుకు ఆ రాజపుత్రవీరుడు తిరస్కరించాడు. మహావీరుడుగా రాణా ప్రతాప్‌ను నేడు ఆయన దేశ ప్రజలు ఆరాధిస్తున్నారు. 


భారత్‌లో ముస్లిం పాలనను ‘విదేశీ పాలన’ అనడం సరికాదు. నార్మన్లు, డేన్‌లు ఇంగ్లాండ్‌కు వచ్చినప్పుడు ఎలా విదేశీయులో ముస్లిం ఆక్రమణదారులు తమ మూలాల్లో నిస్సందేహంగా విదేశీయులే. అయితే వారు భారత్‌లో స్థిరపడిన వెంటనే భారత్‌ను తమ సొంత దేశంగా చేసుకున్నారు. భారతీయ స్త్రీలను వివాహం చేసుకున్నారు. తమ పిల్లలను భారతీయులుగా పెంచారు. అచిర కాలంలోనే భూమి పుత్రులుగా పరిణమించారు. తైమూర్, నాదిర్ షా, అహ్మద్ షా అబ్దాలీ భారత్‌పై దాడి చేసినప్పుడు వారు భారతీయ ముస్లింల పాలనలో ఉన్న ఒక రాజ్యంపైనే దాడి చేశారు. వారు హిందువులకు ఎంత శత్రువులో భారతీయ మహమ్మదీయ పాలకులకు కూడా అంతే శత్రువులు.


13వ శతాబ్దం నుంచి 19వ శతాబ్ది మధ్యనాళ్ళ దాకా భారత్‌లో రాజకీయ సౌర్వభౌమత్వాన్ని చెలాయించిన ముస్లింలు జన్మతః భారతీయులు. వివాహ రీత్యా భారతీయులే. ఆఖరుకు భారతీయులుగానే వారు మరణించారు. ముస్లిం రాజులు, చక్రవర్తులు తమ ఆదాయంలో ప్రతి పైసాను భారత్‌లోనే ఖర్చు చేశారు. వారి సైన్యాలు పూర్తిగా భారతీయమైనవే. హిందుస్థాన్ సరిహద్దులకు ఆవల నుంచి ముస్లిం కుటుంబాలు భారత్‌కు వచ్చి స్థిరపడేందుకు ముస్లిం రాజులు అనుమతించారు. అయితే అలా వచ్చిన వారు భారత్‌లో స్థిరపడి, ఈ దేశాన్ని తమ మాతృదేశంగా చేసుకునేందుకు నిరాకరించిన వారిని చాలా చాలా అరుదుగా మాత్రమే తమ కొలువులో నియమించుకున్నారు. ఇస్లాం మతానికి మారిన ఇతర మతస్థులకు అసలు ముస్లింల కంటే కూడా ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. షేర్షా, అక్బర్, జహంగీర్, షాజహాన్ మొదలైన వారి పాలనలో హిందువులను అత్యున్నత స్థాయి పదవులలో నియమించారు. రాష్ట్రాల గవర్నర్లుగాను, సైన్యాలకు ప్రధానాధికారులుగాను హిందువులు ఉండేవారు. ముస్లింలు, హిందువుల మధ్య రాజకీయ, సామాజిక అంతరాలు ఉండేవి కావు. ఆర్థిక, రాజకీయ కోణం నుంచి చూస్తే హిందువుల పాలనలో వలే ముస్లింల సర్కార్ కూడా పూర్తిగా దేశీయ ప్రభుత్వంగానే ఉండేది. ప్రజలను నిరాయుధులగా చేసేందుకు ముస్లిం పాలకుల ఎన్నడూ ప్రయత్నించలేదు. ఆయుధాల ఉత్పత్తిని, దిగుమతిని నిషేధించలేదు. వారు తమ సేవకులను అరేబియా, పర్షియా లేదా ఆఫ్ఘాన్ నుంచి నియమించుకోలేదు. వారు తమ సొంత భాషను, సాహిత్యాన్ని భారత్‌కు తీసుకువచ్చారు. కొంతకాలం ప్రభుత్వ వ్యవహారాలన్నిటినీ ఆ భాష ద్వారానే నిర్వహించేవారు. అంతిమంగా వారు ఒక కొత్త భాషను అభివృద్ధిపరిచారు ఇతర భారతీయ భాషల వలే అది కూడా భారతీయ భాషే. అదే ఉర్దూ లేదా హిందుస్థానీగా పిలవబడుతున్న ఆ భాష సంపూర్ణంగా భారతీయ భాషే.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.