Gyan Vapi Mosque Row : అది ఫౌంటేన్ : అసదుద్దీన్ ఒవైసీ

ABN , First Publish Date - 2022-05-18T20:10:47+05:30 IST

ఉత్తర ప్రదేశ్‌లోని జ్ఞానవాపి మసీదులో శివలింగం బయటపడినట్లు

Gyan Vapi Mosque Row : అది ఫౌంటేన్ : అసదుద్దీన్ ఒవైసీ

న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్‌లోని జ్ఞానవాపి మసీదులో శివలింగం బయటపడినట్లు హిందూ సంస్థలు చేస్తున్న ప్రచారాన్ని ఏఐఎంఐఎం  చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు. ఆయన బుధవారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ఈ మసీదులో ముస్లింలు మతపరమైన కార్యక్రమాలను నిర్వహించడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందని, అంటే తాము అక్కడ వాజు చేయవచ్చునని చెప్పారు. అది ఫౌంటేన్ అని చెప్పారు. ఇది ఇలాగే కొనసాగితే తాజ్ మహల్‌లోని అన్ని ఫౌంటెన్లను మూసివేయక తప్పదన్నారు. దేశాన్ని 1990వ దశకానికి తీసుకెళ్ళాలని బీజేపీ కోరుకుంటోందన్నారు. అప్పట్లో అల్లర్లు జరిగాయని గుర్తు చేశారు. 


వారణాసి కోర్టు ఆదేశాల మేరకు జ్ఞానవాపి మసీదులో సర్వే జరిగిన సంగతి తెలిసిందే. ఈ సర్వేలో ఓ బావిలో శివలింగం కనిపించిందని హిందూ సంస్థలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రదేశాన్ని పరిరక్షించాలని, నమాజు చేయరాదని వారణాసి కోర్టు ఆదేశించింది. అనంతరం ఈ మసీదు కమిటీ అంజుమన్ ఇంతెజామియా మస్జిద్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వాజు ఖానాలో కాళ్ళు, చేతులను శుభ్రం చేసుకోకుండా నమాజు ఏవిధంగా చేయగలమని ప్రశ్నించింది. ట్రయల్ కోర్టులో ప్రొసీడింగ్స్‌ను పూర్తిగా నిలిపేయాలని కోరింది. 


ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ, రక్షణలో ఉన్న భాగానికి నష్టం కలిగించకుండా వాజు నిర్వహించుకోవచ్చునని చెప్పారు. రక్షిత స్థలంలోకి ఎవరైనా వెళితే శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 


ట్రయల్ కోర్టులో ప్రొసీడింగ్స్‌ను నిలిపేసేందుకు సుప్రీంకోర్టు మంగళవారం అంగీకరించలేదు. శివలింగం కనిపించినట్లు చెప్తున్న ప్రదేశాన్ని పరిరక్షించాలని, కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని వారణాసి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. జ్ఞానవాపి మసీదులో నమాజు చేయకుండా ముస్లింలను నిరోధించరాదని తెలిపింది. మతపరమైన కార్యక్రమాలను ముస్లింలు నిర్వహించుకోవచ్చునని తెలిపింది.


Updated Date - 2022-05-18T20:10:47+05:30 IST