దేవుడు కోరుకొనేది!

ABN , First Publish Date - 2021-07-30T05:30:00+05:30 IST

ఇళ్ళలో, ప్రార్థనా మందిరాలలో దైవాన్ని ఆరాధిస్తున్నప్పుడు చాలామంది ఆలోచనల్లో ఏవేవో కోరికలు కదులుతూ

దేవుడు కోరుకొనేది!

ఇళ్ళలో, ప్రార్థనా మందిరాలలో దైవాన్ని ఆరాధిస్తున్నప్పుడు చాలామంది ఆలోచనల్లో ఏవేవో కోరికలు కదులుతూ ఉంటా యి. అవన్నీ ఈ భూమి మీద మనకు అవసరమనుకుంటున్న ప్రయోజనాలకు సంబంధించినవే అయి ఉంటాయి. మన కోరికలను ఆయన ముందు వ్యక్తపరుచుకుంటాం. వాటిని తీర్చాల్సిందిగా మొరపెట్టుకుంటాం. మరి మన నుంచి దైవం ఆశిస్తున్నదేమిటనేది పట్టించుకోం. ‘దేవుడు సర్వశక్తి సంపన్నుడు. ఆయనకు ఇవ్వడానికి మన దగ్గర ఇవ్వడానికి ఏముంటుంది?’ అనుకుంటాం. మనం ఆశించేవి ధనం, వస్తువులే కాబట్టి వాటినే దైవానికి కూడా సమర్పిస్తాం. అలా చేస్తే మరిన్ని సౌఖ్యాలు మనకు కలుగుతాయని భావిస్తాం. మరి దైవం కోరుకొనేది ఏమిటి? 


బైబిల్‌లోని ‘మీకా’ అధ్యాయాన్ని పరిశీలిస్తే... ‘‘ఓ మానవుడా! ఆయన నీకు ఏది మంచిదనేది తెలియబరిచాడు. బదులుగా యెహోవా నిన్ను అడుగుతున్నదేమిటి? న్యాయంగా నడవాలని... విశ్వసనీయతను ప్రేమించాలని... అణకువగా దైవంతో కలసి నడవాలని!’’  అనే పంక్తుల్లో ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. అందరూ న్యాయబద్ధమైన జీవనాన్ని సాగించాలి. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇతరులను మోసగించడం, వారికి అన్యాయం చేయడం క్షమార్హం కాదు. రెండవది... ప్రతి పనిలోనూ, ఇతరులతో వ్యవహరించే ప్రతి సందర్భంలోనూ విశ్వసనీయత ఉండాలి. ప్రతి చర్యలోనూ విశ్వసనీయతను ప్రేమించాలి.


అలాగే... అహంకారాన్ని విడిచిపెట్టాలి. దైవం పట్ల అణకువతో, విధేయతతో వ్యవహరించాలి. మనకు మంచిదని యెహోవా చెప్పిన దారిలో పయనించాలి. ఇదే దైవం మన నుంచి కోరుకొనే కానుక. దైవ ప్రసన్నత కోసం మనం మనస్ఫూర్తిగా సమర్పించాల్సిన కానుక. దైవాన్ని ఆరాధించి, విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాం కాబట్టి ఆయన మన స్వప్రయోజనాలను నెరవేర్చాలని ఆశించకూడదు. మనం చేసే పనుల ద్వారా ఆయనకు ఆనందం కలిగించాలి. ఆదర్శప్రాయులైన విశ్వాసులుగా మెలగాలి. దైవవాక్యం పట్ల విధేయులుగా మెలగినప్పుడు అర్హమైన కానుకలను ఆయన ప్రసాదిస్తాడు.


Updated Date - 2021-07-30T05:30:00+05:30 IST