అది మీకే సంభవం!

Published: Sat, 28 May 2022 03:16:36 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అది మీకే సంభవం!

ఆయన...

వెండి తెరపై సాక్షాత్కరించిన శ్రీకృష్ణుడు..

తెలుగువారికే ప్రత్యేకమైన శ్రీరాముడు..

తిరుగులేని, ఎదురులేని కథానాయకుడు!


ఆయన...

మూర్తీభవించిన తెలుగుదనం..

ఆత్మాభిమానానికి ప్రతిరూపం..

తెలుగు జాతికే గర్వకారణం!


ఆయన...

రాజకీయ యవనికపై సంచలనం..

సంక్షేమ పాలనపై తొలి సంతకం

సంచలన సంస్కరణలకు సారథి!


ఆయన అసాధ్యుడు..

అనితర సాధ్యుడు!

అన్యులెవరికీ అసంభవం! 

ఇంతటి ఘనచరితను సృష్టించడం 

ఆయనకు మాత్రమే సంభవం!


ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలకు నేడు శ్రీకారం చుడుతున్న సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న ప్రత్యేక కథనాలు...


రెండు ఉద్యోగాలు.. మూడు వ్యాపారాలు

ఎన్టీఆర్‌ తండ్రి లక్ష్మయ్యచౌదరి కొనుగోలు చేసిన ఇంట్లో  సూర్యనారాయణ అనే వ్యక్తి కుటుంబంతో అద్దెకు ఉండేవారు. ఆ తర్వాత వారు ముంబై వెళ్లి వ్యాపారంలో స్థిరపడ్డారు. వ్యాపార భాగస్వాములు మోసం చేసి, దొంగకేసు పెట్టడంతో ఆయన అరెస్టయ్యారు. దీంతో ఎన్టీఆర్‌ను ఆ కుటుంబానికి సాయంగా ముంబై పంపారు. అక్కడ ప్రతిరోజు ఆయన 8 కిలోమీటర్లు నడిచి కోర్టుకు వెళ్లేవారు. కోర్టుకు అవసరమైన పత్రాలన్నీ చక్కగా అందించడంతో ఆ కేసు నుంచి సూర్యనారాయణ నిర్దోషిగా బయటపడ్డారు. ఆ సమయంలోనే ఎన్టీఆర్‌ ముంబైలో ఒక మెస్‌ పెట్టారు. తండ్రికి ఇష్టంలేకపోవడంతో నెలలోనే దానిని వదిలేశారు. ఆ తర్వాత విజయవాడలో పొగాకు వ్యాపారంలో అనుభవం ఉన్న మిత్రుడు బబ్బూరి వెంకయ్యతో కలిసి ఆ వ్యాపారం ప్రారంభించారు. వెంకయ్య మరణంతో అదీ ఆగిపోయింది. అనంతరం ఒక ప్రింటింగ్‌ ప్రెస్‌ నడిపారు. దానిలో నష్టం రావడంతో అది మూసేశారు.  బీఏ చేస్తుండగానే గన్నవరం విమానాశ్రయంలో ఐఏసీటీ క్యాడెట్‌గా శిక్షణ పొందారు. విమానాశ్రయంలో ఫ్లైయింగ్‌ ప్రాక్టికల్స్‌ కూడా జరిగాయి. ఆ తర్వాత కింగ్స్‌ కమిషన్‌ సంస్థ ఎయిర్‌ ఆఫీసర్‌ ఉద్యోగానికి ఎంపికయ్యారు. మిలటరీ సర్వీసుకు వెళ్లొద్దని  భార్య బసవతారకం, తల్లిదండ్రులు అడ్డు చెప్పడంతో ఎన్టీఆర్‌ వెళ్లలేదు. ఆ తర్వాత సబ్‌ రిజిస్ర్టార్‌గా నియమితులయ్యారు. 1947 అక్టోబరులో ఆయన గుంటూరు సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో సబ్‌ రిజిస్ర్టార్‌గా అడుగుపెట్టారు. ఉద్యోగంలో చేరిన తొలిరోజునే... ఆయన కోటులో ప్యూను కొంత డబ్బు పెట్టారు. అది ఆరోజు కలెక్షన్‌ అన్నమాట. ఈ పద్ధతి ఎన్టీఆర్‌కు నచ్చలేదు. దీంతో ‘నా ఆత్మను, నా కళను ఈ ఆఫీసులో అమ్ముకుని బతకాల్సి వస్తోంది’ అని  మిత్రుడు కొంగర జగ్గయ్యకు రాసిన లేఖలో ఎన్టీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.  మరోవైపు సినిమా అవకాశాల కోసం గట్టిగా ప్రయత్నించాలనుకున్నారు. ఇంట్లో అందరితోనూ మాట్లాడి మద్రాసు వెళ్లే రైలెక్కేశారు. ఇక వెనుతిరిగి చూడలేదు.


ఒకే ఒక్కనెలలో ముంబైలో మెస్‌! కొన్నాళ్లపాటు పొగాకు వ్యాపారం! ఆ తర్వాత నష్టాల్లో నడిచిన ప్రింటింగ్‌ ప్రెస్‌! 11 రోజులపాటు చేసిన సబ్‌ రిజిస్ట్రార్‌ ఉద్యోగం! మిలిటరీ సర్వీసులో చేరే అవకాశం! సినిమాల్లోకి రాకముందు ఎన్టీఆర్‌ చేసిన పనులు ఇవి! టాక్సీలు కట్టించుకుని వస్తే..

 ఇచ్చింది రూ.5 వేలు

తొలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి నిధుల్లేవు. ఎంపిక చేసిన అభ్యర్థులను హైదరాబాద్‌ రావాలని పిలిచినప్పుడు భారీగా నగదు ఇస్తారనుకుని చాలామంది అభ్యర్థులు టాక్సీలు కట్టించుకుని పెద్ద సూట్‌కేసులతో వచ్చారు. అయితే, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు రూ.5వేలు చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. మరో విడతలో ఇంకో రూ.5వేలు ఇచ్చారు. మిగతా అభ్యర్థులకు ఆ మొత్తం కూడా లేదు. సొమ్ము పంచే బాధ్యతను ఎన్టీఆర్‌ బావమరిది రుక్మాంగదరావుకు అప్పగించారు. అభ్యర్థులకు తెలుగుదేశం పాటలు, ఎన్టీఆర్‌ ప్రసంగాల క్యాసెట్లు, పోస్టర్లు, కరపత్రాలు ఇచ్చి పంపించారు. డబ్బులు ఇవ్వకపోయినా ఎన్టీఆర్‌ ప్రభావం, ఆయన గాలిలో 200 సీట్లను తెలుగుదేశం పార్టీ గెల్చుకుంది. 


బాలకృష్ణ, రామకృష్ణల పెళ్లిళ్లకూ పోలేదు..

1982 డిసెంబరు 8న ఎన్టీఆర్‌ ఇంట్లో పెళ్లిబాజాలు మోగాయి. బాలకృష్ణ వసుంధరను, రామకృష్ణ జయశ్రీని తిరుమలలో వివాహం చేసుకున్నారు. పెళ్లి సంబంధాల విషయంలో అన్నీ మాట్లాడిన ఎన్టీఆర్‌.. అప్పటికే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్నందున వారి వివాహాలకు మాత్రం హాజరుకాలేకపోయారు. వధూవరులను ఫోన్‌లో ఆశీర్వదించారు. దీంతో ప్రజాసేవ పట్ల ఎన్టీఆర్‌ అంకితభావానికి మరో రుజువు ప్రజల ముందు ఆవిష్కృతమైంది. రక్తం కారుతున్నా ఆగని ప్రచారం

ఎన్టీఆర్‌ మహా మొండిఘటం. చిత్తూరు జిల్లాలో ప్రచారం చేస్తుండగా గుర్రంకొండలో ఏర్పాటు చేసిన స్టేజీపై చాలామంది ఎక్కారు. దీంతో... వేదిక కూలిపోయింది. ఎన్టీఆర్‌ కాలికి గాయమై, రక్తం ధారగా కారింది. గాయాన్ని పట్టించుకోకుండా, కార్యకర్తలు వద్దని చెప్పినా చైతన్యరథంపైకి ఎక్కి ఎన్టీఆర్‌ ఉపన్యసించారు. ఆ తర్వాత కూడా ఎన్నికల ప్రచారంలో ఆయనకు మరో రెండుసార్లు దెబ్బలు తగిలాయి. అయినా, వాటిని ఏమాత్రం లెక్క చేయకుండా ఆయన ప్రచారం కొనసాగించారు.  ఒకసారి చైతన్యరథంలో ఏకబిగిన 23 గంటలు ప్రచారం చేశారు. ప్రచార రథంపై రెండు ఫ్లడ్‌లైట్లు బిగించి, వాటి కాంతి ఎన్టీఆర్‌పై పడేలా ఏర్పాట్లు చేయడంతో అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా ఎన్టీఆర్‌ను చూసేందుకు ప్రజలు ఎదురుచూసేవారు. అన్నపానీయాలూ సరిగా ఉండేవి కావు. మధ్యాహ్నం తినాల్సిన అన్నం ఏ సాయంత్రానికో, రాత్రికో చల్లగా అయిపోయాక తినాల్సివచ్చేది.


చైతన్యరథ చక్రాలు కదిలిందిలా!

ఎన్టీఆర్‌ రాజకీయ రంగ ప్రవేశం చేశాక మొదట మూడు మహానాడులు నిర్వహించారు. ఆ తర్వాత రాష్ట్ర పర్యటనకు కర్నూలు నుంచి శ్రీకారం చుట్టారు.  ఆయన జీపులోనే కర్నూలుకు వెళ్లారు. తుంగభద్ర గెస్ట్‌హౌ్‌సలో వీరు బసచేయగా...ఆ ప్రాంతానికి జనం విపరీతంగా పోటెత్తారు. బహిరంగ సభకు వెళ్లేందుకు ఆ జీప్‌కు ఉన్న పైటాప్‌ తీసేయాలని ఎన్టీఆర్‌ చెప్పారు.  ‘రాష్ట్రపర్యటన ఇలా జీపులో కాదు. మరో ఏర్పాటుండాలి’ అని రామకృష్ణ స్టూడియో్‌సలో చర్చ జరిపారు. రకరకాల ప్రతిపాదనలు వచ్చాయి. ఇంతలో ఎన్టీఆర్‌ లేచి రామకృష్ణ స్టూడియో ప్రాంగణంలో ఉన్న ఒక షెడ్డు దగ్గరకు వెళ్లి, దాన్ని ఓపెన్‌ చేయించారు. అందులో దుమ్ముకొట్టుకుపోయిన 1940 మోడల్‌ షెవర్లె వ్యాన్‌ ఉంది. తన పర్యటనకు అదే సరైనదని ఎన్టీఆర్‌ భావించారు. అక్కడే ఉన్న హరికృష్ణను పిలిచి వ్యాన్‌కు మరమ్మతులు చేయించాలన్నారు.  ఇంజన్‌, కొత్త టైర్లు బిగించారు. వ్యాన్‌ లోపల మంచం, రివాల్వింగ్‌ కుర్చీ, వాష్‌ బేసిన్‌, చిన్న అద్దం ఏర్పాటయ్యాయి. వ్యాన్‌ పైభాగాన్ని కోసేసి, పైకి ఎక్కడానికి ఒక అల్యూమినియం నిచ్చెన బిగించారు. టాప్‌ మీద ముగ్గురు, నలుగురు నిలబడేందుకు టాప్‌ను సమతలం చేశారు. మైక్‌, లౌడ్‌స్పీకర్లు ఏర్పాటుచేశారు. ఈ పనులన్నీ చేయడానికి రెండునెలలు పట్టింది. ఎన్టీఆర్‌ దానికి చైతన్యరథం అని పేరుపెట్టారు. 


మూతబడ్డ జెమిని స్టూడియో నుంచి తుక్కు కింద కొన్న 

1940 మోడల్‌ షెవర్లే వ్యాన్‌ను ఎన్టీఆర్‌ తన రాజకీయ పార్టీ ప్రచారం

కోసం చైతన్య రథంగా ఉపయోగించుకున్నారు. తిరుపతిలో మొదలై 

తిరుపతిలో ముగిసిన ఈ యాత్రలో ఈ రథంపైనే 35 వేల కిలోమీటర్లు తిరిగారు.బసవతారకం కంట కన్నీరు..

బాలకృష్ణ, రామకృష్ణల పెళ్లి రోజున ఎన్టీఆర్‌ లేకపోవడంతో బసవతారకం కన్నీరుపెట్టుకున్నారు. ఆ తర్వాత ఒక్క క్షణం కూడా ఆయన్ను చూడకుండా ఉండలేనంటూ నెల్లూరు జిల్లాలో ప్రచారం చేస్తున్న ఆయన దగ్గరకు బయలుదేరారు.  ఆ జిల్లాలో ఆయన పర్యటించే ఒక ప్రాంతంలో ఆయన రాక కోసం వేచి చూశారు. అడుగడుగునా జనం వెల్లువెత్తడంతో చాలా గంటలు ఆలస్యంగా ఎన్టీఆర్‌ అక్కడికి చేరుకున్నారు.  జనం మాత్రం చెక్కుచెదరని అభిమానంతో ఆయన కోసం వేచి చూస్తున్నారు. ఆయన్ను చూసి వారిలో ఆనందం వెల్లువెత్తింది. నల్లగా మారిన ఎన్టీఆర్‌ను చూడగానే బసవతారకం దుఃఖం ఆపుకోలేకపోయారు. ‘ఈ రాజకీయాలు వద్దు. నాకు, నా పిల్లలకు మీరే కావాలి’ అంటూ ఎన్టీఆర్‌ను పట్టుకుని భోరున విలపించారు. ఎన్టీఆర్‌ ఆమెను ఓదార్చి... జనాన్ని చూపిస్తూ ‘వీళ్లంతా ఎవరు తారకం? వీరు మాత్రం మనవాళ్లు కారా?’  అన్నారు. ఆ మాటతో బసవతారకం ఊరట చెందారు.


తొలి పొత్తుల్లోనే చిత్రాలు...

తొలి ఎన్నికల్లో ఎన్టీఆర్‌ను పొత్తుల కోసం కమ్యూనిస్టులు ఆహ్వానించారు. సీపీఎం నేతలు సుందరయ్య, మోటూరి హనుమంతరావు, సీపీఐ తరఫున నల్లమల గిరిప్రసాద్‌, వైవీ కృష్ణారావు ఈ భేటీలో పాల్గొన్నారు. కమ్యూనిస్టులు 90 సీట్లు అడగ్గా, 60 సీట్లు ఇచ్చేందుకు ఎన్టీఆర్‌ సిద్ధపడ్డారు. కనీసం 65 సీట్లు ఇవ్వాలని కమ్యూనిస్టులు పట్టుబట్టడంతో మరోసారి మాట్లాడదాం అనుకున్నారు. అయితే, ఆ మర్నాడే కమ్యూనిస్టులు తాము పోటీచేసే 70 స్థానాల జాబితాను విడుదల చేసేశారు. దీంతో ‘మనం ఒంటరిగానే పోటీచేస్తున్నాం’ అని పార్టీ నేతలకు ఎన్టీఆర్‌ స్పష్టం చేసేశారు. అభ్యర్థుల ఎంపిక పూర్తిచేస్తుండగా ఢిల్లీ నుంచి అకస్మాత్తుగా మేనకాగాంధీ వచ్చారు. తన పార్టీ సంజయ్‌విచార్‌మంచ్‌కు 10 సీట్లు ఇవ్వాలని కోరారు. అత్త ఇందిరమ్మకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని ప్రతిపాదించారు. ఆ తర్వాత ఐదు సీట్లు ఇస్తే చాలన్నారు. అలా ఆ పార్టీ ఐదు సీట్లు తీసుకుని పొత్తు కుదుర్చుకోగా, అందులో నాలుగు సీట్లు గెలిచింది. ఎన్టీఆర్‌తో పొత్తు పెట్టుకోకపోవడం సరైన ఎత్తుగడ కాదని కమ్యూనిస్టులు ఆ తర్వాత గ్రహించారు. 


అభ్యర్థులకు ప్రసంగ పరీక్ష....

తమ పార్టీ అభ్యర్థుల ఎంపికకు ఎన్టీఆర్‌ రకరకాల పద్ధతులు అనుసరించారు. యువత, పట్టభద్రులకు ప్రాధాన్యం ఇచ్చారు. ఆయా ప్రాంతాల్లో పట్టున్న కుటుంబాలను ఎంపిక చేశారు. ప్రజల్లో ఎవరికి పేరుందని ఆరా తీసేవారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెద్దపీట వేశారు.  ఈ క్రమంలో సుమారు 26 ఏళ్ల యువకుడు తనకు సీటు కావాలని ఆయన్ను అడిగారు. దీంతో ఇక్కడున్నవారిని ఉద్దేశించి ఐదు నిమిషాలు ప్రసంగించు అని ఎన్టీఆర్‌ పరీక్ష పెట్టారు. ఆ యువకుడు చక్కగా ప్రసంగించడంతో అతనికి సీటు ఇస్తున్నట్లు ఆ క్షణంలోనే ఎన్టీఆర్‌ ప్రకటించారు. ఆ యువకుడే మోత్కుపల్లి నర్సింహులు. ఎర్రన్నాయుడు, కళా వెంకట్రావు, యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరిలాంటి నాటి యువకులనంతా ఎన్టీఆరే ఎంపికచేశారు. తొలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 289 స్థానాల్లో పోటీ చేసింది. 28 మంది పోస్టు గ్రాడ్యుయేట్లు, 20 మంది వైద్యులు, 47 మంది న్యాయవాదులు, ఎనిమిది మంది ఇంజనీర్లు సహా మొత్తం 125 మంది పట్టభద్రులు ఉన్నారు. ఈ అభ్యర్థుల సగటు వయసు 41 ఏళ్లు. కాంగ్రెస్‌ అభ్యర్థుల సగటు వయసు 50 ఏళ్లు.

అది మీకే సంభవం!


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.