ఆ భూమినీ పంచేశారు!

ABN , First Publish Date - 2021-11-22T05:10:45+05:30 IST

రైతులకు పాసు పుస్తకాలు మంజూరు చేసి ఆనలైనలో నమోదు చేయాలంటే చుక్కలు చూపిస్తారు.

ఆ భూమినీ పంచేశారు!
సర్వే నెంబర్‌ 139లో ఆక్రమణకు గురవుతున్న ప్రభుత్వ భూమి

  1. సర్వే నెంబర్‌ 139లో అక్రమాలు
  2. గతంలో పేదలకు ఇంటి స్థలాలు
  3. ఆ భూములలో అక్రమార్కుల పాగా
  4. ఆనలైన చేసిన రెవెన్యూ అధికారులు


కల్లూరు, నవంబరు 21: రైతులకు పాసు పుస్తకాలు మంజూరు చేసి ఆనలైనలో నమోదు చేయాలంటే చుక్కలు చూపిస్తారు. కానీ దళారులను ఆశ్రయిస్తే ప్రభుత్వ భూములను అప్పనంగా ముట్టజెప్పేస్తారు. కొందరు రెవెన్యూ అధికారులకు అడిగినంత ఇస్తే ఏ మాత్రం ఆలస్యం లేకుండా ప్రభుత్వ భూములైనా ఆనలైనలో ఎక్కించేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ భూముల్లో వారు సాగులో ఉన్నారని, వేరొకరి నుంచి కొన్నారని చూపించి అక్రమాలకు పాల్పడుతు న్నారని ప్రజలు అంటున్నారు. ఖాళీగా ఉండే భూముల విషయం అటుంచితే, జిల్లా ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించిన రూ.కోట్ల విలువ చేసే భూములను పరాధీనం చేస్తున్నారు. ఇందుకు దూపాడులోని సర్వే నెంబర్‌ 139లో జరిగిన అక్రమాలే నిదర్శనం.

అసైనమెంట్‌ కమిటీ ఆమోదించినా..

కల్లూరు మండలం దూపాడు గ్రామ సర్వే నెంబర్‌ 139లో 64 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. 2013లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం అసైన్మెంట్‌ కమిటీ చైర్మన పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, అప్పటి కలెక్టర్‌ సుదర్శన రెడ్డి ఆధ్వర్యంలో 14 ఎకరాలను 450 మంది పేదలకు ఇంటి స్థలాలుగా ఇచ్చారు. ఆ తరువాత పలువురు అధికారులు మారిపోయారు. ప్రభుత్వాలు మారిపోయాయి. అవే 14 ఎకరాల భూములను కొందరు రెవెన్యూ అధికారులు గుట్టుచప్పుడు ఇతరులకు ఆనలైన చేసి పాసుపుస్తకాలు ఇచ్చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. 2020 అక్టోబరులో ఓ అధికారి సర్వే నెంబర్‌ 139లోని ప్రభుత్వ భూములను తన సామాజికవర్గానికి చెందిన కొందరికి కేటాయించారని, రికార్డులు మార్చి ఆనలైన చేసి పాసుపుస్తకాలు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. 

భూముల ధరలకు రెక్కలు

దూపాడు గ్రామం నగర పాలక సంస్థలో విలీనం కావడంతో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో అందరి కన్ను రింగ్‌ రోడ్డు సమీపంలో ఉన్న దూపాడు గ్రామ ప్రభుత్వ భూములపై పడింది. రూ.కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను, అదీకాక.. ప్రభుత్వం 450 మంది పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఆ 14 ఎకరాలను కొందరు అధికారులు దళారులకు పంచిపెడుతున్నారని సమాచారం. 

అర్హులకు కేటాయిస్తాం..

కొందరు సాగుదారులకు భూమి ఆనలైన చేసిన మాట వాస్తవం. 2013లో సర్వే నెంబర్‌ 139లోని ప్రభుత్వ భూమి 12.25 ఎకరాల్లో అసైన్మెంట్‌ కమిటీ 450 మంది పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చింది వాస్తవమే. సదురు భూమిలో సర్వే చేయించి అర్హులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తాం. సర్వే చేయాలని భూమిపైకి వెళ్లిన సిబ్బందిని కొందరు రైతులు అడ్డుకున్నారు. 

   - టీవీ రమేష్‌బాబు,  తహసీల్దార్‌, కల్లూరు 




Updated Date - 2021-11-22T05:10:45+05:30 IST